Home దునియా అరూప ఆరాధన ప్రకృతే పరమాత్మ

అరూప ఆరాధన ప్రకృతే పరమాత్మ

Lambadies

పండుగలన్నీ ప్రకృతిని ఆరాధించేవే. మంత్రాలు, వేదాలు తండాలలో లేవు. తండాలో దేవుళ్ళ గుడులు , గోపురాలు కట్టి పూజించే సాంప్రదాయం లంబాడీలకు లేదు. పంట కోసే ముందు, విత్తనం వేసేటప్పుడు మూడురాళ్ళను కడిగి, బొగ్గు, పసుపు రాసి మొక్కులు తీర్చుకునేవారు. పంట రాసులు పండితే అదే తంతు జరిపేది. ఆ రాళ్ళు మళ్ళీ పొలంలో కలిసి పోయేవి. వేటకు వెళితే అదే తంతు లంబాడీల్లో ఉండేది. దేవుళ్ళకు రూపం, విగ్రహాలు గాని బంజారాలలో లేవు. ఆయా సందర్భాన్ని బట్టి పూజలు చేసుకునేవారు. ఇప్పటిలాగ స్వాములు, బ్రాహ్మణులు వస్తేనే పెండ్లి మంత్రాలు చదువుకునే పూజలు వీరికి లేవు.

ప్రకృతి ఆధారంగా తరతరాలుగా తండాలను ఏర్పరచుకొని లంబాడీలు తమ మనుగడను కాపాడుకున్నారు. ఇందుకోసం అడవి దగ్గరగా భూమి, నీళ్లు పశుసంపదను అభివృద్ధి చేసుకున్నారు. ఇతరుల దాడుల నుంచి తమ సాంస్కతిక ఆచార అలవాట్లు కాపాడుకొంటూ తమ సొంత వనరులపై ఆధారపడి తండా సమాజాన్ని ఏర్పచుకున్నారు. గిరిజనుల సంస్కృతి పూర్తిగా సమాజానికి దూరంగా ఉంది. భాష, పండుగలు, పెళ్లిళ్లు, సాంప్రదాయ దుస్తులు, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పంచాయితీలు, వారి రంగులు, జీవన విధానం పూర్తిగా అడవిపై ఆధారపడి ఉంటాయి. రాజులు, సంస్థానాలు పాలిస్తున్న రోజుల్లో వీరికి భూమి దక్కలేదు. అడవి, కొండ, వాగులను ఆసరా చేసుకొని జీవనం సాగించారు.

పృధ్విరాజ్ చౌహాన్ 1149లో అజ్‌మీర్‌లో పుట్టి ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించాడు. యుద్ధంలో ముస్లింరాజును జయించాడు. బంజారా అయినప్పటికీ జయచంద్ర రాథోడ్ ముస్లింరాజుతో చేతులు కలపడంతో పృద్వీరాజ్‌ను 1192లో తరోలిలో అంతం చేసి తరువాత ఆయన వంశస్థులైన లంబాడీ (బంజారాలు)లు ఎక్కడ కనబడ్డా దాడులు చేయడం ప్రారంభించారు. దీనితో లంబాడీలు వలసబాట పట్టారు. అడవే ఆధారంగా జీవనం సాగించారు. సంచార జీవనంలో చెల్లా చెదురైనారు.

17వ శతాబ్దంలో అనంతపురం జిల్లా గుత్తిమండలం రాంజి తండాలో జన్మించిన సేవాలాల్ మహరాజ్ లంబాడీలను చైతన్యపరచడం కోసం దేశం మొత్తం తిరిగాడు. పశువులను గొర్లను కాసుకుంటూ ఉప్పు అమ్ముకుంటూ కాలం వెళ్ల్లదీస్తున్న కాలంలో సేవాలాల్ మహరాజ్ బంజారాలకు కొన్ని సూచనలు చేశాడు. లంబాడీలు జీవించాలంటే ముందుగా స్థిరపడాలని ఆదేశించాడు. అడవికి దగ్గర తండాలు ఉండాలి అన్నాడు. అటవి కుడివైపు ఉంటేటట్లు తండాను స్థిరపరచుకోవాలి.

కుడివైపు నుండి ఎడమవైపు నీళ్లు ప్రవహించే ప్రాంతం అయి ఉండాలి అన్నాడు. జీవనం కోసం భూమి, నీళ్ళు, సాగుభూమి స్థిరపరచుకోవాలి అన్నాడు. బట్టలు లేని ఆనాడు నెమలి రంగులో వస్త్ర ధారణ ఉండాలి అన్నాడు. ఒకే తాను బట్ట లేదు కాబట్టి లంగ, బురుకు, జాకెట్టు, నెమలి ఆకారాన్ని చూసి తయారు చేసుకున్నవే. నెమలిలా లయబద్ధంగా మహిళలు ఆడాలి అన్నాడు. కోయిలలా పాటలు పాడుకోవాలి అని సూచించాడు. అడవి ఫలాలతో గుడుంబ తయారు చేసుకొని పండుగలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నాడు.

అప్పటి తండా ప్రజలకు గాని లంబాడీలకు గాని బ్రాహ్మణులు తెలియరు. తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.

మేరమ్మ
వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెండ్లికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు.

త్వళ్జ : పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు, గాదెలు నిండే ఉండే విధంగా ఉండాలని కష్టాలు రాకుండా కాచుకోవాలని పూజిస్తారు. అల్లుళ్లు, బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.

సీత్ల : తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, మొక్కులు తీర్చుకుంటారు.

మత్రల్ : ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ పూజిస్తారు.

హింగళ : పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని మొక్కుకుంటారు.

ధ్వాళ్ అంగళ్ : అడవిలో ఉండే పక్షులు, జంతువులు బాగుండాలని వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని పాలపిట్ట, పక్షి రోజు తండాకు కనబడిపోవాలని ఆరాధిస్తారు.

కంకాళి : మానవునిపై ధాన్యాలపై పశు సంపదలపై ఎటువంటి శత్రువుల దాడి కుట్రలు జరగకుండా దరిచేరకుండా ఉండేందుకు బాధ్యతగా చూసుకోవాలని మొక్కుకుంటారు లంబాడీలు. పెండ్లి అయిన అమ్మాయిలకు ఒక తులం బంగారం ఒక కిలో వెండి 12 రూపాయి నాణేలతో దండ, కొంకుణాలు, చేతివేళ్ళకు మేరికలు, రైకలు, లంగాల నిండా అద్దాలు, గవ్వలు, తెల్లటి గాజులు చేతినిండా ఉండేవి. పెండ్లి అయిన అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మి వచ్చింది అనేది అనాడు లంబాడీల విశ్వాసం.

కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా తమ జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమేనని లంబాడీలు గుర్తించాలి.

గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెండ్లి అయినా పంచాయితీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. తండా కట్టుబాట్లు అభివృద్ధి వైపు ఉండేవి. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండామీద పడుతున్నాయి. దీనితో వారి జీవన విధానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. తండాపై ఇతర సంస్కృతులను రుద్దకుండా ప్రయత్నం చేద్దాం అమలు చేద్దాం. అమలు చేయాలని అని ఆశిద్దాం.

ఎం. ధర్మ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గిరిజన సంఘం, సెల్ : 9490098685