Home వార్తలు పట్టుపురాణి పోచంపల్లి

పట్టుపురాణి పోచంపల్లి

sareeనల్గొండ జిల్లా పోచంపల్లి అందంగా నేసే చీరలకు ప్రసిద్ధి. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పోచంపల్లికి పేరు. పోచంపల్లి అంటే కేవలం ఒక్క ఊరు కాదు. 80 గ్రామాలు కలిసిన ఒక క్లస్టర్. ఇది హైదరాబాద్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడంతా అంతా నేతకారులే. 2000 చేతిమగ్గాలు, 5000 మంది నేతకారులు ఉంటారు. పోచంపల్లి చేతి మగ్గాల మీద కాటన్,పట్టు, ఇంకా సీకోతో చీరలు తయారు చేస్తారు.ఒక్క చీరలే కాదు, మహిళలకు సంబంధించిన చాలా రకాల దుస్తులు నేస్తారు. అలవోకగా రంగురంగుల దారాలతో అందమైన చీర మగ్గం మీద తయారవుతుంటే చూడటానికి కళ్లు చాలవు. పోచంపల్లి డిజైన్ చూడగానే గుర్తుపట్టేట్టు ఉంటుంది.పట్టు వెరైటీలు ఎన్ని ఉన్నా పోచంపల్లి స్థానం ప్రత్యేకం. పట్టుదారాలను, మహిళల మనసులతో కలిపి ఘనమైన పట్టుచీరలను బయటకు తీసే నేతకారుల జీవితాలోల, వారు చీరలకు అద్దినన్ని రంగులుండవు. కేవలం తెలుపు,నలుపు వర్ణంతో బాధాతప్తంగా ఉంటాయి. పోచంపల్లి చీరల గురించి, తన మగ్గం మీద తానే కూలీగా బతుకుతున్న నేతకారుల గురించి కొన్ని విశేషాలు ఈ ఆదివారం కథనం..

పోచంపల్లి పట్టు చరిత్ర
పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అంటారు. ఆచార్య వినోభా భావే భూదాన్ మూవ్‌మెంట్ ఇక్కడి నుంచే ఆరంభించారు. అంతకు ముందు కాటన్ మాత్రమే నేసేవారు. 1970 నుంచి పట్టు చీరల తయారీ ప్రారంభం అయింది. పంచాయితీ పెద్దలు కొందరు, బతుకుతెరువు మరింత మెరుగుపరచుకోవడానికి కాటన్‌తో పాటు పట్టు కూడా నేయాలని నిర్ణయించారు. కాటన్ నేత చాలా కాలం నుంచీ ఉంది. ఇద్దరు యువ నేతలను బెంగుళూరు పంపి నేతలో మెలకువలు తెలుసుకోమన్నారు. అదే పోచంపల్లి చేతిమగ్గాల పరిశ్రమకి ఒక పెద్ద ఆరంభం. ఒరిస్సా పరిశ్రమలాగా కాకుండా పోచంపల్లి చీరలు ఆదునికంగా ఉంటాయి. పోచంపల్లి చీరల తయారీ ఇక్కత్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ టెక్నిక్ చీరాల నుంచి పోచంపల్లికి వచ్చింది. పోచంపల్లి వార్ప్ ఇక్కత్‌తో మొదలుపెట్టి డబల్ ఇక్కత్ మీద పనిచేయడం మొదలు పెట్టారు. కాటన్‌లో చేసిన ప్రయోగం విజయవంతం అవడంలో అది పట్టు మీద కూడా చేపట్టారు. ఎంతో నైపుణ్యం ఉన్న చేతి కళాకారులు చూపే నైపుణ్యమే పోచంపల్లి చీరలు. దాని వెనక దశాబ్దాల అనుభవం ఉంది.
పోచంపల్లి ఇక్కత్ నేతలో టైయింగ్, ఇంకా డైయింగ్ అనే ప్రక్రియలో 18 అంకాలుంటాయి. నేసేముందు బండిళ్లకొద్దీ దారానికి రంగులద్దుతారు. పోచంపల్లి నేతలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, వార్ప్, ఇంకా వెఫ్ట్ మీదకు పోచంపల్లి డిజైన్‌ను దింపుతారు. నేయబోయే బట్ట డిజైన్ రంగు అద్దిన దారాల్లో కనిపిస్తుంది. ముందుగా ముడి పట్టును డీగమ్ చేస్తారు అంటే అందులో ఉన్న పట్టుపురుగులు వదిలే సెరిసిన్ అనే ఒక ప్రోటీన్‌ను పట్టు నుంచి తీసేస్తారు. అలా దాన్నుంచి గమ్ తీసేయడం వలన పట్టుకు మెరుపు వస్తుంది. రంగు మెరుగుపడుతుంది. తర్వాత పట్టును కండెల నుంచి బాబిన్లకు ఎక్కిస్తారు. కళాకారుడి నైపుణ్యం చూడాలంటే కండెల నుంచి బాబిన్‌లకు పట్టును ఎక్కించేటప్పుడు చూడాలి. బాబిన్‌లకు చుట్టిన తర్వాత అంకం టై అండ్ టై ఫ్రేమ్ మీద వార్ప్ అండ్ వెఫ్ట్‌ను సిద్ధం చేసుకోవడం. ఇక్కత్ ఒకరకమైన నేత. దాంట్లో వార్ప్,వెఫ్‌న్టు చీర మీద డిజైన తయారు చేసి నేయడానికి ముందు టై అండ్ డై చేస్తారు.
పోచంపల్లి పరిస్థితి బావుంది
పోచంపల్లి చేనేత కార్మికులు అనేక రకాల సమస్యల కారణంగా ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఉన్న ఊరులో నేసిన బట్టకు మార్కెట్ లేక,కూలీ సరిపోక,గిట్టుబాటు ధరలు లేక ఊరును వదిలి పోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అలా వదిలిపోయిన కార్మికులు సంతోషకర జీవితం గడపటంలేదు. సెక్యూరిటీ గార్డులుగా,వాచ్‌మేన్‌లుగా పనిచేసుకుంటున్నారు. అక్కడైనా పూటగడవని పరిస్థితులే ఎదుర్కుంటున్నారు. అయితే గత ఏడాదిన్నర నుంచి పోచంపల్లి చీరలకు డిమాండ్ పెరిగి మార్కెట్ విస్తృతం అవుతోంది. పోచంపల్లి నేతకారులకు మంచి రోజులు రాబోతున్నాయనే అంటున్నారు.
చేనేత వ్యవస్థలో ఉన్న విభిన్న రకాల నేతకారులు
sareeస్వతంత్ర కార్మికులు(స్వంత మగ్గం కల కార్మికులు)ః అంతకుముందు స్వతంత్ర కార్మికులు ఉండేవారు. అప్పుడు కార్మికులే యజమానులు.కార్మికులకు,రైతులకు మధ్య మంచి సంబంధాలుండేవి. రైతులు పత్తి పండించి నేతలకిస్తే వారు నేసి ఉత్పత్తి చేసేవారు. కాబట్టి తక్కువ ధరకే చేనేత వస్త్రాలు దొరికేవి. వారే సొంతంగా డిజైన్లు కనిపెట్టి నేసేవారు. ఎవరికి నచ్చినట్టు వారికి నేసి ఇచ్చేవారు. సమస్యను ఎదుర్కునే నైపుణ్యం వారికుండేది. పెట్టుబడిదారి వ్యవస్థ పెరిగింది కాబట్టి స్వతంత్ర కార్మికత తగ్గింది. ఇప్పుడు నేతకారుని నైపుణ్యం,శ్రమ,సమయం తీసుకుని వారికి కూలీ చెల్లిస్తున్నారు కార్పొరేట్లు,దళారీలు,పెట్టుబడిదారులు.నేతకారుని సృజనాత్మకతతో పని లేదు. పెట్టుబడిదారులు ఏం నేయమంటే అది నేయాలి అంతే.అది ఇప్పటి పరిస్థితి.
పెట్టుబడిదారులు-మాస్టర్ వీవర్స్: చేనేత రంగంలో పెట్టుబడిదారులు పెరుగుతున్నారు. అవి బయట దుకాణదారులు కావచ్చు,వ్యాపారస్థులు కావచ్చు. మాస్టర్ వీవర్స్ కావచ్చు. నూటికి నూరు శాతం మాస్టర్ వీవర్స్ కూడా పెట్టుబడిదారులే. అయితే వీరు కూడా ఒకప్పుడు నేతకారులే. వారి పెట్టుబడి సామర్థం బట్టి కార్మికులకు నూలు ఇవ్వడం,ఉత్పత్తి అనంతరం మార్కెట్ చేయడం చేస్తున్నారు. దాదాపు 70 శాతం మంది నేతకారులు కార్మికులుగా పెట్టుబడిదారుల దగ్గరే పని చేస్తున్నారు. సొంతంగా పెట్టుబడి పెట్టుకుని నేసి మార్కెటింగ్ చేసే స్థోమతలేనివారు మాస్టర్ వీవర్స్ దగ్గరే పనిచేయాలి. వారికి అంతకన్నా మార్గం లేదు.
కమీషన్ ఏజంట్లు, డిజైనర్‌లు, బ్రాండ్ షాపులు: వీరు కూడా పెట్టుబడిదారులే. కమీషన్ ఏజంట్లు కూడా సాధారణ సాధారణ నేతకారులే. వీరికి ఉండే మగ్గం కాక ఇంకో రెండు మూడు మగ్గాలుంటాయి వీరి దగ్గర. నేత కార్మికులకు పెట్టుబడి పెట్టేంత స్థోమత వీరికుండదు కాని ప్రధాన పెట్టుబడి దారులకు కార్మికులకు మధ్య కమీషన్ ఏజంట్‌గా ఉంటారు. చేనేతలపై ధనిక వర్గాలలో ఉన్న మక్కువను గమనించి కొందరు డిజైనర్లు,కొన్ని ప్రత్యేక షాపులు తమకు కావలసిన రీతిలో వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కూడా కమీషన్ పద్ధతిలోనే వ్యాపారం జరుగుతుంది.
హ్యాండ్‌లూమ్ పార్క్
పోచంపల్లిలో హ్యాండ్‌లూమ్ పార్క్ అనే కంపెనీ ఉంది. పోచంపల్లికి చెందిన మాస్టర్ వీవర్‌లు,వ్యాపారులు కలిసి కొంత టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్ నుంచి రుణం తీసుకుని మరికొంత సొంతంగా కలిపి మొత్తం 10 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది ఆరంభించారు.ఇక్కడ మగ్గాలుంటాయి. వీవర్లు వచ్చి నేసి వెళ్లిపోతారు. ఇక్కడ నుంచి వీవర్‌కి ఎప్పటికీ పని ఉంటుంది.ఒకప్పుడు ఉంది, ఇంకోప్పుడు లేదన్న మాట ఉండదు. ఇప్పుడున్న కొత్త డిజైన్ చీరల ధర ఐదువేల నుంచి పదివేల వరకు ఉంటుంది. ఒక చీరకు నేసినందుకు 600 నుంచి 800 ఇస్తారు. సాధారణంగా రెండు,మూడు రోజుల్లో ఒక చీర నేయవచ్చు. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మరిన్ని ఎక్కువ గంటలు నేస్తారు.
మార్కెట్ దెబ్బతీస్తున్న పవర్‌లూమ్స్
పోచంపల్లి నేత అంటే చేతిమగ్గాల మీదనే నేస్తారు. పవర్‌లూమ్‌ల మీద పోచంపల్లి నేయరు. సిరిసిల్లా,భువనగిరి లాంటి కొన్ని చోట్ల పోచంపల్లి డిజైన్లను కాపీ చేసి పవర్‌లూమ్‌ల మీద నేస్తున్నారు. అవి కూడా చూడటానికి పోచంపల్లి లానే ఉంటాయి. అయితే పోచంపల్లిలో ప్యూర్ పట్టు వాడతారు. పవర్‌లూమ్‌ల మీద ప్యూర్ పట్టు వాడరు. కల్తీ ఉంటుంది. కొనుక్కునేవారికి నాణ్యతలో తేడా తెలిసిపోతుంది. హ్యాండ్‌లూమ్‌లో డిజైన్ ఫినిషింగ్ కదులుతున్నట్టు ముందుకు,వెనక్కు ఉంటుంది. అదే పవర్‌లూమ్స్ మీద నేసినవాటికి డిజైన్ గీసినట్టుంటుంది. ముఖ్యంగా పల్లు ప్రాంతంలో తేడా తెలుస్తుంది. 5000 రపాయలు ఉండే పోచంపల్లి హ్యాండ్‌లూమ్ చీరలాటిదే పవర్‌లూమ్ మీద నేసి 2000 రూపాయలకే అమ్ముతున్నారు. అయినా పోచంపల్లి చీర విలువ దానికే ఉంటుంది.
రాష్ట్రప్రభుత్వ సహాయం ఉంటే బావుండు
చేనేత పరిశ్రమకు 100 ఏళ్లు దాటిపోయింది. మొదట్లో తెల్ల దారం తీసుకొచ్చి చేతి మగ్గాలతో తెల్లబట్ట తయారుచేసేవారు. కొంతమంది వీవర్స్ దాన్ని టై అండ్ డై చేయడం మొదలుపెట్టారు. చెట్లు,పూల నుంచి తీసిన సహజరంగులు ఉపయోగించేవారు. 1955 సమయంలోనే ఒక వందమంది దాకా నేతకారులతో కోఆపరేటివ్ సౌసైటీ ఆరంభం అయింది. గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. సొసైటీ నేతకారులకి ముడిసరుకు,రంగులు అందిస్తుంది. వారి ఉత్పత్తికి మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు 950 మంది సభ్యులు సౌసైటీలో ఉన్నారు. సౌసైటీ ఎప్పుడూ ఎంత మార్కెట్ చేయించగలదో అంతమందినే సభ్యులుగా తీసుకుంటుంది. మూడున్నర కోట్ల రూపాయల వరకు మార్కెటింగ్ చేస్తోంది. 2002 సమయంలో కొంతమంది నేతకారులు గిట్టుబాటు ధర రాక,అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణం ఇస్తే అభివృద్ధి చెందుతారు అనుకోడానికి కూడా లేదు. మార్కెట్ లేకపోతే రుణం ఇచ్చి ఏం లాభం? వీవర్స్‌కి పెద్ద సమస్య మార్కెటింగే. జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ వారు ముడిసరుకు మీద 10 శాతం సబ్సిడీ ఇస్తారు. ఆమధ్య బంద్ చేశారు కాని ఇప్పుడు మళ్లీ ఇస్తున్నారు. మళ్లీ బంద్ చేయకుండా అట్లనే ఇస్తే బావుంటుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఇంకో 10 శాతం కూడా ఇస్తే నేతకార్లకు ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వం తన తరపున పోచంపల్లి దుస్తుల స్టాళ్లు ఏర్పాటు చేయిస్తే మంచిది. ఎగ్జిబిషన్లలో కూడా ప్రభుత్వం తరపునుంచి మాకు స్టాల్ పెట్టిస్తే ఉపయోగంగా ఉంటుంది. సొసైటీ తరపున ఒక షోరూమ్ పోచంపల్లిలో ఉంది. కొన్ని ప్రభుత్వ ఎంపోరియమ్‌లకు మేము చీరలు సరఫరా చేస్తాం. షోరూమ్‌లకు కూడా మా నుంచి చీరలు వెళ్తాయి. బయట షాపులో అయితే ఆ షాపును బట్టి చీర ధర ఉంటుంది. అదే సొసైటీలో అయితే సరసమైన ధర ఉంటుంది. సొసైటీ సభ్యుడు,రుద్ర ఆంజనేయులు
అంతంతమాత్రపు ప్రభుత్వ పథకాలు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం కోసం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో వివిధ పథకాలు అమలు జరుపుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చింది మొదలుకుని ఇప్పటి వరకు వివిధ రకాల పథకాలు రూపాలు మారాయి కాని వాటి అమలు ఒకే పద్ధతిలో జరుగుతోంది. చేనేత కార్మికులంటే ప్రభుత్వం దృష్టిలో సహకార సంఘంలో కార్మికులు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఏ విధమైన పథకం రూపొందించినప్పటికీ దాని అమలు మాత్రం సహకార సంఘాల ద్వారానే జరుగుతోంది. చేనేత కార్మికులు సహకారం రంగం,సహకారేతర రంగంలో ఉన్నారు. వివిధ అధ్యయనాలు,అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం కేవలం పది శాతం మంది కార్మికులు మాత్రమే సహకార సంఘాలలో ఉన్నారు. ఈ పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే ప్రభుత్వం అమలు చేసే పథకాలలో ఏవిధమైన మార్పు చేయకపోవడం చర్చించాల్సిన విషయం. ప్రాజెక్ట్ ప్యాకేజీ పతకం,సమగ్ర చేనేత గ్రామీణాభివృద్ధి పథకం,హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ సెంటర్ అండ్ క్వాలిటీ డైయింగ్ యూనిట్స్ లాటి కొన్ని ప్రభుత్వ పథకాలున్నా ఎంతమంది చేనేత కార్మికులు లబ్ది పొందుతున్నారన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతం బున్‌కర్ యోజన కింద చేనేత కార్మికులకు బీమా సౌకర్యం ఉంది. వీరు ఏడాదికి 1000 రూపాయలు కడితే ఏదన్నా హాని జరిగితే 50000 రూపాయలు, కాళ్లు,చేతులు విరిగితే 30000రూపాయలు బీమా మొత్తం దొరుకుతుంది. ఇంకోటి వర్క్ షెడ్ పథకం. ఇందులో వీవర్స్ తమ హ్యాండ్‌లూమ్ సొంతంగా పెట్టుకోవడానికి రుణం ఇస్తుంది. దీన్ని వర్క్‌షెడ్ స్కీమ్ అంటారు. 30000 నుంచి 50000 వరకు రుణం ఇస్తుంది. అందులో 40 శాతం రాయితీ ఇస్తుంది. వృద్ధాప్య పెన్షన్ మిగిలిన వారి కంటే వయసు సడలింపు ఉంటుంది. వీరికి 55 ఏళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. అంతే. మాత్రం సాయం ప్రభుత్వం నుంచి వీరికి సరిపోదు. ఉన్న పథకాలు బాగా అమలు చేయడంతో పాటు మరిన్ని పథకాలు వస్తేనే చేనేత బతుకుతుంది.

ఇప్పుడు పోచంపల్లి రంగులకు గ్యారంటీ

నాకు 40 ఏళ్లు. మాస్టర్ వీవర్‌ః మగ్గాలు నేసేవాళ్లుంటారు. నేను మాస్టర్ వీవర్‌ను. రంగులు,డిజైన్‌లు మేమే నిర్ణయిస్తాం. చీరల షాపుల నుంచి ఆర్డర్లు వస్తాయి. సొసైటీ నుంచి కూడా ఆర్ఢర్లు వస్తాయి. వాళ్లు డిజైన్,కలర్ ఇలా ఉండాలి,అంచు ఇలా ఉండాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి నేయించు కుంటారు. ముడి సరుకు పోచంపల్లిలోనే దొరుకుతుంది. వీవర్‌లలో కూడా కొంతమంది సొంతంగా నేసేవారుంటారు. నా దగ్గర 20,25 మంది వీవర్‌లు ఉంటారు. వాళ్లకి కావలసిన మెటీరియల్ మొత్తం అందివ్వాలి. మగ్గాలు వాళ్ల సొంతమే. ఎవరింటి దగ్గర నుంచి వాళ్లు నేస్తారు. ఒక ఏడాదిన్నర ముందు వరకు మాకు గిట్టుబాటు ధర ఉండేది కాదు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కొత్తగా రాజ్‌కోట ఇక్కత్ డిజైన్ నేస్తున్నాం. అదివరకు కేవలం ఎరుపు,పసుపు,ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు లేత రంగులు, మంచి మంచి రంగులు మార్కెట్ ట్రెండ్‌కి తగ్గట్టు నేస్తున్నాం. సిటీలో కూడా షాపులలో పోచంపల్లి చీరలకు గిరాకీ పెరుగింది. మాకు కూడా ఆర్డర్లు పెరిగాయి. అంతకుముందు ఏడు చీరలు నేయడానికి నేసేవారికి నెల రోజులుల పట్టేది. 5000 రూపాయల వరకు ఇచ్చేవాల్లం.భార్య దారాలు కండెలు పట్టి ఇవ్వాలి. నాడేలకు పెట్టి వీవర్ మగ్గం నేస్తాడు. ఇప్పుడు గిరాకీ పెరిగింది కాబట్టి నెలకు 8000 నుంచి 9000 వేల దాకా కూలీ ఇవ్వగలు గుతున్నాం. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ అనే అంటారు. ఇప్పుడు వచ్చిన రాజ్‌కోట్ డిజైన్ వలన గుడ్డ మరింత నాణ్యం పెరిగింది. పోగు అప్పుడు సన్నగా ఉండేది. ఇప్పుడు పోగు కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి గుడ్డ మందం వస్తుంది. నేసేవాల్లకు కూడా తేలిక. ఎక్కువ చీరలు నేయగలుగుతారు. ఒకప్పుడు తక్కువ కూలీ వలన వీవర్‌లకు పొట్టగడవకపోయేది. ఒకప్పుడు రంగులు గ్యారంటీ ఉండకపోయేది. చీర అమ్మిన షాపులో బిల్లు కింద రంగులకు గ్యారంటీ లేదు అని రాసి ఉండేది. సాధారణంగా ఏ పట్టుచీరలకయినా అదే అంటారు. కాని ఇప్పుడు పోచంపల్లి రంగులకు గ్యారంటీ ఉంది. కాని డ్రైక్లీనింగ్ చేయించుకుంటే మంచిది. పోచంపల్లి నుంచి కేవలం పట్టే నేస్తాం. చుట్టుపక్కల కొయ్యలగూడెం,సిరిపురం,ఎల్లంకి గ్రామాలలో కాటన్ నేస్తారు. పోచంపల్లి చుట్టుపక్కల ఎక్కడ నేసినా అవి పోచంపల్లి దుస్తులనే అంటారు. ఇప్పుడు వీవర్స్ పరిస్థితి అదివరకు లాగా అంత దయనీయంగా లేదు. వారికి ఎంత కావాలన్నా అడ్వాన్సు ఇస్తాం. ఐదారేళ్ల కిందట ప్రత్యేక స్టాళ్లు పెట్టి చీరలు అమ్మేవాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి. అయితే ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మాకయితే ఎప్పుడూ ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్ బాగోలేక వెళ్లిపోయిన్ వీవర్స్ చాలామంది మళ్లీ రాలేదు. నిజానికి ఇప్పుడు డిమాండ్‌కి తగ్గట్టుగా వీవర్స్ లేరు. పరిస్థితి బాగోలేకపోయినా మేము బయటకు పోలేదు. పోతే ఇంకో పని రాదు. అందుకే ఇక్కడే ఉండిపోయాం. ఇప్పటి జనరేషన్ మాత్రం నేయట్లేదు. ఇప్పుడు నేసేవాళ్లు 50,55 ఏళ్ల వారు. 30,35 ఏళ్లవారు కూడా ఉన్నారు. కాని ముందుకు వెళ్లే కొద్దీ వీవర్ల కొరత సమస్య మరింత పెరగచ్చు. పోచంపల్లి పట్టు ఒరిజినల్ ఉంటుంది. కంచి,ధర్మవరం పట్టు సాదారంగులు ఉంటాయి. కాని మేం ప్రత్యేక డిజైన్లతో నేస్తాం కాబట్టి పోచంపల్లికి మంచి స్థానం ఉంది. కడవేరు చాంద్

60 శాతం  పని ఆడవాళ్లదే

నేను 30 ఏళ్ల బట్టి నేస్తున్నాను. చేనేతవృత్తికి గిరాకి బట్టి నాలుగు డబ్బులు వస్తాయి. నేను సొంతంగా నేసి సౌసైటీకి ఇస్తాను. సౌసైటీ సభ్యులుగా ఉండటానికి ఆరు వేల రూపాయలు కట్టాలి. వాళ్లు ముడి సరుకు ఇస్తారు. డిజైన్,రంగు,ఇట్లా ఉండాలని చెప్తారు. నేసి ఇస్తాం. చేసినంత పని ఉంటుంది. మేమే ఒకసారి చేస్తాం. ఇంకోసారి చేయం. నాకు కంటిచూపు తగ్గింది. అందుకే నేను వారానికి ఐదు రోజులే నేస్తాను. మా పెద్ద అబ్బాయి సిటీలో ఉద్యోగం చేస్తాడు. అతనికి కూడా నేత వచ్చు. మా చిన్నబ్బాయి నాకు నేయడంలో సహాయం చేస్తుంటాడు.ఇన్నాళ్లబట్టి నేస్తున్నాం. అయినా మేం ఇంతవరకు పెద్దగా అభివృద్ధి చెందిందేమీ లేదు. అప్పుడు,ఇప్పుడు ఒకలాగనే ఉంది. ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంట్లో ఇంకే అవసరం వచ్చినా అప్పులు చేయాలి. మళ్లీ నేత నేస్తేనే అవసరాలు గడిచేది. అప్పులు తీరేది. మాకేమీ నెల జీతాలు కావు కదా. నేసేవాళ్లలో ఒక 20 శాతం మంది బాగుపడి ఉంటారు అంతే. మిగిలిన 80 శాతం మంది పరిస్థితి అంతే ఉంది. అప్పట్లో గిరాకి లేకపోయినా,పని లేకపోయినా మేం ఇక్కడనే ఉన్నాం. బయటకు పోయి ఏం చేస్తాం? మాకు నేత తప్ప ఇంకో పని రాదు. నేసి నేసి చేతులు,జబ్బలు,వీపు నొస్తాయి. కంటిచూపు సమస్య మాకు ఎక్కువ వస్తుంది. మా ఆడవాళ్లు సహాయం చేయందే మేం నేయలేం. వాళ్లు దారం చుట్టి ఇస్తారు. అన్ని ఏర్పాట్లు వాళ్లు చేసి ఇస్తేనే మేం మగ్గం నేస్తాం. లేకపోతే కష్టం. ఒక చీర నేయాలంటే 60 శాతం కష్టం ఆడవాళ్లదే. ఇద్దరం కలిసి ఇంత కష్టపడితే మాకునెలకి 6000 లేక 8000 వస్తాయి. నాది సొంత మగ్గం కాబట్టి రంగులు అవన్నీ మేమే అద్దుతాం. అట్లా కాకుండా షాహుకార్(మాస్టర్ వీవర్)దగ్గర కూలికి పని చేసే వాళ్లు కూడా ఉన్నారు. చాలామంది నేసేవాళ్లు కూలీకే పోతున్నారు. వాళ్లయితే చీరను బట్టి నెలకి 5000 నుంచి 12000 వరకు ఇస్తున్నారు. కాని మాలాటివాళ్లం కూలీకి పోలేక సొంతంగానే నేస్తున్నాం.
సీతా ప్రసాద్,
చేనేత కార్మికుడు