Home లైఫ్ స్టైల్ నవ్య నాటక శకారంభం యువతరంగస్థలం

నవ్య నాటక శకారంభం యువతరంగస్థలం

life

కథల, జీవిత చరిత్రల నాటకీకరణ, పట్టభద్రుల సృజనకు పట్టం, అనువాద రంగ స్థల అభివృద్ధి, సంప్రదాయ ప్రదర్శనలకు పునరుజ్జీవం 

శతాబ్ధాల కాలం నుంచి తెలంగాణ మాగాణం “కళ కళ కోసంకాదు.. ప్రజల కోసమే” అనే భావనకు నిలువుటద్దంలా నిలిచింది. అందుకే అన్ని కళారూపాలతో పాటు.. సకల కళల సమాహారమైన ‘నాటకం’ కూడా ప్రజా పోరాటాలకు సాంస్కృతిక భూమికను అందించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు కూడా ఇదే నిబద్ధతను ప్రదర్శించిన నాటకరంగం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత పెనుమార్పులకు లోనయింది. ఆంధ్ర ప్రాంత ప్రజలలో విపరీత ఆదరణ ఉన్న సినిమా క్రమక్రమంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రాచుర్యాన్ని సాధించి దేశమంతటా జరిగినట్లే నాటకరంగం పూర్తిగా వెనక్కు తగ్గింది. అయితే నాటకరంగం పైనా, నాటకం పైనా ప్రజలలో ఉండే ప్రేమ కనుమరుగు కాలేదు.
ఎనిమిది అంచెల వ్యూహం : తెలంగాణా రాష్ర్టం రూపొందిన తర్వాత ్ల నాటకరంగాన్ని మళ్లీ ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు తీవ్రంగా మొదలయ్యాయి. వాటిని ప్రజల దృష్టిలో పెట్టుకున్న భాషా సాంస్కృతిక శాఖ నాటకరంగ పురోభివృద్ధికి ఏడు అంచెల నిర్మాణాత్మక వ్యూహాన్ని రూపొందించి అమలుచేయడం మొదలుపెట్టింది. ఆ ఎనిమిది అంచెల వ్యూహం ఇలా ఉంది. 1) సంప్రదాయ పద్య, పౌరాణిక, సురభి నాటకాలను ప్రోత్సహించడం, కొనసాగించడం, 2) ఆధునిక, ప్రయోగాత్మక, సాంఘిక నాటకాలను ప్రోత్సహించడం, 3) జాతీయ, అంతర్జాతీయ భాషల నాటకాలను తెలుగులో నాటకీకరించి ప్రదర్శించడం, 4) హైదరాబాద్‌కే ప్రత్యేకం అనదగిన దక్కనీ నాటకాన్ని, ఉర్దూ నాటకాన్ని ఆదరించి ప్రోత్సహించడం, 5)ప్రముఖ తెలంగాణ కథకులు, సాహితీవేత్తలు రాసిన కథలను నాటకీకరించి ప్రదర్శించడం, 6) జాతీయ, అంతర్జాతీయ నాటక బృందాలను తెలంగాణకు, హైదరాబాద్‌కు ఆహ్వానించి రాష్ర్ట కళాకారులకు, నాటకాభిమానులకు జాతీయ, అంతర్జాతీయ నాటకాన్ని పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడికి దారులు వేయడం, 7) జిల్లాస్థాయిలో వివిధ రకాల నాటక సప్తాహాలు నిర్వహించడం ద్వారా నాటకాన్ని ప్రజలకు చేరువ చేయడం. , 8)ప్రముఖ నాటక కర్తల పేరిట నాటకోత్సవాలు నిర్వహించటం. ఉదా॥ కీ॥శే॥ పందిళ్ళ శేఖర్ బాబు పద్య నాటక సప్తాహం, ఆర్. విద్యా సాగర్‌రావు నాటకోత్సవం, పైన చెప్పిన 8 అంచెల వ్యూహాన్ని తయారుచేయడంలోనే గాక.. అమలుచేయడంలో కూడా చిత్తశుద్ధితో, అంకితభావంతో భాషా సాంస్కృతిక శాఖ గత మూడేళ్లుగా పనిచేస్తూ వచ్చింది. ఆరు దశాబ్ధాలుగా నిర్లక్ష్యం చేయబడి లేదంటే ‘నావ్‌ుకే వాస్తే’గా ప్రోత్సహించబడిన నాటకరంగం మూడేళ్ల అత్యల్ప కాలంలోనే అద్భుతాలు చేస్తుందని ఆశించడం అత్యాశే అయినప్పటికీ తెలంగాణలోని నాటక సంస్థలు, దర్శకులు ప్రభుత్వం ఏకోన్ముఖంగా చేస్తున్న ప్రయత్నాల వల్ల నాటకరంగం ఇపుడు ఆశావహ పరిస్థితుల దిశగా పయనిస్తోందని చెప్పాలి.
యువతకోసం: భాషా సాంస్కృతిక శాఖ నాటకరంగ వికాసానికి మరొక ఆచరణాత్మక వ్యూహాన్ని కూడా రూపొందించింది. అదే యువనాటక ఔత్సాహికులకు, కళాకారులకు పూర్తి ప్రోత్సాహాన్నివ్వడం ! ఈ ఆలోచనకు రావడానికి ముందు సాంస్కృతిక శాఖ లోతైన పరిశోధనను, కూలంకష అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో తేలిన విషయాలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ.. అవి భవిష్యత్ ఆచరణ ప్రణాళికకు దారిని సుగమం చేశాయి. అవేంటంటే…
ప్రతియేటా విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులై బయటకు వస్తున్న నాటకరంగ విద్యార్థులు గణనీయ సంఖ్యలో ఉండటం. ఒక్క హైదరాబాద్‌లోనే మూడు విశ్వవిద్యాయాలు (ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్, తెలుగు విశ్వవిద్యాలయం) థియేటర్ ఆర్ట్స్‌ని, ఫెర్మార్మింగ్ ఆర్ట్స్‌ని కోర్సుగా అందిస్తున్నాయి. రంగస్థల కళల శాస్త్రంలో పిహెచ్‌డి చేసిన విద్యార్థులే దాదాపు 50 మందికి పైగా ఉన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టాలను ప్రదానం చేస్తున్నాయి. వారికి రంగస్థల కళల సైద్ధాంతిక నేపథ్యాన్ని నేర్పిస్తున్నాయి. కానీ వారి సృజనాత్మకతకు పదునుపెట్టి నాటకం వేయడానికి కావలసిన ప్రోత్సాహక వాతావరణాన్ని ఆర్థికంగా, హార్దికంగా అందించలేకపోతున్నాయి. యువతీ యువకులు రంగస్థల కళలను విద్యగా అభ్యసించినప్పటికీ వారిలో అధికశాతం మందికి అంతిమలక్ష్యం సినిమాలుగానే ఉంటున్నాయి. తాము సంపాదించిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను సినీరంగానికి ఉపయోగించాలని భావించడానికి కారణాలు వేరైనప్పటికీ నాటకరంగంలో తమ ఉనికిని ప్రదిర్శించడానికి కావలసిన వసతులు, సదుపాయాలు ప్రోత్సాహం లేకపోవడం కూడా కారణం. పై అంశాలన్నింటినీ సాకల్యంగా, సహేతుకంగా అధ్యయనం చేసిన సాంస్కృతిక శాఖ రంగస్థల కళలలో పట్టభద్రులైన యువతీ యువకులకు అవసరమైన ఆర్థిక, హార్దిక, సాంకేతిక, రంగస్థల సహాయ సహకారాలను అందించడం ద్వారా వారిని ప్రోత్సహించాలనే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ముందుగా మూడు విశ్వవిద్యాయాల నుంచి పట్టభద్రులై పిహెచ్‌డి చేసిన రంగస్థల కళల విద్యార్థులను ఆహ్వానించి వారితో చర్చించి వారిలో ఒక నమ్మకాన్ని సాంస్కృతిక శాఖ కలిగించగలిగింది. ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడానికి యువ రంగస్థల కళాకారుల కోసం ప్రత్యేక నాటకోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
రంగస్థల పునరుద్దరణకు సీనియర్ల సహకారం : తెలంగాణలో రంగస్థలం రూపురేఖలు, భవిష్యత్ ఆలోచనలపై, తెలంగాణలోని సంప్రదాయ, సమకాలీన నాటక కర్తలతో ప్రభుత్వ సలహాదారు డా॥ కె.వి. రమణాచారి,ఐ.ఎ.యస్.(రి) సారధ్యంలో చర్చలు, రంగస్థల పునరుద్ధరణకు నిర్ధిష్ట చర్యలను రూపొందించడం, ‘తెర’ (తెలంగాణ రంగస్థల సమాఖ్య) వంటి సంస్థలతో ప్రభుత్వ సహకారంతో, సదస్సులు, పత్ర సమర్పణలు నిర్వహించడం జరిగింది. అదే సమయంలో నవ్య ఆలోచనలతో సీనియర్, యువ నాటకకర్తలు ముందుకురావడం ఆరంభమైంది. అలావచ్చిన వారిలో పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు, తడకమళ్ళ రామచంద్రరరావు, నారాయణ, లక్ష్మికాంతరావు, సదానందచారి వంటి సీనియర్లు, థియేటర్ ఆర్ట్ ్స ప్రొఫెసర్ డాక్టర్ కోట్ల హనుమంతరావు, వారి శిష్యులు, నిశుంభిత తరుపున రామ్మోహన్ ెలగుండి, తెంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ తరపున విజయకుమార్ జీ, బీచరాజు శ్రీధర్ వంటివారు, అలాగే డాక్టర్ కుమారస్వామి, శివరామిరెడ్డి, డాక్టర్ ఖాజా పాషా, అడ్ల సతీష్, సాయి, మరికొందరు తమతమ సృజనలతో ముందుకువచ్చారు. అలాగే పద్మశ్రీ డాక్టర్ మహ్మద్ అలీబేగ్ , సూత్రధార్ వినయ్‌వర్మ, శూద్రక స్వపన్ మొండల్, దెంచనాల శ్రీనివాస్ వంటి సీనియర్ రంగస్థల నిపుణులుకూడా తమ కృషిని కొనసాగించేందుకు ఉత్సాహాన్ని చూపారు. వీరందరికీ కావలసిన ఆర్థిక, హార్థిక సౌజన్యాన్ని తనకున్న పరిమితులలోనే అందిస్తూ నాటకానికి ఊతంగా నిలిచింది భాషా సాంస్కృతిక శాఖ. యువనాటకోత్సవం : అలా మొదటగా ఈ నాటకోత్సవాలను ‘యువ నాటకో త్సవం’ అనే పేరుపెట్టి ఓ ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. దీనికోసం ఇదివరకే ఎన్నోసార్లు ప్రదర్శన అయిన పాతనాటకాలను కాకుండా కొత్త నాటకాలను వేయాలనే గట్టి సంకల్పం తీసుకుంది. దీనివల్ల కొత్త రచయితలు, కొత్త కాన్సెప్టులు, కొత్త ఐడియాలు, కొత్త థియేట్రికల్ ఎక్స్‌పర్మెంట్స్‌కు తావు ఏర్పడుతుందని భావించడం జరిగింది. అనుకున్నట్లుగానే ఈ ‘యువ నాటకోత్సవం’ కాన్సెప్టును అమలు చేద్దామని ముందుకెళ్లినపుడు సాంస్కృతిక శాఖకు ఆశించిన స్పందన రాలేదనేది వాస్తవం. అయినా వెనకడుగు వేయకుండా 2015లో మొదటిసారిగా ‘యువ నాటకోత్సవం’ను ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరంభించి రవీంద్ర భారతిలో నాటకాలను వేయించడం జరిగింది. ఆనాడు కేవలం మూడు నాటకాలను మాత్రమే ప్రదర్శించగలిగాం. అవి…. 1) రజాకార్ 2) మతమా మనిషా ? 3)జ్యోతిరావ్ పూలే ఈ ప్రయోగం ఒకింత కదలికను తీసుకురావడంలో సక్సెస్ అయింది. దాంతో ‘యువ నాటకోత్సవం’ శీర్షికతో మరింత విస్తృతస్థాయిలో నాటకాల పండుగను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ నిర్ణయం తీసుకుంది. అపుడు రంగస్థల, సినీ కళాకారుడు, రచయిత అయిన డాక్టర్ మల్లేష్ బల్లాష్ట్, తగిన ప్రతిపాదనలతో ముందుకు రావడంతో ‘యువ నాటకోత్సవం’ ను పూర్తిస్థాయిలో 2017 జనవరి 27 నుంచి 29 వరకు రవీంద్ర భారతిలో మూడురోజుల పండుగలా నిర్వహించడం జరిగింది. ఈ ‘యువ నాటకోత్సవం’ తెలంగాణ నాటకరంగంలోని నవ యువకళాకారులు, రచయితలు, దర్శకులకు నూతనోత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని లోపాలు, చిన్న పొరపాట్లు కథ, కథనం, నాటకీకరణ పరంగా దొర్లినప్పటికీ యువ రంగస్థల నిపుణులకు ఒక పూర్తిస్థాయి ప్రయోగశాలను అందించడంలో సఫలీకృతం అయింది. ఈ ‘యువ నాటకోత్సవం’ ఏ జాతీయస్థాయి నాటకోత్సవానికి తీసిపోకుండా నాటక వస్తువు, నాటక ప్రదర్శనాపరంగా నవ్య ప్రయోగాలకు బాటలు వేసింది. ఏకంగా 11 నాటకాలను ఇది సజావుగా ప్రదర్శించింది. ఈ మొత్తం నాటకాలలో దాదాపు 800 మందికి పైగా కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ కళను, ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఈ ఊపును కొనసాగిస్తూ, ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్ వంటి జిల్లాలలో కొన్ని ఎంపిక చేసిన కొన్ని నాటకాలను ప్రదర్శించి జిల్లా కేంద్రాలకు కూడా నవ్య నాటకాలను తీసుకెళ్ళి ప్రదర్శించడం జరిగింది. అక్కడ కూడా ఇవి ప్రజాదరణ పొందడం విశేషం. యువనాటకోత్సవం 2 : 2017 అక్టోబర్ 20,21,22 తేదీలలో రవీంద్రభారతిలో యువనాటకోత్సవం శీర్షికతోనే మరో 10 కొత్త నాటకాలను రచించి ప్రదర్శించడం జరిగింది. ఈ 10 నాటకాలలో తెరముందు తెరవెనుక దాదాపు 750 మందికి పైగా యువకళాకారులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. “సందేశం, ఇంటర్ వ్యూ, మట్టవ్వ, వినాశి, స్వామి కళ్యాణం, ఊసరవెళ్లి, అన్నదాత సుఖీభవ” వంటి కొత్త నాటకాలను ఈ యువనాటకోత్సవం సృష్టించింది.
‘న్యూ వేవ్’ కు ఆరంభం : ఈ ‘యువ నాటకోత్సవం’ ఈ క్రింది విధంగా నూతన పథ నిర్దేశాన్ని, ప్రయోగాత్మకతను పాటించి.. తెలంగాణ రాష్ర్ట అవతరణ అనంతరం నాటకరంగ ప్రస్థానంలో ‘న్యూవేవ్ థియేటర్ మూవ్‌మెంట్’ దిశగా తనదైన ముద్రను వేయగలిగింది.
కథలను నాటకీకరించడం : తెంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన కథా సాహిత్యంలో ఎన్నో కథలు నాటకాలుగా మలచడానికి కావలసిన అన్నిరకాల హంగులను కలిగి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ మాటలను రుజువు చేస్తూ మాజీ ప్రధాని, బహు భాషావేత్త పి.వి.నరసింహారావు రాసిన ‘గొల్లరామవ్వ’ కథను, పత్రికా సంపాదకుడు, చారిత్రక పరిశోధకుడు, సాహితీవేత్త అయిన సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ కథను నాటకీకరించి తొలిసారిగా ప్రదర్శించడం జరిగింది.
ఇతర భారతీయ భాషల నాటకాలను తెలుగీకరించడం : ఆదాన ప్రదానాల వల్ల సాహిత్యం గానీ, నాటకం కానీ, మరేఇతర సృజనాత్మక కార్యం కానీ సుసంపన్నం అవుతుంది. విస్తృతం అవుతుంది. అందుకే ప్రముఖ నాటక రచయిత బాదల్ సర్కార్ రాసిన ‘ఏక్ బాకీ ఇతిహాస్’ను తెలుగీకరించి ప్రదర్శించడం జరిగింది. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘దావత్’ నాటకాన్ని తెలుగులో రచించి ప్రదర్శించారు. ప్రఖ్యాత హింది రచయిత భారతేందు హరిశ్చంద్ర రాసిన ‘అంధేర్ నగర్ మే’ నాటకాన్ని అంధకార నగరం పేరుతో తెలుగీకరించి ప్రదర్శించారు.
అంతర్జాతీయ నాటకాన్ని తెలుగులో అందించడం : అంతర్జాతీయంగా వివిధ దేశాలలో నాటకం వస్తువు, శిల్పం పరంగా ఎన్నెన్నో పోకడలతో వాడుకలో ఉంది. అందువల్ల ఇతర దేశాల నాటకాన్ని తెలుగీకరించి అందించడం వల్ల ఆయా దేశాల సాంస్కృతిక, సామాజిక, తాత్విక జీవనం అర్థమవుతుంది.
సమకాలీన సమస్యలే వస్తువుగా నాటకాలు : నల్గొండలోని ఫ్లోరోసిస్ సమస్య కథాంశంగా ‘హాలాహలం’ నాటిక, గ్రామీణ ప్రాంతాలలోని రాజకీయాలు, వాటికి బలైపోయే అమాయకులు అనే కథతో ‘రచ్చబండ’ నాటిక, బాలకార్మిక వ్యవస్థ వస్తువుగా ‘భూమడు’ నాటిక వంటివి ‘నాటకం సమకాలీన సమాజానికి దర్పణం’ అనే మాటను నిరూపించే దిశగా ప్రయత్నించడం హర్షణీయం. అధిక్షేప నాటకం : కళారూపంగా నాటకం అంతిమ లక్ష్యం ప్రేక్షకులందరిలో చైతన్యం తీసుకురావడం. దీనికోసం నాటకంలో మెలోడ్రామా, సెటైర్ వంటి ప్రక్రియలను ప్రవేశపెట్టడం సహజం. అలా తెలంగాణ భాష వస్తువుగా ‘చింత బరిగె స్కీం’ నాటిక సెటైర్‌గా రూపొందే ప్రయత్నం చేసింది.
మాటలు లేని దృశ్యనాటిక : నిజానికి నాటకం దృశ్యకళ. దానికి పాత్రలు, వాటి సంభాషణలు కూడ కలిసి శ్రవ్యదృశ్య కళగా నాటకం రక్తికట్టిస్తోంది. అయితే రంగస్థలం మీద మాటలు ఏమాత్రం లేకుండా ఆయా పాత్రలు తమ ప్రవర్తన ద్వారానే నాటపేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అనేది అత్యంత కష్టమైన ప్రయాస. ఇలాంటి క్లిష్టతరమైన ప్రయోగాన్ని ‘మూగ మనుషులు’ సజావుగా ప్రదర్శించి చూపింది.
జీవిత చారిత్రక నాటకం : ఖిలాషాపూర్ వంటి ఎన్నో కోటలను నిర్మించడమేకాక అద్భుతమైన యుద్ధ తంత్రాలతో రాజ్యాన్నేలిన బడుగు జాతి వీరుడు సర్వాయి పాపన్న. ఆయన జీవిత చరిత్రని నాటకీకరించి చారిత్రక నాటకంగా ఆధునిక శైలిలో అందించారు. 8) సంప్రదాయ నాటకానికి నివాళి : తెలుగు నాటకరంగాన్ని తన రచనలతో పరిపుష్టం చేసిన తొలితరం రచయిత చందాల కేశవదాసు. ఆయన రాసిన ‘కనకతార’ నాటకాన్ని కొంత సంక్షిప్తీకరించి కొత్తతరం నటీనటులతో ప్రదర్శించి ‘Classical Revivalism’ ని అందించింది. 9) యువకళాకారుల సృజనకు పట్టం : ఈ యువనాటకోత్సవం 21 కొత్త నాటకాలను తెలంగాణ రంగస్థలానికి అందించడమేకాక, విశ్వవిద్యాలయాల నుంచి పట్టా పుచ్చుకుని వచ్చిన దాదాపు 1000 మంది యువ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తమ సృజనలకు అవకాశాన్ని, ప్రతిభను కనపరిచే వేదికని అందించింది. నాటకరంగం నుంచి నిష్ర్కమించాలని లేదా దృష్టి మరల్చి వేరే రంగంవైపు వెళ్ళాలని అనుకున్న చాలామంది నాటకరంగ యువప్రేమికులను తమకు నచ్చిన రంగంలోనే కొనసాగేలా ఓ భరోసాని ఇవ్వగలిగింది. నాటకరంగాన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదనే మాటనుంచి, ఇతర అభద్రతలనుంచి వారిని బయటపడేసి వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించగలిగింది. ఇలా ‘యువ నాటకోత్సవం’లో ప్రదర్శించిన 21 నాటికలు వేటికవే తమదైన తరహాలో ప్రత్యేకతను సాధించి తెలంగాణలో కొత్తతరహా నాటకానికి బాటలనువేయడంలో విజయవంతం అయ్యా యి. దానితో ‘యువ నాటకోత్సవంలో ప్రదర్శితమైన 11 నాటికలతో కూడిన నాటక సంకలనాన్ని “గొల్ల రామ వ్వ కథ…. ఇంకొ న్ని నా టికలు” పేరుతో పుస్తకంగా తీసుకువచ్చి ‘యువ నాటకోత్సవం’ కు శాశ్వతత్వా న్ని అందించింది భాషా సాంస్కృతిక శాఖ. ఇటీవలి కాలం లో నాటకాల పుస్తకాలను ముద్రించడమనేది ఓ విశేషంగానే భావించాలి. ఈ విధంగా భాషా సాంస్కృతిక శాఖ తలపెట్టిన ‘న్యూ వేవ్ థియేటర్’కు కావలసిన అన్నిరకాల పునాదులు ఇప్పుడు బలంగా రూ పొందడమేకాక భవిష్యత్తులో నాటకరంగంపై యువకళాకారులలో కొత్త ఆశలను పాదుకొల్పడం లో అనన్య సామాన్యమైన విజయాన్ని సాధించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.