Home సినిమా అమాయకమైన అమ్ములుగా కనిపిస్తా

అమాయకమైన అమ్ములుగా కనిపిస్తా

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’. సీనియర్ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. జూన్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయికలలో ఒకరైన మనాలి రాథోడ్ చెప్పిన సినిమా విశేషాలు…

Manali Rathod

పల్లెటూరి అమ్మాయిగా…
నేను నటించిన నాలుగో చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’. హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్, మానసలతో కలిసి ఈ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో అమాయకమైన అమ్ములు అనే పాత్రలో నటించాను. సినిమాలో పల్లెటూరి అమ్మాయి తరహాలో చీరకట్టులోనే కనపడతాను.
హీరోయిన్లను చక్కగా చూపిస్తారు…
సీనియర్ దర్శకుడు వంశీ హీరోయిన్లలను తెరపై చక్కగా చూపిస్తారు. సాధారణంగా ఆయన సినిమాల్లో హీరోయిన్లకు నటనాపరంగా మంచి స్కోప్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రకు వంశీ నన్ను ఎంపికచేస్తారని అనుకోలేదు. ఇక ఆయన సెట్స్‌లో చాలా కూల్‌గా పనిచేసుకుంటూ వెళ్తారు. వంశీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా.
అతనికి మన్మథ రేఖ ఉంటుంది…
హీరో సుమంత్ అశ్విన్ మంచి కో-స్టార్, హార్డ్ వర్కర్. ఇక లేడీస్ టైలర్ సినిమాలో మచ్చ కాన్సెప్ట్ ఉంటే… సుమంత్‌కు ఈ సినిమాలో మన్మథ రేఖ ఉంటుంది. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లోని పాత్రలకు, ఈ సినిమాలో నా పాత్రకు చాలా తేడా ఉంటుంది.
గ్లామరస్‌గా కనిపిస్తా…
అమ్ములు పాత్రకు నన్ను ఎంపికచేయడం నా అదృష్టంగా భావిస్తాను. నా క్యారెక్టర్ వల్ల సినిమాలో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. పూర్తిగా సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్ నాది. సినిమాలోని ఐదు పాటలుంటాయి. ఒక పాటలో నేను గ్లామరస్‌గా కనిపిస్తా. ఇక సినిమా అంతా చీరకట్టులోనే కనపడతాను.
ఆయన అందరినీ గౌరవిస్తారు…
మధుర శ్రీధర్ మంచి నిర్మాత. ఆయన సెట్స్‌లో అందరినీ గౌరవిస్తారు. ఆయనతో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సినిమా టీం అందరికీ ఏం కావాలో దాన్ని ఆయన సమకూర్చారు. ఈ సినిమా తర్వాత ‘హౌరా బ్రిడ్జ్’లో నటించాను. ఓ పాట మినహా షూటింగ్ అంతా పూర్తయింది.