Tuesday, February 7, 2023

అమ్రాబాద్ అడవుల్లో అణుకంపన!

దేశంలోని అడవులలో నల్లమల 2వ స్థానంలో ఉన్నది.  రిజర్వ్ ఫారెస్టు, టైగర్ ప్రాజెక్టులున్నాయి. గత కొద్దికాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం పులుల రక్షణ పేరుతో అడవి నుండి గ్రామాలు తరలించాలని కుట్ర పన్నుతున్నది. ఇప్పుడు యురేనియం తీయడంకోసం  అడవి గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేయాలనే పన్నాగం సాగుతున్నది.  ప్రజల బతుకుల్లో బీభత్సం కల్పించే ఇటువంటి పథకాలకు  ప్రజా పాలకులే అనుమతులు ఇవ్వడం శోచనీయం.ఇది కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉంది. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరు అన్నట్లు ఉంది. 

- Advertisement -

Amrabad Forest

రాజ్యాంగం పర్యవేక్షణలో అభివృద్ధి కావాల్సిన 5వ షెడ్యూల్ ఏజన్సీ ఏరియాను కొంతమంది పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. అక్కడ యురేనియం తవ్వకాలకు రాష్ట్రప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. అణు విద్యుత్తును పలు అభివృద్ధి చెందిన దేశాలే వ్యతిరేకించాయి. పర్యావరణం దెబ్బతిని జీవ జంతువులు నాశనం అవుతాయని, అంగవైకల్యంతో నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని అడవులలో నల్లమల 2వ స్థానంలో ఉన్నది. రిజర్వ్ ఫారెస్టు, టైగర్ ప్రాజెక్టులున్నాయి. గత కొద్దికాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం పులుల రక్షణ పేరుతో అడవి నుండి గ్రామాలు తరలించాలని కుట్ర పన్నుతున్నది. ఇప్పుడు యురేనియం తీయడంకోసం అడవి గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేయాలనే పన్నాగం సాగుతున్నది. ప్రజల బతుకుల్లో బీభత్సం కల్పించే ఇటువంటి పథకాలకు ప్రజా పాలకులే అనుమతులు ఇవ్వడం శోచనీయం.ఇది కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉంది. ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరు అన్నట్లు ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే దానిని ఉల్లంఘిస్తుంటే ఎవరు పట్టించుకోవాలో అర్థంగాని పరిస్థితి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పధర మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 18 గ్రామ పంచాయితీలు 35 శివారు గ్రామాలు, 18 చెంచుపెంటలు ఉన్నాయి. 62011మంది జనాభా నివసిస్తున్నారు. 5400 ఎకరాల వరిపొలం, 36009 ఎకరాల మెట్టపొలం సాగు అవుతున్నది. ఈ 11457 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎస్‌సిలు 30శాతం, ఎస్‌టిలు 20శాతం, బిసిలు 35శాతం, ఒసిలు 10శాతం ఉన్నారు. 247222 ఎకరాల అడవి భూమి 1903 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. అడవి మీద ఆధారపడి 50వేల పశువులు బతుకున్నాయి. గేదెలు 6500, గొర్రెలు 8200, మేకలు 100,000, కోళ్ళు 8500 ఫారెస్టు ఆధారంగా జీవిస్తున్నాయి. బిపిఎల్ కార్డులు 13232 ఉన్నాయి. అంగన్‌వాడీ సెంటర్స్ 87, చెరువులు 15, బావులు6,87 విద్యా సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీన్నింటిని లెక్క చేయకుండా ఖాళీ చేయాల్సిందే అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యురేనియం తీయాల్సిందే అంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు.
ఏజన్సీ ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్లుమంజూరైనా వేయని పరిస్థితి ఉంది. కరెంటు లేదు. ఇండ్లు కట్టుకుందామన్నా అడ్డుపడుతున్నారు. 68 ఏండ్ల స్వాతంత్య్రానంతరం ఏజన్సీ అత్యంత దుస్థితిలో కొనసాగుతున్నది. అటవీహక్కుల చట్టం క్రింద పేద గిరిజనులకు 1నుంచి 10 ఎకరాల వరకు భూమి ఇవ్వాలి కాని ఇవ్వడంలేదు. ఏజన్సీలో ఉన్న విద్యార్థులకు ఏజన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదు. గ్రామాల్లో కమ్యూనిటీ హాలు కనిపించడంలేదు. అమ్రాబాద్ అడవుల్లో ప్రజలకు జీవనాధారమైన ధార, మానుబడ్డ వాగు ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే సాగు నీరు, మంచి నీరు అందించవచ్చు. జంతువుల దాహం తీర్చవచ్చు. గిరిజనులు అటవీ ఫలాలు, ఉత్పత్తులు సేకరించకుండా ఫారెస్టు అధికారులు అడ్డుపడుతున్నారు. ఏజన్సీ ప్రాంతం పూర్తిగా రాష్ట్రపతి, గవర్నర్ పరిపాలనలో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి పనులు, తదితర కార్యక్రమాల మీద పూర్తి హక్కు గ్రామసభకు ఉంది. పెసా, సమత జడ్జిమెంట్, 1/70, అటవీ హక్కుల చట్టాలు ఉన్నాయి కానీ బొత్తిగా అమలుకు నోచుకోవడం లేదు. వీటిని బేఖాతరు చేస్తూ పులుల రక్షణ పేరుతో గ్రామాలను తరలించాలని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2009 జిఓ 41,45 క్రింద సర్వేలు చేస్తున్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించగా గిరిజన సంఘం, రాజకీయ పార్టీల ఒత్తిడితో ఆగిపోయింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏకంగా యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయం జరిగింది. 2016 డిసెంబర్ 6న జరిగిన ఒక సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. యుద్ధప్రాతిపదికన యురేనియం తవ్వకాలు జరపాలని చర్చ జరుగుతున్నది. పదర మండలం ఉడిమల్లిగ్రామంలో తవ్వకాలు మొదలుపెట్టాలని బోర్లు వేసి మట్టిని తీసుకెళ్ళారు. ఉప్పునూతల ప్రాంతంలో సర్వే చేశారు. నెలరోజులు హెలికాప్టర్ ద్వారా చక్కర్లు కొట్టారు. ఇప్పుడు యురేనియంతోపాటు రంగురాళ్ళు, వజ్రాలు, బంగారం దొరుకుతాయంటున్నారు. మట్టిరాళ్ళు, అటవీ వనరులను, కలపను సైతం అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. యురేనియం తవ్విన ప్రాంతం నుండి 83 కిలోమీటర్ల దూరం కాలుష్యం ప్రభావం ఉంటుంది. దీనితో మానవాళే కాదు చెట్లు జీవరాసులు అన్నీ ప్రమాదానికి గురికావాల్సివస్తుంది. కృష్ణానది 20కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. నీళ్ళు కలుషితం అవుతాయి. హైదరాబాద్ ప్రజలు కూడా ప్రమాదానికి గురికావాల్సిందే. ఎస్‌ఎల్‌బిసి సొరంగం 61 కిలోమీటర్లు దాటి నల్లగొండలో ప్రవేశిస్తుంది. అదీ కలుషితం అవుతుంది. బడా పెట్టుబడి దారుల చేతుల్లో పాలకులు కీలుబొమ్మలుగా వ్యవహి స్తున్నారు. ప్రజాస్వామ్యం కనుమరుగవుతున్నది.
2014లో కేంద్రంలో వచ్చిన బిజెపి ప్రభుత్వం బరితెగించి దేశవ్యాపితంగా ఖనిజాల వెలితీతకోసం అనుమతులు ఇస్తున్నది. యురేనియం తవ్వకాల అనుమతికోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సర్క్యులర్ జారీచేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2016 డిసెంబర్ 6వ తేదీన వన్యప్రాణి పరిరక్షణ బోర్డును సమావేశపరిచింది. నాగర్‌కర్నూలు జిల్లా పధర మండలం ఉడిమిల్లా కేంద్రంగా 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం అనుమతి ఇచ్చింది. యుసివిఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థ అణుశక్తి సంఘంతో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలకోసం సర్వే జరుపుతున్నది. ఇందుకు అనుమతించే పత్రాల మీద వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడైన స్థానిక ఎంఎల్‌ఎ సంతకం చేశారంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం అవుతున్నది. యురేనియం ప్రమాదకరమని గ్రహించి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌లు అనుమతులను రద్దుచేసుకున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో బాదుగుడ ప్రాంతంలో 30 సంవత్సరాల కాలం నుండి దాని ప్రభావం వల్ల ప్రజలు దారిద్య్రం అనుభవిస్తున్నారు. అంగవైకల్యంతో భారీగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చేతులు, కాళ్లు, తల, ముఖం పుట్టుకతోనే అసంపూర్తిగా ఉంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మానవుని ఆకారమే మారిపోతున్నది.
నల్లమల ప్రాంతంలో టూరిజం రంగంలో అభివృద్ధి చేయాల్సిన మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, నరసింహస్వామి, ఉమామహేశ్వరం ఆలయాలు, చెంచులు జంతువులను ఆరాధించి పూజించే ప్రాంతాలు. చెంచులు పూజలు జరుపుకునే భైరాపురం చెరువు ఇక్కడవుంది. లక్షల సంఖ్యలో భక్తులు మాలలు వేసుకుని మొక్కులు తీర్చుకునే పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం (మద్దిమడుగు) ఉన్నది. అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు పాలకులు. విలువైన నిక్షేపాలు, వజ్రాలు, బంగారం, కొల్లగొట్టడం ఒక్కటే తప్ప ప్రజల సమస్యలు వారికి పట్టడం లేదు. కృష్ణానదిలోని 1100 టిఎంసి నీళ్ళు కలుషితం అయితే ఎంత నష్టం ఉందో అర్థంకావడంలేదు. 1972 వన్యప్రాణి రక్షణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. 5 జిల్లాల సరిహద్దు ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది. ఉడిమిల్లా, అక్కారం, బక్కలింగాయపల్లి, రాయలగండి, లక్ష్మాపూర్, మాదడుగు, పట్రాల్‌చేను, అప్పాపూర్,చౌరాపూర్, సోమశిల, అలాటంపెంట, పచ్చగట్టు గ్రామాలను యుసిఐఎల్ కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. అటవి సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి వ్యతిరేకిద్దాం. ఏజన్సీ హక్కులను రక్షించుకుందాం. యురేనియం తవ్వకం ఆపేంతవరకు ప్రజాతంత్రవాదులు, మేధావులు కలిసి పోరాడుదాం. కోదాడ నియోజకవర్గంలో ధర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా గుర్రంగోడు తండా వాసులు ఐక్యమై పోరాడి వెనక్కి పంపారు. అడవి, భూమి, నీళ్ళు, గాలిని కాపాడుకోవడం కోసం ఏకమౌదాం. వన్య సంరక్షణ, బోర్లు, జీవవైవిధ్యం, వృక్షరక్షణ కోసం అండగాఎన్నో జిఒలు ఉన్నాయి. కాలుష్య బోర్డు కూడా ఈ ‘ఉరేనియం’ ప్రాజెక్టును అడ్డుకోవ డానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Dharma-Naik

– ఎం. ధర్మనాయక్,
ప్రధాన కార్యదర్శి, గిరిజన సంఘం,

9490098685

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles