Tuesday, January 31, 2023

ఐపిఎల్ ఐశ్వర్యవంతులు

- Advertisement -

Sampadakeeyam-Logoఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)10వ ఎడిషన్ కొరకు బెంగళూరులో సోమవారం జరిగిన క్రికెటర్ల వేలంపాటలో చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్ళిద్దరు అత్యధిక ధర పలకగా, భారత డొమిస్టిక్ ఆటగాళ్లు టి.నటరాజన్(తమిళనాడు), మహమ్మద్ సిరాజ్ (హైదరాబాద్), కృష్ణప్ప గౌతమ్(కర్నాటక), అంకిత చౌదరి (రాజస్థాన్), మురుగన్ అశ్విన్ (తమిళనాడు)లను అదృష్టలక్ష్మి వరించింది. ఐసిసి అసోసియేట్ సభ్య దేశాలుగా ఉన్న ఆప్ఘనిస్థాన్‌నుంచి ఇద్దరు (మహమ్మద్ నబి, రషీద్ ఖాన్ అర్మాన్), యుఎఇనుంచి ఒకరు (చిరాగ్ సూరి) ఐపిఎల్ లో ఆడే అవకాశం సంపాదించారు. మొత్తం 8 టీముల యజమానులు రూ.91.15కోట్లు వెచ్చించి 66మంది క్రికెటర్లను కొనుగోలు చేశారు. ఆల్‌రౌండర్లు, పేస్‌బౌలర్లు ఎక్కువ రేటు పలికారు. గత ఏడాది రూ.8.5కోట్లు ధర పలికిన మన దేశీ ఆల్‌రౌండర్ పవన్ నేగి ఈ పర్యాయం రూ.1కోటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా 74టెస్టులు, 80 ఒడిఐల వెటరన్ ఇశాంత్ శర్మ(బేస్ ధర రూ. 2కోట్ల)ను ఏ టీము తీసుకోలేదు. చటేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్ కూడా అంతే.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పంట పండింది. అతని కొరకు ఏర్పడిన తీవ్రమైన పోటీలో రైజింగ్ పూనె సూపర్ జైంట్స్ రూ.14.5కోట్లకు దక్కించుకుంది. ఐపిఎల్ దశాబ్ద చరిత్రలోఅత్యధిక రేటు పలికిన విదేశీ ఆటగాడు ఇతడే. 2015 ఎడిషన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ యువరాజ్‌సింగ్‌కు చెల్లించిన రూ.16కోట్లే అత్యధిక పారితోషికం. చెన్నై సూపర్‌కింగ్స్‌పై నిషేధం అనంతరం గత సంవత్సరం ఐపిఎల్‌లో ప్రవేశించిన పూనే ప్రాంఛైజీ తమ జట్టు కెప్టన్సీ నుంచి మహేంద్రసింగ్ ధోనీని తొలగించి ఆస్ట్రేలియా కెప్టన్ స్టీవ్ స్మిత్‌ను నియమించి క్రికెట్ జగత్తును ఆశ్చర్యపరచినట్లే, స్ట్రోక్స్‌ను అత్యధిక పారితోషికంతో సొంతం చేసుకుంది. కాగా రెండవ అత్యధిక రేటు రూ.12 కోట్లకు ఇంగ్లండ్‌కు చెందిన టైమల్ మిల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. వేలంలో నిలిచిన భారత్ క్రికెటర్లలో కర్ణ్ శర్మకు అత్యధికంగా రూ.3.2కోట్లు లభించాయి.
ఇక రెండో పార్శం-భారత జట్టుకు ఏ ఫార్మాట్‌లో ప్రాతినిధ్యం వహించని (అన్‌కాప్డ్) క్రీడాకారులు, అలాగే ఐసిసి అసోసియేట్ సభ్యదేశాల నుంచి స్థానం పొందిన క్రీడాకారులు. వీరికి సాధారణంగా రూ.10-20లక్షల ప్రాథమిక రేటు ఉంటుంది. అట్లాంటిది అనుకోకుండా కోటీశ్వరులైన క్రీడాకారులను అభినందిం చుదాం. వారిలో మన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌ను తీసుకుంటే అతి పేద కుటుంబంనుంచి వచ్చిన ఈ యువకుడు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో మూడేళ్లక్రితం క్రికెట్ బంతి పట్టుకున్నాడు. ఈ కుడిచేతి పేసర్‌కు తొలుత చార్మినార్ క్రికెట్ క్లబ్‌లో ఆడే అవకాశం వచ్చింది. రంజీజట్టుకు ఎంపికయ్యే నాటికి సరైన బూట్లు కూడా లేవు. అక్కడ 41 వికెట్లు తీయటంతో ఇరానీ ట్రోఫీ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు ఎంపికైనాడు. తల్లి గృహిణి, తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. ఇతన్ని ఐపిఎల్ ప్రస్తుత చాంపియన్ హైదరాబాద్ సన్‌రైజర్స్ రూ.2.6కోట్లకు సొంతం చేసుకుంది. తమిళనాడుకు చెందిన టి.నటరాజన్‌ది కూడా అటువంటి గాథే. అతని కొరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3కోట్ల ధర పెట్టింది. అతని తండ్రి సేలం సమీపంలో చీరల తయారీ పరిశ్రమలో దినకూలీ కార్మికుడు. తల్లి రోడ్డుపక్క దుకాణంలో చిరుతిండి పదార్థాలు అమ్ముకుంటుంది. కేరళనుంచి ఎదిగివచ్చిన శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్‌ను నాశనం చేసుకోగా, బసిల్ తంపి అనే మరో పేస్ బౌలర్ ఐపిఎల్‌లో అడుగు పెట్టాడు. అతన్ని రూ.85 లక్షలకు గుజరాత్ లయన్స్ తీసుకుంది.
ఐపిఎల్ నిర్వహణలో ఎన్ని లోపాలున్నా, అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంత అప్రతిష్ట తెచ్చుకున్నా, క్రికెట్‌ను ఆరాధిస్తున్న మనదేశంలో నెలన్నరపాటు కోట్లాదిమందికి వినోదం అందించే మహాక్రీడా సమరంగా స్థిరపడింది. వందలాది మంది భారత క్రికెటర్లను ఫీల్డ్‌లోకి తెచ్చింది. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలుగు లోకి తెస్తోంది. విదేశీ, స్వదేశీ క్రీడాకారుల కలయికతో అంతర్జాతీయ సుహృద్భావాన్ని పెంచుతోంది. దేశప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా నిర్వహించడమే ఆర్గనైజర్ల కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles