Home సిద్దిపేట డిడిలు ఇచ్చిన 3 రోజుల్లో గ్రామానికి ట్రాన్స్‌ఫార్మర్లు

డిడిలు ఇచ్చిన 3 రోజుల్లో గ్రామానికి ట్రాన్స్‌ఫార్మర్లు

TRANSFERMARS

మన తెలంగాణ/గజ్వేల్ : యాసంగి పంటల సాగుకు విద్యుత్ లోవోల్టేజీ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు వెంటనే బిగించుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గజ్వేల్, జగదేవపూర్, కొండపాక, తూప్రాన్ మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు, మండల విద్యుత్ ఎఇలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు విద్యుత్ సమస్య రాకుండా ఉండాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతులు తమ సహకారం అందించాలన్నారు. చాలా చోట్ల అక్రమ కనెక్షన్ల వల్ల సమస్య రానున్న కాలంలో తీవ్రమయ్యే ప్రమాద ముందని దాన్ని నివారించటానికే వెంటనే తమ వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని ఎంపి కోరారు. తనకున్న సమాచారం బట్టి ప్రతి గ్రామంలో ట్రాన్స్‌పార్మర్లపై అక్రమ వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని దీనివల్ల లోవోల్టేజి సమస్య తలెత్తి మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ కనెక్షన్లు అధికారికంగా తీసుకోని రైతులు వెంటనే రూ.4,960 విలువైన డిడిలు చెల్లించి విద్యుత్ ఎఇలకు అందచేయాలన్నారు. డిడిలు ఇచ్చిన 3 రోజుల వరకు ట్రాన్స్‌ఫార్మర్ గ్రామానికి అందుతుందని, దాన్ని వెంటనే బిగించి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తారన్నారు.

ఈ విషయంలో రైతులు జాప్యం చేస్తే ఇప్పటికే రెగ్యులర్ కనెక్షన్లున్న రైతులు కూడా లోవోల్టేజి సమస్యతో పంటలు నష్టపోవాల్సివస్తుందన్నారు. సమిష్టిగా సామాగ్రిని వెంటనే సరఫరా చేయటానికి విద్యుత్ శాఖ సిద్దంగా ఉందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జనవరి 10 వరకల్లా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అక్రమ కనెక్షన్లు పూర్తిగా సక్రమ కనెక్షన్లుగా చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల కొరత లేదన్నారు. సంబంధిత విద్యుత్ ఎఇలు సర్పంచులు, ఎంపిటిసీల సహకారంతో గ్రామాల వారీగా అక్రమ కనెక్షన్ల జాబితా ప్రకారం ప్రతి ముగ్గురు రైతులకు ఒక డిడి తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్లు తెప్పించి బిగించాలని ఆయన ఆదేశించారు. మొత్తం నియోజకవర్గంలో 3400 అక్రమ విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లున్నాయని ఈ సమావేశంలో పాల్గొన్న విద్యుత్ డిఇ సుభాష్ తెలిపారు. మండలాల వారీగా అక్రమ విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ల వివరాలను గజ్వేల్ విద్యుత్ స్పెషల్ ఎడిఇ శ్రీనివాసరెడ్డి తెలుపుతూ గజ్వేల్ – 805, వర్గల్ – 1200, ములుగు-312, తూప్రాన్-350, కొండపాక-217, జగదేవపూర్ -719 చొప్పున అక్రమ కనెక్షన్లున్నాయన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా జెసి హనుమంతరావు, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక ఎంపిపిలు చిన మల్లయ్య, రేణుక, పద్మ, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మడుపు భూమిరెడ్డి, విద్యుత్ ఎఇలు అనిల్, అశోక్, వేణుగోపాల చారి, కనక రాజు, అమరేందర్ పాల్గొన్నారు.