Home అర్బన్ మ్యూజింగ్స్ తరం-అంతరం

తరం-అంతరం

Story-image

తెల్లారితే పదో తరగతి ఏడాది పరీక్షలు. శీనుగాడు బాయి గచ్చుకాడ కాళ్ల మీద కూసోని ముంతల చెయ్యేసి ఊపుతున్నడు. పత్తి పెన్నును ఏడికాడికి ఇప్పి ముంతల నీళ్లల్ల ఏసి కడుగుతున్నాడు. పాకురు తీర పట్టుకున్న సిరా మరకలు కరిగి నీళ్లన్ని నీలిరంగయితున్నయి. గొట్టాలల్ల నీళ్లు నింపుకుంట ఊపి పారవోసి దులుపుకుంట ఆఖర్న పాతబట్టతోటి తుడిసి పెన్నును జమాయిస్తున్నాడు.
పత్తిని పరీక్షవట్టి చూసి పరీక్ష నడుమనే ఇరిగెటట్టున్నది కొత్తది కొనుక్కొవాలనుకుంటుండంగ శీనుగాని అవ్వ’ ఓరి శీనుగా! సదువుడాపి పెన్నువట్టుకోని పాడయితివి. ఇంకెంతసేపు కడుతుగుతవురా!’ అని ఒర్రుతాంది అరుగుమీద కూసొని బీడీలు చేసుకుంట. ‘అత్తున్నాగె… నీయవ్వ!’ అని గులుక్కుంట శీనుగాడు అవ్వతానకు పోయిండు.

‘అవ్వా! సిరాబుడ్డికి రూపాయిత్తన్నావు గని ఇప్పుడు పత్తిగూడ కొనుక్కోవాలె. ఇంక పావుల గావాలె!’ అని కాళ్లు నేలకు కొట్టుకుంట పైసలియి అన్నట్లు నిలవడ్డడు. ఇత్త గని నువు మంచిగ చదువుకో బిడ్డా! అద్దంటె నిన్న బాపుకు తెల్వకుంట పగటి సీన్మ చూసత్తివి. లేవంగనే అట్టకు దేవుని బొమ్మ అతికేసుడేనాయె…. గంటసేపు పెన్ను గడిగితివి. జరసేపు సదువుకోదా!’ అంది యాష్టకచ్చినట్లు మొకంబెట్టి. తెలుగు వాచకం, నోట్‌బుక్ పట్టుకొని గోడకొరిగి చదువుకుంట నడుమ నడుమ అవ్వకేయి చూస్తున్నాడు శీనుగాడు. ‘గంటయినంక అవ్వ యాది మరిసినట్లున్నాదనుకొని’ ఏమాయెనే.. నీ యవ్వ… పైసలిత్తవా లేదా రేపు పరీక్ష రాయాల్నా అద్దా!’ అనుకుంట కాళ్లు ముడుసుకుంట సాపుతున్నడు. ‘నువ్వేడ సదూతున్నవేరా! ఎప్పుడు పైసలిత్తదాని ఇటే సూడవడ్తివి’ అనుకుంట చాట్ల తంబాకులదాసి పెట్టిన రెండు ఆటాన బిళ్లలు, ఒక పావుల బిళ్ల శీనుగాని దిక్కు ఇసిరింది.

ఉరుకుతవోయి శీనుగాడు గంగారం సీటు దుకానల్ల ఒక చార్ నెంబర్ పత్తి, చిన్న సిరాబుడ్డి కొనుక్కచ్చుకున్నాడు. పెన్నుల మెల్లగ సిరావోసుకోని కొత్త ఒత్తివెట్టి రాసి చూసుకున్నాడు. ‘పెన్ను సూసుకునుడు సాలుగని, సదుకోర బిడ్డా… పరీక్షలల్ల ఫెయిలైతివంటే బాపు లెక్క బట్టల దుకాన్ల జీతముండదైతది. ఇగ నీ ఇట్టం’ అని భయపెట్టింది ఆన్ని. రాత్రి బాగా సేపే చదుకొని పన్న శీనుగాన్ని తెల్లారంగనే లేపుకుంట ‘పాసినోట సదుకుంటే మంచిగ యాదికుంటదట సదుకో సదుకో” అన్నది.

‘నీ యవ్వ…. నిన్ననే పురాగ సదివిన…’ అనుకుంటనే కూసున్నకాన్నే సదువుడు మొదలువెట్టిండు. అవ్వ సాయిమాన్లకు వోంగనే లేసి పరీక్ష అట్టమీన దేవుని బొమ్మ మంచిగ అతికిందా లేదా సూసుకున్నడు. మొకం గడిగి తానం జేసిండు. బాపు తయారై దుకాన్ల కొయేదాకా గప్‌చుప్ పుస్తకం పట్టుకొని కూసొని ఆయన పోంగనే-’ అవ్వ… ఎమాయెనే… అన్నం పెడ్తవా లేదా ఇంక’ అని సాయిమాన్లకోయిండు. ‘జర సైసురా… అన్నం ఒడుకుతాంది… పచ్చి పొట్టుకు మంట తగుల్తలేదు’ అన్నది వంకాయలు కోసుకుంట. ఆగమాగమయితున్న శీనుగాడు లక్ష్మికాంతం సారింట్లకోయయి బేతకట్లకెళ్లి తొంగి తొంగి గడియారం టైం జూసిండు. పరీక్షకు ఇంక అద్దగంట టైమే ఉన్నది.

ఇంట్లకచ్చుతోనే ‘అవ్వ ఏమేందే నీయవ్వ’… అని ఎగురవట్టిండు. ‘అయింది. ఇగొ గిన్నె దించుతున్న… ఉన్న సలన్నం మీ బాపు తినిపాయె.. ఉడుకన్నం ఆల్సెంగావట్టె..’ అనుకుంట ఉమ్మగిల్లని అన్నానే తలెల సల్లారేసింది. ‘కూరందది గని తొక్కుతోటి తిని సల్లవోసుకో… కడుపునిండ తిను’ అనుకుంట అవ్వ తొక్కు గిన్నె, చల్ల గురిణి ఆని ముందువెట్టింది. ఊదుకుంట ఊదుకుంట నాలుగు బుక్కలు మింగి పరీక్ష రాయటానికి బడికేయి ఊరికిండు.
‘ఏయ్ పిల్లగా… పెన్ను కక్కుతొంది… అంగి జేబుకు సిరా అంటుతాంది సూస్కో’ అని దారెంట పొయెటాయిన అనంగనే శీనుగాడు జేబు దిక్కు సూస్తున్నాడు. జేబు సగం సిరా తోటి తడిసింది. పెన్ను చేతుల పట్టుకొని ఉరికిండిగ బడికోంగనే బాయి కాడ చేతులు గట్టుకు రుద్ది. పెన్ను, చేతులు కడుక్కోని పరీక్షల కూసుండు. తెలుగు పేపర్ అలుకగనే ఉన్నది. రాసిన కమాన రాయబుద్దైంది. ఏందో గెలిసినట్లనే శీనుగాడు ఇంటికచ్చిండు.
తెల్లారితే ఇంగ్లీష్ పేపర్. ఇంగ్లీషంటే ఇష్టమేగని అర్థమై కాలిపోదు, కథలు, పద్యాలు కొద్దిగంత తెలిసినట్లనిపించినా గ్రామర్ మాత్రం మహాగొట్టు. శ్రీనివాసాచారి సారు మంచిగనే చెప్పిండుగని అప్పుడేమో గింతేనా అనిపిస్తది. పరీక్షలకచ్చేయాళ్లకు అర్థం కాదు. కొద్దినవొయినా తప్పేనాయె.. భయపడుకుంటనే బడికోయిండు శీనుగాడు.

ఇంగ్లీష్ పరీక్షల ఎవల పెన్నూ ఉరుకుత లేదు. రెండు మూడు కాయిదాలు నింపుతే మొనగాడే ఆడు. రాసిన కాడికి రాసి మొకాలు సూసుకుంటున్నారు. బయటకచ్చినంక గొట్టంటె గొట్టురా అనుడే మిగిలింది ఆళ్లకు. హిందీ సమజయితదిగని రాసుడే కట్టం…. పుట్టెడు తప్పులు వోతయి. అయినా పాస్ జేత్తరని భరోసా రాసెటోళ్లందరికి…లెక్కలు, సైన్స్, సోషల్ పేపర్లు, మంచిగనే రాసినట్లనిపించింది శీను గానికి.
ఏం రాత్తేంది గని…. పరీక్షలయిపోవుడే అసలు సంబురం. ఏం జేత్తున్నవురాని. ఎందుకు జేత్తున్నావురా అని అడిగెటోళ్లుండరు, ఆపెటోళ్లుండరు. పెద్ద బడి గ్రౌండ్‌ల తుడుంబ, కోతికొమ్మ ఆడి దమ్మచ్చినంక చింతచెట్టు మీదనే కొమ్మల మీద ఒరిగి ఓనగాయ తినుకుంట బాతాలు గొట్టుడు, పైసలున్నోడు ఏవడన్న సీనిమా జూసి కథ చెపుతుంటే ఇసిత్రంగ ఇనుడు, గిదే పని దినాం… ఓ సారి కోతి కొమ్మ ఆడంగ మల్లేష్‌గాడు కొమ్మ మీదికెళ్లి జారిపడ్డడు. చేయి పట్టుకొని ఆడు ఒకటే మొత్తుకునుడు. దారెంట సైకిల్ మీన పోయెటాయిన ఆన్ని సర్కారు దవాఖాన్లకు తీస్కపోయిండు. ఎనుక బడి దోస్తులందరు ఉరికిండ్రు.

పండ్లూసి పోయిన కంపౌడర్ మల్లయ్య తెల్లమీసాలు నొట్లెకు రాంగ ‘చేయిరిగింది. డాక్టర్ చిట్టి తేపోండ్రి’ అనుకుంట ఆని చేయి గట్టిగ గుంజి సిమెంట్ పట్టి ఏసిండు. ‘ఈ తాతీల్లేమోనని పోరగాండ్ల కాల్జేతులు ఇరుగుతున్నాయి’ అనుకుంట కట్టు ఇప్పేతారీఖేసిండు పట్టి మీన. ఎట్ల తెలిసిందొగని మల్లేష్‌గాని నాయ్న సైకిలేసుకొని వచ్చిండు. పోరగాండ్లంత పరార్. ఇగ ఆని సెలవులు ఇంట్లనే ఒడిసినయి. ఆని ఇంటి మొకాని పోటానికి ఓనికీ దమ్ముల్లేకుంటె. ఆనవ్వ పొట్టు పొట్టు తిడుతదని భయం.

‘నేను ఇంటికాడ బాల్ కటింగ్ చేయించుకోను మంగలి తాత పూర్తిగ గొరుకుతుండు. దుకాన్ల జేయించుకుంట’ అని శీను గాడు అవ్వ ఎనుకాలవడి ఒకటే గునుసుడుకు బాపుకు తెల్వకుంట రూపాయి బిళ్ల చేతులవెట్టింది. కుర్సిల కూసొని కటింగ్ చేయించుకునుడు శీను గాడికి ఇదే మొదలు, ఆనింట్ల పాత రేకు కుర్సి తప్ప కట్టె కుర్సి సుతం లేదు. దేనికైనా ఈత సాప పరుసుడే. కుర్సిల కూసోని ముందట అద్దంల మొకం సూసుకుంట శీనుగాడు కొత్త సంబురంల ఉండంగ కటింగ్‌షాప్‌ల బెంచి మీన కూసోని పేపర్ సదివెటాయన ‘రేపు పదో తరగతి ఫలితాలట’ అన్నడు. ఒక్కసారి శీను

గాడు జడితిచ్చిండు. ‘ఏయ్.. మెస్లకు’ అని మంగలాయన బెదిరిచ్చిండు.
భయం భయంగ నిద్రవొయిన శీనుగాడు తెల్లారంగనే బస్టాండు కురికిండు. బస్టాండుల శంకర్ పాన్‌షాప్‌లకు పేపర్లస్తయి. అందరు ఎదురు సూత్తుండంగ హైదరాబాద్ బస్సులకెళ్లి శంకర్ పేపర్ కట్ట అందుకున్నడు. అందరు ఆయన సుట్టు జేరిండ్రు. బారాన పేపర్ రూపాయికి అమ్మిండు. ఇండ్లల్ల ఏసేటియిపోంగ అన్ని అమ్ముడువొయినయి.

కొనుక్కున్నోళ్లు నెంబర్లు సూత్తుంటె ఎగిరెటోడు ఎగుర్తాండు. ఏడ్సెటోడు ఏడ్తాండు. శీనుగాడు జేబుల్నుంచి హాల్ టికెట్ నెంబరున్న చిట్టీ తీస్కొని ఒకాయన ఎంబడివడ్డడు. ‘సరే నెంబరు జెప్పు’ అని ఆయన పేపర్ల తలకాయవెట్టిండు. ‘నెంబర్ లేదుర బిడ్డా “నీదే గాడు” నీకు అంటూ పది మంది ఇటు పది మందిగుడ పాస్ గాలె…’ అనంగనే శీను గాని పానం సల్లవడ్డది…. ఇంటికి వొయె మొకం లేక అట్నుంచటే గ్రౌండ్ కోయి సింతసెట్టెక్కి కూసున్నడు.

పన్నెండిటికి బాపు ఎతుకులాడుకుంట వచ్చి చెట్టు దిగమని సైకిల్ మీద ఇంటికి తీస్కపోయిండు. ‘ఇగ ఈని తోటి సదువుడు గాదు. దుకాన్ల వెట్టిత్తన్నడురా బాపు…’ అని శీను గాని తోటి రంధి పడుకుంట చెప్పింది అవ్వ. మా దోస్త్ సత్తిగానికి బిస్కిట్ల బట్టి ఉన్నది. సైకిల్‌కు డబ్బు కట్టుకొని దుకాన్లల్ల బిస్కిట్లెయ్యాలె… తిన్నన్ని బిస్కిట్లు…గా పనిజేత్త’ అన్నడు శీనుగాడు. తెల్లారే పేపర్ల పదోది రిజల్ట్ తక్కువచ్చిందని అయిదు మార్కులు కలుపుతుననరని వార్త వచ్చింది. ఆశపడ్డట్టే శీను గాడు పదోది బయటపడ్డడు. సైన్స్‌ల బాగ మార్కులచ్చినొల్లంత బైపిసి తీసుకుంటుండ్రు. ఏందో మంచిగుంటదని అందరంటె శీను గాడు కూడా బైపీసీలనే చేరిండు. క్లాసులకోతున్నకమాన తెలిసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత పిసలేపుతయో. సార్లు చెప్పుకుంటదోతున్నరు గని సారమైతే మెదడుకెక్కుతలేదు. ఒక్క శీనుగాని సంగతేగాదు చాలా మంది పరిస్థితి ఇదే.

రెండేండ్ల ఇంటర్మీడియట్‌ను మూడేండ్లల్ల ఒడ్డెక్కిచ్చినా ఆడు సర్దారే. శీను గాడు సర్దారే అయిండు.
ఇగ సైన్స్ మొకం సూడద్దనుకొని శీనుగాడు బి.ఎ.ల జేరిండు. అది అల్కగనిపిచ్చింది. కాలేజీ కొంగ మస్త్ టైం మిగులుతుండె. కాలేజీ నుంచి రాంగ దార్లె లైబ్రరీకి పోయి బంజేసేదాకా పేపర్లు, పుస్తకాలు చదివెటోడు.

ఓ నాడు కాలేజీకోంగ ఆని ఇంటర్మీడియట్ దోస్త్‌లు గల్సి మేం టీచర్లయినం’ అన్నరు. గదెట్ల అంటే ‘ఇంటర్ కాంగనే టిటిసి జేసినం. సదువంగనే నౌకర్లచ్చినయి’ అన్నారు భుజాలు పొంగిచ్చుకుంట. అరె గది నాకు తెల్వకపాయె అని పరేషానైండు శీను గాడు.
ఇంటర్ ఫెయిలైన కొందరు సోపటిగాళ్లు పెద్ద గడియారం కాన్నో, సిన్మటాకీస్లకాన్నో సోడాలమ్మెటోళ్లు, ఏక్ దమ్మున కనవడకుంటబోయిండ్రు. ఈ నడుమ రంగురంగుబట్టలు తొడుక్కొని చేతికి బాటు గడియారం తోటే కనవడ్డరు.

‘ఎటుదొయిండ్రురా! ‘అంటే’ దుబాయిపొయినం. పైస ఖర్చు గాలె… ఏజెంట్లో తోలుకపోయిండ్రు.. నెల రోజులుండి మల్లవోతం’ అనుకుంట దుబాయి సిగరెటు ముట్టిచ్చిండ్రు. అరె నేనెప్పుడు సంపాయిత్తనని ఆగమాగమైండు శీను గాడు. ఆని ఆగానికి అచ్చినట్లే బి.ఎ. ఆ కర్న ఎపిపిఎస్‌సి గ్రూప్ ఫోర్ పరీక్షలు జరిగినయి. వేయిల మంది రాసిండ్రు. గింత మందిల నేనెక్కడ కొట్టుకపోతనో అని మరిసిపోయిన శీనుగానింటికి నౌకరుకు రమ్మని లెటరచ్చింది. తాసిల్దారాఫీసుల గుమస్తా పని. ఆనింట్లనే గాడు వాడకట్టంత సంబురపడ్డరు. శీనుగాని బాపు కోన్ని గోసి బగార బువ్వ అందిచ్చి దగ్గరి సుట్టాలను బోయినాలు పెట్టిండు. ఆల్ల గడపల గిదే సర్కార్ నౌకరి. ఇదంత చెప్పి అందరి ముఖాలు చూస్తుండు తాసీల్దారు శ్రీనివాస్. ఇంక రెండు నెల్లకు రిటైర్ అయితుండు కాబట్టి పంద్రాగస్టుకు జెండా ఎక్కినించినంక తోటి ఉద్యోగులను బాయ్‌కి పిలిసిండు.

కొద్దిగయినంక అసలు ముచ్చట షురు జేసిండు తాసిల్దార్ శ్రీనివాస్. ‘ఆ శీను గాన్ని నేనేనని మీకు అర్థమయిండచ్చు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలె. ఒకటి చదువు. ఇంకోటి ఉద్యోగం. ఈ రెండిటి కోసం నేను పెద్దగ తిప్పలు పడలేదు. అవ్వయ్యల్ని పరేషాన్ చేయలేదు. నా పిల్లలను చదివించేయాల్లకు ఇంగ్లిష్ మీడియం తప్పలేదు. ఆళ్ల చదువుకు బాగనే ఖర్చయింది. నౌకర్లకు పెద్ద పోటీ… దొరకనోళ్లు మస్తు మంది ఉన్నారు. దొరికినోడు సుతం ఏం సుఖంగ లేదు. టెన్షన్ బతుకు. నోటి నిండ నవ్వులేదు. కంటి నిండ నిద్ర లేదు. కారు, ఇల్లు, రెడిమేడ్ బట్టలు… షోకులకేం తక్కువ లేదు గని… శాంతి లేదు. ఇగ నా మనుమలు, మనుమరాండ్లు సదువులో చూడాలె.

కేజీలకే లక్షల ఖర్చు, వాళ్ల ఉద్యోగాలు చేస్తరో… మర మనుషులతో యుద్ధాలే చేస్తరో…’ అని ఆపి మల్లోసారి అందర్ని సూడబట్టిండు. ఇంతట్ల చాయ్ కప్పులు పట్టుకొని చప్రాసి వచ్చిండు. సారు ముచ్చటకేంది బాగానే చెప్తడు అని మనషుల అనుకుంట అందరు చాయె జప్ప జప్ప తాగిండ్రు. జెండా వందనం కాంగనే ఆరోజు చేసుకుందామనుకున్న పనులు ఉరుకులాడుతున్నాయ్. సారు మల్ల మొదలువెట్ట దిక్క అనుకొని ఒక్కొక్కలు తాసిల్దార్‌కు నమస్తే పెట్టుకుంట బయటపడ్డరు. శ్రీనివాస్ ఒక్కడే మిగిలిండు. తన మాటల పట్ల వారికి ఆసక్తి లేకపోవడం ఆయనకే మాత్రం జీర్ణం కావడం లేదు. తలెత్తని చప్రాసి చూపులను గమనించి చల్లారిన చాయెను మింగి బయటకు నడిచిండు.

                                                                                                                                                                          బి.నర్సన్,  94401 28169