Home జిల్లాలు పల్లెలపై డెంగ్యూ పంజా

పల్లెలపై డెంగ్యూ పంజా

 విజృంభిస్తున్న మహమ్మారి..

 ఖిల్లా డిచ్‌పల్లిలో 12 బాలలకు డెంగ్యూ
 పారిశుధ్య లోపంతోనే.. అధికారుల నివేదిక

dengue-feverనిజామాబాద్: గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామీణంలో పారిశుద్యం పడకేసింది.. దీంతో విష వ్యాధులు విజృంభిస్తున్నాయి.. తాజాగా ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఒకేచోట 12 విద్యార్థులకు డెంగ్యూ సోకటంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగుతోంది.. పారిశుద్య కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకపోవటంతో.. గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలు సంకటంలో పడి కొట్టుమిట్టాడు తున్నాయి..
నెల రోజులకు పైగా..
గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికులు గత 32 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్యం పడకేసింది. దోమలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవటంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇలాంటి దుర్భరమైన వాతావరణంతో ప్రజలు సహవాసం చేసి అనారోగ్యాల బారిన పడుతున్నారు.
పాపం విద్యార్థులు
1nzb10p1డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో అధికారుల నిర్లక్షంతో డెంగ్యూ వ్యాధి సోకి 12 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 12 మందిలో నలుగురికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. మరో 8 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తమై పంపించారు. డెంగ్యూ వ్యాధి సోకిన నలుగురు కొప్పుల నిఖల్(9), గురడి ప్రత్యూష(14), గురడిచరణ్(12) హైదరాబాద్‌లో అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో విద్యార్థి జంగం నాగరాజు నిజామాబాద్ శివసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు వారి బంధువుల ద్వారా తెలిసింది. మరో 8 మందిని జిల్లా కేంద్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చినట్లు సమాచారం. రక్తపరీక్షలు సేకరించిన బద్దం రుచిత(12), రితు(8), వినయ(7), ప్రవళిక(14), బూస నిఖిల్(13), సుచరిత(12)లను ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరికి తీవ్ర జ్వరాలు రావటంతో బంధువులు డెంగ్యూ వ్యాధి సోకిందన్న అనుమానంతో జిల్లా కేంద్రంలోని వివిధ ఆసుపత్రుల్లోకి తీసుకెళ్లారు. గ్రామంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎం ఉన్నా.. విష జ్వరాలు ప్రభలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
సగం జనాభా ఆరు బయటకే..
గ్రామంలోని తాగునీటి ట్యాంకులు, శుభ్రం చేయకపోవటం, తాగునీటి ట్యాంకుల వద్ద పేరుకుపోయిన నీటిలో దోమలు, పందులు ఉన్నందున ఈ వ్యాధి విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిపాలన యంత్రాంగం కనీసం మురికి కాలువలను కూడా శుభ్రం చేయకపోవటం డెంగ్యూ వ్యాధి సోకిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఖిల్లా రామాలయం వెనక, పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉ న్న చెరువు కట్ట మొత్తం దుర్భరంగా తయారైంది. గ్రామంలోని ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టటం లేదు. దాదాపు సగం జనాభా బహిర్భూమికి చెరువు కట్ట పరిసర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతం పూర్తిగా దుర్గంధ భరితంగా మారింది. పారిశుద్య లోపంతో గ్రామం కంపుకొడుతున్నా.. గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం గ్రామంలోని మురుగుకాలువలు, వీధులను శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారుల తనిఖీలు
గ్రామంలో డెంగ్యూ వ్యాధి ప్రభలుతుందని సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ జిల్లా ఆరోగ్యశాఖ సుపరిండెంట్ వెంకటేశ్వర్లు, సబ్ సూపరిండెంట్ సత్యనారాయణ శనివారం హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారి బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పరిసరాలను శుభ్రం చేయకపోవటం వల్లే.. డెంగ్యూ వ్యాధి సోకిందని గ్రామ సర్పంచి రూప్‌సింగ్ , గ్రామ కార్యదర్శి లక్ష్మీనారాయణలపై సూపరిండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో ఉన్న మురికి కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. దోమలు, పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఇంకా ఎవరైనా జ్వరాలకు ఇతర వ్యాధులతో బాధ పడుతున్నవారు ఎవరైనా ఉంటే.. వారిని వెంటనే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని చూడాల్సిన బాధ్యత ఎఎన్‌ఎం సునీత, ఆశావర్కర్, అంగన్‌వాడి కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే.. వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపారు. గ్రామంలో పారిశుద్య లోపంపై సర్పంచి, పంచాయతీ కార్యదర్శులపై గ్రామ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు.