Monday, June 5, 2023

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

- Advertisement -
- Advertisement -

iran

 

ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిచర్య తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఇరాన్ అంతకు ముందు ప్రకటించినట్లే అమెరికాపై ప్రతిదాడి చేసింది. ఇరాన్ సైనిక కమాండర్‌ను ఇరాక్‌లో డ్రోన్ దాడితో అమెరికా హతమార్చిన తర్వాత ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్ సైనిక బలగాల్లో ఖుద్స్ బలగాలకు నాయకత్వం వహిస్తున్న జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్ ప్రతిదాడి చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తాకాయి. బాగ్దాద్‌లోను, ఉత్తర ఇరాక్‌లోను ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడిలో అమెరికన్లు ఎవరు మరణించలేదని వాషింగ్టన్ ప్రకటించింది. పాశ్చాత్య మీడియా ప్రకారం కొన్ని మిస్సైళ్లు గురి తప్పాయి. ఏదిఏమైనా ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించింది.

ప్రతిదాడి చేయడంతో పాటు, అమెరికా రెచ్చిపోయే నష్టం జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుందని పలువురు విశ్లేషించారు. అంతేకాదు, ఇరాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా గమనించాలి. అమెరికా చేసిన దాడికి సమానమైన స్థాయిలో ప్రతిస్పందిస్తామని ప్రకటించారు. సులేమానీ హత్యకు ప్రతిచర్యగా తాము చేయవలసిన దాడులు చేశామని, సైనిక దాడులు ఈ విషయంలో మరిన్ని లేవన్న సూచనలు కూడా ఇరాన్ పంపించింది. అంటే అమెరికా సైనిక స్థావరాలపై మరిన్ని దాడులు జరిగేది లేదని స్పష్టం చేసింది. పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య వర్గాల ప్రకారం ఈ దాడుల్లో అమెరికన్లు ఎవరు మరణించ లేదు. కాని ఇరాన్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో 80 మంది అమెరికన్లు మరణించారు. అమెరికా తన సైనికుల మరణాలను దాచిపెడుతుందని ఇరాన్ మీడియా చెప్పింది.

ఇరాన్‌లో ప్రజల ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ ప్రకటనలు ఉద్దేశించినవిగా చాలా మంది భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్తత తగ్గుముఖం పట్టినట్లే. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ముగించాలని, మరింత సాగదీయరాదని ట్రంప్ నిర్ణయించినట్లు ఆయన ప్రకటనను బట్టి తెలుస్తోంది. మరో వివాదం దీనికి సంబంధించిందే ముందుకు వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో టేకాఫ్ అయిన ఉక్రేయిన్ విమానం కుప్పకూలింది. ఇరాన్ క్షిపణి దాడులకు ఈ విమాన ప్రమాదానికి సంబంధం లేదని అంటున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోంది. బహుశా అమెరికా ఈ విమాన ప్రమాదానికి ఇరాన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేయవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతానికి పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు తొలగుతున్నట్లు కనబడుతోంది. ఈ ప్రాంతంలో ప్రజలు హమ్మయ్య అనుకునే వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇరాక్ ఈ రెండు దేశాల మధ్య ఇరుక్కునే పరిస్థితి నుంచి బయటపడింది. ఎందుకంటే, ఇరాక్ లో ఇంకా 5000 మంది అమెరికా సైనికులున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పోరాటంలో ఇరాక్ నలిగిపోయేది.

ఉద్రిక్తత చల్లారినప్పటికీ అనేక ప్రశ్నలు జవాబుల్లేకుండా మిగిలిపోయాయి. ఈ ప్రశ్నలు రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పెరగడానికి కారణం కావచ్చు. మొదటి ప్రశ్న. ఇరాక్ లో అమెరికా దళాలు ఇంకెంత కాలం ఉంటాయన్నది. విదేశీ సేనలన్నీ దేశం వదిలి వెళ్లిపోవాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానించింది. ఇందులో అమెరికా సైనికులే కాదు, ఆస్ట్రేలియాకు చెందిన మిలిటరీ శిక్షకులు కూడా ఉన్నారు. పార్లమెంటు తీర్మానాన్ని అమలు చేస్తామని ఇరాక్ ప్రధానమంత్రి ఆదిల్ అబ్దుల్ మహదీ అన్నారు. అంటే ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అమలు చేయడానికి సుముఖంగా ఉంది. అమెరికా సైనికులను బయటకు సాగనంపాలని ఇరాన్ కూడా ఒత్తిడి తీసుకువస్తుంది. సులైమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా సైన్యాన్ని ఇక్కడి నుంచి బహిష్కరించాలన్నది ఇరాన్ అభిమతం. కాని అబ్దుల్ మహదీ భయాలు ఆయనకు ఉన్నాయి.

అమెరికా సైనికులు వెళ్ళిపోతే మళ్ళీ ఐసిస్ ఉగ్రవాదులు తలెత్తుతారనే భయం ఉంది. 2014లో ఐసిస్ కారణంగానే అమెరికా సైన్యాన్ని ఇరాక్ దేశంలోకి ఆహ్వానించింది. నిజానికి 2011లోనే అమెరికా సైన్యం ఇరాక్ వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ 2014లో ఐసిస్ కారణంగా ఇరాక్‌లోకి వచ్చింది. ఐసిస్‌పై పోరాటానికి సహాయపడడం కోసం అమెరికా దళాలు వచ్చాయి. పైగా 2014 తర్వాత ఇరాక్‌లో 5.8 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం అమెరికా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాక్ పై బెదిరింపులు జారీ చేశాడు. అమెరికా సైన్యాన్ని బహిష్కరిస్తే ఇరాక్ పై ఆర్ధిక ఆంక్షలు విధిస్తామని అంటున్నాడు. అమెరికా చేసిన మిలిటరీ సహాయాన్ని తిరిగి చెల్లించాలని కూడా చెబుతున్నడు.

కాని ఇరాక్‌లో అమెరికా సైనికులు ఉంటే వారి భద్రత చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఇరాన్ అనుకూల మిలిషియా వారిపై ఎప్పుడైనా దాడులు చేయవచ్చు. కతాయిబ్ హిజ్బుల్లా వంటి ఇరాక్ మిలిషియా గ్రూపులు ఇరాన్ అనుకూల గ్రూపులు. డిసెంబరులో ఒక అమెరికా కాంట్రాక్టరును ఈ మిలిషియా గ్రూపు హతమార్చింది. ఆ తర్వాతనే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇలాంటి మరో దాడి జరిగితే, మరోసారి మిలిషియా ఎవరినైనా హతమార్చితే అమెరికా మళ్ళీ దాడి చేసే పరిస్థితి ఉంటుంది. దానికి ఇరాన్ ప్రతిదాడి చేయకుండా ఉండదు. అమెరికా సైన్యం ఇక్కడ ఉండడం వల్ల ఉద్రిక్తత పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. రెండో ముఖ్యమైన ప్రశ్న, సులైమానీ హత్య తర్వాత ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడేది లేదని ప్రకటించింది. నిజానికి ట్రంప్ ఈ ఒప్పందం నుంచి 2018లో వైదొలిగాడు. ఇరాన్ పై ఆంక్షలు విధించాడు. మిగిలిన యూరపు దేశాలు ఒప్పందాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ స్వయంగా ఈ ఒప్పందానికి కట్టుబడేది లేదంటోంది. అంటే అవసరమైతే అణుబాంబు తయారీకి యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని చెప్పడం.

యురేనియం శుద్ధి విషయంలో పరిమితులకు కట్టుబడేది లేదని ప్రకటించడం. అయితే ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ అణు సంస్థ తనిఖీలకు ఇరాన్ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ అణుసంస్థ తనిఖీలకు ఒప్పుకుంటామని చెప్పడం ద్వారా బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలను తనవైపు తిప్పుకుంది. ఆ విధంగా ఐక్యరాజ్యసమితి నుంచి ఆంక్షలు లేకుండా జాగ్రత్త పడింది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఊరుకోమని ట్రంప్ అంటున్నాడు. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేసే స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తే ఇరాన్ పై దాడులు చేస్తామని హెచ్చరించడం. ఇరాన్ అణుబాంబు కోసం యురేనియం శుద్ధి చేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పగలరు. అంతర్జాతీయ అణుసంస్థ తనిఖీలు తప్ప మరో మార్గం లేదు అణు ఒప్పందానికి ముందు ఇరాన్ అంతర్జాతీయ అణుసంస్థ తనిఖీలకు అస్సలు ఒప్పుకోలేదు. కాని ఇప్పుడు అనుమతిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ట్రంప్ వైఖరి వల్ల నష్టమా? లాభమా? ప్రస్తుతానికి పశ్చిమాసియాలో పరిస్థితి చల్లారినట్లు కనిపిస్తోంది. అమెరికాపై ఇరాన్ ప్రత్యక్షంగా మిస్సైళ్ళతో దాడి చేసినప్పటికీ అమెరికాను నిలువరించే మిలిటరీ శక్తి ఇరాన్‌కు లేదు. అమెరికాపై ప్రత్యక్ష దాడి చేయడం ద్వారా ఇరాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలను తగ్గించగలిగింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఇరాన్ ప్రముఖ సైనిక కమాండర్‌ను హతమార్చగలిగానను చెప్పుకోగలుగుతున్నాడు. ఎన్నికలు జరగబోయే నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధానికి ట్రంప్ కూడా సిద్ధంగా లేడు. నిజం చెప్పాలంటే ఇరాక్‌లో సైన్యాన్ని కూడా ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యపడదు. ట్రంప్ సేనలను వెంటనే వెనక్కు పిలవాలని కూడా భావిస్తున్నాడు. మొత్తం వ్యవహారంలో అటు ట్రంప్, ఇటు ఇరాన్ ఇద్దరు గెలిచినట్లే.

 

Iran attack on american base in Coutry
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News