Home తాజా వార్తలు పాలక్ పసంద్…

పాలక్ పసంద్…

Palak Curry

 

టమేటోతో పాలక్ కర్రీ

కావలసిన పదార్థాలు: పాలకూర – 2 కప్పులు, టొమేటోలు – 3, ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 4, పసుపు – అర టీస్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూను, కారం – అర టీస్పూను, ఉప్పు – సరిపడా, కొత్తిమీర – కొద్దిగా.
తయారీ విధానం: బాండీలో నూనె వేడి చేసి, ఉల్లిముక్కలు వేసి వేగించాలి. పచ్చిమిర్చి కూడా వేసి వేగించి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు కలపాలి. నిమిషంపాటు వేగించి, పాలకూర తరుగు వేయాలి. నాలుగు నిమిషాలు ఉడికించి, టొమాటో ముక్కలు వేసి కలపాలి. టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకూ ఉడికించి, కారం, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అర కప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్ నుంచి దింపేయాలి. ఈ కూరను వేడి అన్నంలో కలుపుకుని తింటే బాగుంటుంది.

Palak Soup

 

హాయినిచ్చే సూప్
కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు – 2 కప్పులు, ఉల్లిముక్కలు – పావు కప్పు, వెల్లుల్లి తరుగు – 1 టీస్పూను, సెనగపిండి – 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి – పావు టీస్పూను, బిరియాని ఆకు – 1, వెన్న – ఒకటిన్నర టీస్పూను, ఉప్పు, మిరియాల పొడి – కొద్దిగా, క్రీమ్ – తగినంత
తయారీ విధానం: బాండీలో వెన్న వేసి, బిరియాని ఆకు వేసి వేగించాలి. వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగించాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి మెత్తబడేవరకూ వేగించి, పాలకూర తరుగు చేర్చాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. మెత్తబడిన తర్వాత సెనగపిండి వేసి తిప్పి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. మరిగేవరకూ ఆగి, తర్వాత మంట తగ్గించి 4 నిమిషాలపాటు ఉడికించాలి. జీలకర్ర పొడి వేసి కలిపి మంట తీసేయాలి. చల్లారిన తర్వాత బ్లెండర్‌లో వేసి తిప్పాలి. బ్లెండర్‌లో వేసే ముందు బిరియాని ఆకు తీసేయాలి. సూప్ మరీ చిక్కగా ఉంటే పావు కప్పు నీళ్లు కలుపుకోవచ్చు. తర్వాత ఈ సూప్‌ను తిరిగి బాండీలో వేసి 3 నిమిషాలపాటు చిన్న మంట మీద ఉడికించి దింపాలి. వేడిగా ఉన్నప్పుడే బౌల్స్‌లో నింపి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.

palak Paratha

వేడివేడి పరాటా
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి – 2 కప్పులు, పాలకూర – పావు కిలో పచ్చిమిర్చి – 2, వాము – పావు టీస్పూను, నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, నూనె – పరాటా కాల్చడానికి సరిపడా.
తయారీ విధానం: పాలకూర శుభ్రంగా కడిగి, నీళ్లలో 6 నిమిషాలపాటు మరిగించాలి. నీటిని వడగట్టి పాలకూరను, ఆ వడగట్టిన నీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. పాలకూరను బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. గోధుమపిండిలో ఉప్పు, వాము, నెయ్యి, పాలకూర ముద్ద వేసి కలుపుకోవాలి. పాలకూర ఉడికించిన నీరు చేరుస్తూ ముద్దగా పిసుక్కోవాలి. పిండిని పరాటాగా వత్తుకుని నెయ్యి పూసి, నలుచదరంగా మడిచి, రెండోసారి పరాటా వత్తుకోవాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న పరాటాల మీద నూనె పోస్తూ పెనం మీద రెండు వైపులా కాల్చి సబ్జీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Palak Rice

 

కలర్‌ఫుల్‌గా…
కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు – 4 కప్పులు, అన్నం – 2 కప్పులు, ఉల్లి తరుగు – 1 కప్పు, టొమాటో గుజ్జు – అర కప్పు, జీలకర్ర – 1 టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు – 15, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – అర టీస్పూను పచ్చిమిర్చి – 3.
తయారీ విధానం: పాలకూర శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. బాండీలో నూనె పోసి, వేడయ్యాక ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేగించాలి. మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత టొమాటో తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుతూ వేగించాలి. ఉప్పు వేసి కలపి, పచ్చివాసన పోయేంతవరకూ పాలకూరను వేగించాలి. దాంతో మిశ్రమమంతా కర్రీలా తయారవుతుంది. తర్వాత అందులో అప్పటికే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి, తిప్పి పొయ్యి నుంచి దింపేయాలి. రుచి కోసం కొత్తిమీర చల్లుకోవచ్చు. వేడి వేడి పాలక్‌రైస్‌ను కర్రీ లేకుండానే తినేయొచ్చు.

Palak Fry

వేపుడు
కావలసిన పదార్థాలు: పాలకూర కట్టలు -4, ఉల్లిముక్కలు – 1 కప్పు, సెనగపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూను, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూను, జీలకర్ర – 1 టీస్పూను, మినప్పప్పు – 2 టీస్పూన్లు, ఎండుమిర్చి – 4, పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి – 6 (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు – 2 రెమ్మలు.
తయారీ విధానం: పాలకూర సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసి, వేడయ్యాక ఆవాలు వేసి వేగించాలి. ఆవాలు చిటపటలాడాక, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేగించాలి. పప్పు ఎర్రగా వేగాక, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి చక్కగా కలిపి వేగించాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. చివర్లో పాలకూర వేసి 10 నిమిషాలపాటు వేయించాలి. ఉడికిన తర్వాత సెనగపప్పు పొడి వేసి కలిపి వేడిగా వడ్డించాలి.

Palak Recipes in Telugu