Home బిజినెస్ పీకల్లోతు కష్టాల్లో…

పీకల్లోతు కష్టాల్లో…

Financial difficulties arise, cuts in employees' salaries

త్రైమాసిక ఫలితాలు వాయిదా వేసిన జెట్ ఎయిర్‌వేస్
భారీగా నష్టాలు ఉన్నట్టు రిపోర్టు
అత్యవసర మూలధనం అవసరం

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతుందని, కంపెనీ వాటాలను విక్రయిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కంపెనీ జూన్ త్రైమాసిక ఫలితాలు మార్చి త్రైమాసికంతో పోలిస్తే అత్యధిక నష్టాలు కలిగి ఉందని నివేదిక వస్తున్నాయి. ఆగస్టు 9న జెట్ ఎయిర్‌వేస్ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం) తర్వాత శుక్రవారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా వాయిదా వేసింది. బోర్డు ఆమోదం కోసం ఆడిట్ కమిటీ సిఫారసు చేయడంతో వాయిదా పడిందని తెలుస్తోంది. మరోవైపు స్టాక్‌మార్కెట్లో కంపెనీ షేరు విలువ దారుణంగా పతనమవుతుండడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. జెట్ ఎయిర్‌వేస్ క్యూ1 ఫలితాలను వాయిదా వేయడంపై సమాచారం ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్సేంజ్ కోరింది. మొత్తానికి కంపెనీ తీవ్ర క్లిష్ట పరిస్థితిలో ఉందని తెలుస్తోంది.

గత ఎనిమిది త్రైమాసికాలుగా వరుసగా కంపెనీకి ప్రయాణికుల నుంచి ఆదాయం గణనీయంగా పడిపోయిందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకులు తెలిపారు. ఖర్చు పెరగడంతో ఆదాయం తగ్గుతూ వచ్చింది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలు, కరెన్సీ విలువ, పోటీ వాతావరణం వల్ల 201819 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం రూ.1500 కోట్ల వరకు ఉంటుంది. అంటే విమాన సంస్థకు ప్రతి రోజు రూ.4 కోట్ల నష్టమేర్పడుతోంది. అధిక రుణాల కారమంగా జెట్ ఎయిర్‌వేస్ నిల్వలు కూడా తగ్గిపోయాయి. దీంతో విమాన సంస్థ అత్యవసర మూలధనం అవసరం ఏర్పడింది. ఆర్థిక భారంతో యాజమాన్యం కంపెనీని నడపలేని స్థితి ఏర్పడింది. అయితే ఇతర విమాన సంస్థలు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూ నష్ట భయాలు లేకుండా చూసుకుంటున్నాయి.

స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ, టర్బైన్ ఇంధన వ్యయం 35 శాతం పెరిగిందని, దీంతో సంస్థపై భారం పడిందని, ప్రయాణికుల చార్జీలను పెంచకుండా ఉండడం వల్ల ఇంకా నష్టపోతున్నామని అన్నారు. ఇన్‌పుట్ వ్యయం(ఇంధనం) గణనీయంగా, అకస్మాత్తుగా పెరిగిందని, అదే సమయంలో ఇంధన యేతర ఖర్చులు కూడా పెరిగాయని ఆయన తెలిపారు. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి కూడా 65 నుంచి 69కి చేరింది. సంస్థ షేర్ల విలువ రోజు రోజుకీ పతనమవుతున్న నేపథ్యంలో అనేకమంది ఇన్వెస్టర్లు తమ వాటా విలువను కోల్పోతున్నారని, ఇది ఎంతో బాధను కల్గిస్తోందని అన్నారు. ‘అనేక మంది వాటాదారులు తమ డబ్బును కోల్పోయారు. ఇది నన్ను బాధిస్తోంది’ అని అన్నారు. కాగా సిబ్బంది వేతనాల్లో కోత విధించాలని భావిస్తున్న సంస్థకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోతకు వారు ససేమీరా అనడంతో జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉద్యోగుల నిరసనతో కంపెనీ వెనక్కితగ్గింది. గ్రౌండ్ స్టాఫ్‌లో 500 మందిపై వేటు వేయాలని ఈ ఎయిర్‌లైన్స్ నిర్ణయించిందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్‌లో 16,558 మంది ఉద్యోగులున్నారు.

500 మిలియన్ డాలర్లు అవసరం
జెట్ ఎయిర్ ఆర్థిక ఇబ్బందుల దృష్టా 500 మిలియన్ డాలర్ల వరకు మూలధనం అత్యవసరమని, రుణాలు చెల్లించేందుకు తప్పనిసరిగా 400 మిలియన్ డాలర్లు కావాల్సి ఉందని విమానరంగానికి చెందిన కాపా సెంటర్ సౌత్ ఆసియా సిఇఒ కపిల్ ఆసియా తెలిపారు. జులై నుంచి స్టాక్ విలువ దాదాపు 12 శాతం పడిపోయింది. షేరు విలువ 52 వారాల కనిష్ట స్థాయి రూ.287 కు చేరుకుంది. అత్యధిక పోటీ, ఇంధన ధరలు పెరగడం కంపెనీ భారంగా మారిందని ముంబైలో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి గోయల్ అన్నారు.

క్యూ1 వాయిదాపై వివరణ కోరిన బిఎస్‌ఇ
జెట్ ఎయిర్‌వేస్ జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన వాయిదా వేసిన తర్వాత మరుసటి రోజు స్టాక్‌మార్కెట్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలు కంపెనీ నుంచి వివరణ కోరాయి. ఫలితాల వాయిదా, కంపెనీ బోర్డు సమావేశం, తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేయాలని మార్కెట్లు కంపెనీని కోరాయి. ఆగస్టు 9న కంపెనీ బోర్డు డైరెక్టర్లు సమావేశమై, జూన్ త్రైమాసికానికి గాను ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. మరోవైపు సంస్థకు ఈసారి భారీ నష్టాలు ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.