Home తాజా వార్తలు వరవరరావు అరెస్టు

వరవరరావు అరెస్టు

Pune Police arrested P.Verwara Rao in the murder case of Prime Minister

ప్రధాని హత్య కుట్ర కేసులో అరెస్టు చేసిన పుణె పోలీసులు
నేడు సాయంత్రం 5 గంటలకు పుణె కోర్టులో హాజరు పర్చాలని నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలు
దేశవ్యాప్తంగా మరి ఐదుగురు హక్కుల నేతల అరెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు పి.వరవరరావుని పుణే పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో పుణే పోలీసులు ఢిల్లీ, ముంబాయి, జార్ఖండ్, గోవాలలో దాడులు నిర్వహించి మావోయిస్టు సానుభూతి పరులు, హక్కుల నేతలు గౌతమ్ నవ్‌లఖ, గన్‌సాల్వేస్, అరుణ్, సుధా భరద్వాజ్, స్వామిలను అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని వరవరరావు ఇంటిపై మంగళవారం ఉదయం పుణే పోలీసులు దాడి చేశారు. అతని కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు విరసం కార్యవర్గ సభ్యులు క్రాంతి, విరసం సభ్యులు కూర్మనాథ్ ఇంటిపై కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది గంటల పాటు వరవరరావును పోలీసులు ఆయన ఇంట్లోనే ప్రశ్నించారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై వరవరరావును అరెస్టు చేసినట్లు పుణే ఎస్‌పి రాకేష్ తెలిపారు. వరవరరావుకు గాంధీఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పుణే పోలీసులు ఆ తరువాత నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. వరవరరావును బుధవారం సాయత్రం 5 గంటలలోపు పుణే కోర్టులో హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో వరవరరావును భారీ బందోబస్తు మధ్య పోలీసులు పుణేకు తరలించారు.అయితే వరవరరావుపై నిషేధిత వ్యక్తులపై ప్రయోగించే ఉపా (యూఎపిఎ) యాక్ట్‌ను ప్రయోగించారు. ప్రధాని హత్యకు కుట్రా పన్నారని ఇటీవల మహారాష్ట్రలోని పుణే జిల్లా విక్రమ్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నమోదైన కేసులో వరవరరావు నిందితుడు. వరవరరావుపై ఐపిసి 153(ఎ), 505 (బి), 117, 120 (బి), 34, ఉపా యాక్ట్ 13, 16, 17, 18 (బి), 20, 38, 39, 40 కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్రపన్నారని పుణె క్రైమ్ ఇన్‌స్పెక్టర్ డీపక్ నికమ్ ఆరోపించారు.

అందులో ఆధారంగా తమ సోదాల్లో లభించినట్లు చెప్తున్న ఒక ఈ-మెయిల్ లేఖను గతంలో కోర్టుకు సమర్పించారు. సోదాల్లో లభించిన మరో లేఖలో..న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ (ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు), విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు మద్దతు, మార్గదర్శకత్వాలతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దాడులు చేసినట్లు ఉందని పుణే పోలీసులు చెప్తున్నారు. “ఇంకా పెద్ద చర్యలు చేపట్టటం కోసం ‘జంగల్ కామ్రేడ్లు’కు ప్రణాళికను అందించే బాధ్యతను, తదుపరి చర్యలు చేపట్టటం కోసం వరవరరావు సమకూర్చిన నిధులను అందించే బాధ్యతను సురేంద్ర గాడ్లింగ్‌కు” ఇచ్చినట్లు ఆ లేఖలో ఉందన్నారు. భీమా-కోరెగావ్ హింసకు కారకులని, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ.. జూన్ 6న అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకరైన రోనా విల్సన్ తదితరుల ల్యాప్‌ట్యాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ ఆ లేఖలు లభించినట్లు పుణె పోలీసులు కోర్టుకు చెప్పారు.ప్రధాని మోడీ రోడ్ షోలకు వెళ్లినప్పుడు ఆయనపై దాడికి అనువైన రీతిలో వ్యూహరచనకు దిగాలని, ఇందుకు సాధన సంపత్తిని సమకూర్చుకోవాలని ఈ లేఖలో ఉంది.

‘ఆర్’ పేరిట క్రామ్రేడ్ ప్రకాశ్‌కు వచ్చిన లేఖను అనుమానిత మావోయిస్టు ఇంటిలో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ హత్య తరహాలోనే హత్యకు పథక రచన జరగాల్సి ఉందని, ఇందుకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని, వీటితో అవసరమైన ఎం రైఫిల్‌ను, 4 లక్షల రౌండ్ల మందు గుండును సేకరించుకోవచ్చునని ఈ లేఖలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఇంతకీ ఈ లేఖలు ఎక్కడివి..?
జనవరి 1న మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్‌లో..“ఫీష్వాలపై దళితుల విజయం” 200వ వార్షికోత్సవ నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా, పోలీసులు సహాపలువురు గాయపడ్డారు. తొలుత..ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేశారు. వీరిలో మిలింద్ ఎక్బోటేను అరెస్టు చేయగా ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. శంభాజీ భిడేను అరెస్టు చేయలేదు. అయితే తాజాగా..ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై రిపబ్లికన్ పాంథర్స్ జాతి అంతాచీ చల్వల్ (ఆర్‌పి) నేత సుధీర్ ధవలే, నాగ్‌పూర్‌కి చెందిన హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌లతో పాటు నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోమా సేన్, పిఎంఆర్‌డి మాజీ పరిశోధకుడు మహేష్‌రావుత్‌లను ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీలలో పుణె పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్‌లలో..రోనా విల్సన్, సురేంద్రగాడ్లింగ్, సుధీర్ ధవలేలతో పాటు మావోయిస్టు మద్దతుదారులుగా అనుమానిస్తున్న హర్షాలీ పొద్దార్ తదితర నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించామని పుణే పోలీసులు చెప్పారు. ఆ సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, కొన్ని ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నామని..వాటిని పుణె ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించి..వాటి నుంచి మిర్రర్ ఇమేజీలను సేకరించామని పేర్కొన్నారు. ఆ ప్రింటవుట్లను పరిశీలించగా..రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని హత్య చేయడానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు.ఈ సాక్ష్యాల ఆధారంగా పై ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో భాగంగానే మరికొందరి ఇళ్లపై దాడులు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు.

నమ్మలేము..మాజీ ఐపిఎస్‌లు
“మావోయిస్టులు తమ సమాచార మార్పిడిలో (లేఖల్లో) అసలు పేర్లను ఉపయోగించినట్లు నా కెరీర్‌లో నేను చూడలేదు. వాళ్లు మారు పేర్లను మాత్రమే ఉపయోగిస్తారు” అని జార్ఖండ్ మాజీ డిజిపి జి.ఎస్.రథ్, గుజరాత్ మాజీ అదనపు డిజిపి శ్రీకుమార్ అభిప్రాయపడ్డారు.

హక్కుల నేతలే లక్షంగా దాడులు: సిపిఎం
కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులతో పాటు మానవ హక్కులు, ప్రజాస్వామిక హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతుందని సిపిఎం ఆరోపించింది. ఇందులో భాగంగానే మంగళవారం రాష్ట్రంలో పౌర, మానవ హక్కుల నేతల ఇళ్ళల్లో పోలీసులు సోదాలు జరిపారని తెలిపారు. సోదాల నేపథ్యంలో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును అరెస్టు చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది.

వరవరరావుపై ఉపా కేసు..  దేశంలో ఐదుగురిపై మాత్రమే ఈ ఉపా చట్టం కింద కేసులు నమోదు కావడం జరిగింది. 2009లో మావోయిస్టు నేత కోబార్డు గాంధే, మానవ హక్కులనేత డాక్టర్ వినాయక్ సేన్, ఐఎస్‌ఐఎల్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ నిర్వహించిన వ్యక్తి మేహిదీ మాస్రుర్ బిస్వాస్, సిపిఐ మావోయిస్టు నేత గౌర్ చక్ర బోర్టి, తమిళనాడు మానవ హక్కుల నేత తీరుమురుగన్ గాంధీపై ఉంది. ఇప్పుడు మళ్లీ అదే యాక్ట్ విరసం నేత వరవరరావుపై కూడా నమోదు చేసిన పుణే పోలీసులు. ఈ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ 15, 16, 17 కింద కేసు నిరూపితం అయితే టెర్రరిస్టుగా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం. దేశ ఐక్యత సమగ్రతను దెబ్బతీసే విధంగా, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసే గ్రూపులను అణచివేయడానికి తీసుకొచ్చిన చట్టమే ఉపా చట్టం. అయితే ఆ లేఖలు అందులోని అంశాలు అన్ని పోలీసుల సృష్టేనని విప్లవ రచయితల సంఘం ఆరోపిస్తోంది.