Home ఎడిటోరియల్ ప్రలోభాల గుప్పిట్లో కవులు

ప్రలోభాల గుప్పిట్లో కవులు

Some poets are lying beside self-esteem to get the awards

సమాజంలో విలువ పెంచుకోవడానికో, కీర్తి పొందాలన్న తహతహో కానీ, ఆయా పురస్కారాలు పొందడానికి కొందరు కవులు ఆత్మాభిమానాన్ని పక్కన పెడుతున్నారు. హృదయం స్పందిస్తేనే కవిత్వం పురుడు పోసుకుంటుంది అని, ప్రతీ అక్షరం వంద సార్లు మరణించి తిరిగి పునరుజ్జీవం పొందినపుడే  అద్భుతమైన భావం పలుకుతుందని అంటారు కవీశ్వరులు.మరి ఇక్కడ అవార్డులు కనిపిస్తే చాలు,వాటి వేట మొదలవుతుంది.

కవిత్వానికి నిర్వచనం చెప్పమంటే,కవిత్వాన్ని కొలిచే తూనిక రాళ్లు లేవు అన్నా రు ఆనాడు చలం. కవి అంటే ఎవరు అని అడిగితె,కష్టజీవికి ఇరువైపులా ఉండే వాడే అనే అర్ధాన్నిచ్చాడు అభ్యుదయ కవి శ్రీ శ్రీ. మరి కష్ట జీవికి ఇరువైపులా అంటే, సమాజాన్ని ప్రతిబింబించే వాడే నిఖార్సయిన కవి అనేగా ఇక్కడ కవి కాకుండా నిఖార్సయిన కవి అని అనడానికి గల కారణం, ఈ రోజున నాలుగు అక్షరాలను అల్లి, పది వాక్యాలను పేర్చి, ఓ పది ఇరవై కవితలు రాసిన ప్రతీ ఒక్కరు కవి అనే తోక తగిలించుకుంటున్నారు మరి. లేదు లేదు సమాజమే వారికి ఆ ముసుగు తొడుగుతుంది.సరే అలా అనడంలో తప్పు లేదు అనుకుందాము,ఎందుకంటే ఈ ప్రపంచీకరణ యుగంలో భాషపై ఇష్టం తో కవిత్వం రాసే ప్రయత్నం చేసినందుకు. మరి ప్రతీ కవి నిఖార్సయిన కవి అవుతాడా! కవుల వల్ల తెలుగు భాషలో ఎక్కువ రచనలు రావొచ్చు, వివిధ గ్రంథాలు తెలుగులో వెలవడవచ్చు, తెలుగు సాహిత్యమూ తరువాతి తరానికి చేరడంలో తమవంతు పాత్ర పోషించవచ్చు, భాషకిది మంచి పరిణామమే,కాదనలేము. అయితే కవి అంటే కేవలం తెలుగు సాహిత్య అభివృద్ధికే కృషిచేసేవాడా? అలా అయితే సమాజంలో కవికి అంతటి ఉన్నత స్థానంవచ్చి ఉండేది కాదు.

ఎన్నో ఉద్యమ పోరాటాల్లో విశేష స్థానాన్ని ఆక్రమించేది కాదు.ఒకప్పటి రచనలు ప్రస్తుత సమాజంపై కూడా ప్రభావం చూపిస్తున్నాయంటే ఇంకేదో ఉంది. ఆనాడు తెలుగులో సాహిత్యం లేని కాలంలో సాహిత్య రచన చేసి,పురాణ ఇతిహాసాలలోని విజ్ఞానాన్ని తెలుగు ప్రజలకు అందించాలన్న తపనతో ,తెలుగు భాష అస్థిత్వాన్ని నిలబెట్టాలన్న సదుద్దేశంతో సంస్కృత ఆధిపత్యం మధ్యన కీర్తి ప్రతిష్టల కోసం అల్పుడిలా పాకులాడక తెలుగులో సాహిత్య సృష్టి చేసిన నన్నయ నిఖార్సయిన కవి అంటే.నేను సంస్కృతంలో రాయను,తెలుగులోనే రాస్తాను అని తెగించి చెప్పిన పాల్కురికి సోమనాధుడు నిఖార్సయిన కవి.అంటే, బడుగుల పేదల కన్నీటి చారికలు తుడవని కవిత్వం కవిత్వమే కాదని,భావ కవిత్వాన్ని త్యజించి అభ్యుదయ కవిత్వానికి ఊపిరులూదిన శ్రీశ్రీ నిఖార్సయిన కవి అంటే.

అలాంటి మహానుభావులెందరో మన తెలుగుగడ్డపై నడయాడారు. కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రఖ్యాతలను తృణప్రాయంగా త్యజించి సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు చేసారు. ఇప్పటి తరంలోను అలాంటి కవులు లేకపోలేదు, కానీ వారి సంఖ్య లెక్కపెట్టేటంత. ఈ రోజున ఎంత మంది సమాజాన్ని ప్రభావితం చేయాలన్న దృఢ సంకల్పంతో రచనలు చేస్తున్నారు, పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడకుండా ప్రభుత్వాన్ని, సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. తరచి చూస్తే వారి వారి పేర్ల పక్కన వేలాడే బిరుదులు చెప్తున్నాయి వాస్తవ సంఘటనలని.ఉదాహరణకి తెలుగు కవితా వైభవం అనే సాహితీ సంస్థ సాహిత్య అభివృద్ధి కోసం, భాష కోసం,కవులను రచయితలను ప్రోత్సహించడం కోసం ఎన్నో అవార్డులను ఏటా ప్రకటిస్తోంది.సంస్థ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆయా అవార్డులను పొందటం కోసం కొందరు కవులు పడుతున్న తాపత్రయమే ఇక్కడ సమస్యగా మారుతుంది.ఇది కేవలం ఈ ఒక్క సంస్థ విషయంలోనే కాదు,అన్ని సాహితీ సంస్థల విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.

సమాజంలో విలువ పెంచుకోవడానికో,కీర్తి పొందాలన్న తహతహో కానీ,ఆయా పురస్కారాలు పొందడానికి కొందరు కవులు ఆత్మాభిమానాన్ని పక్కన పెడుతున్నారు.హృదయం స్పందిస్తేనే కవిత్వం పురుడుపోసుకుంటుంది అని,ప్రతీ అక్షరం వంద సార్లు మరణించి తిరిగి పునరుజ్జీవం పొందినపుడే అద్భుతమైన భావం పలుకుతుందని అంటారు కవీశ్వరులు.మరి ఇక్కడ అవార్డులు కనిపిస్తే చాలు,వాటి వేట మొదలవుతుంది. ఇక్కడ ఆయా సాహితీ సంస్థలను,అవి ప్రకటించే పురస్కారాలను తప్పు పట్టడం ఉద్దేశం కాదు.కానీ,వంద కవితలు రాస్తే సహస్ర కవిమిత్ర ,అయి దు వందల కవితలు అల్లితే ఇంకొక పెద్ద బిరుదు,వంద పద్యాలు రాస్తే సహస్ర పద్య కంఠీరవ.ఇంకేం కవితల వేట షురూ. కవుల వెంట అవార్డులు పడి రావాలి కానీ, వాటి వెంట కవులు పడడం శోచనీయం.

ఈ మధ్య అదే సంస్థ వారు మరొక అంశంలో పురస్కారాలను ప్రకటిస్తామని సెలవిచ్చారు.కనుమరుగయిన లేఖలని తిరిగి పునరుద్ధరించడం ఆ సంస్థ ఆశయం కావొచ్చు,మంచిదే.ఆ బిరుదు పేరే సహస్త్ర లేఖా సాహిత్య మిత్ర.దీంతో అప్పటి వరకు లేఖలను రాయని వారు సైతం కేవలం కొన్ని నెలల్లోనే వంద లేఖలురాసి ఆ బిరుదుకు ఎంపికయిన వారు ఉన్నారు, ఎందుకు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది,ఇక సహస్ర కవిమిత్ర కోసం అప్పటికప్పుడు వంద కవితలు రాసి ఎంపికయిన వారు ఎందరో,మరి ఆయా రచనల నాణ్యత విషయం ఏమిటని చూసేవారేరి.ఈ విషయం కొంత అనుభవం ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ కవులు పురస్కారాలు తీసుకోవడం తప్పు కాదు, వాటి కోసం వెంపర్లాడడం తప్పు. అంటే ఆయా కవుల కలం కదిలింది సమాజం కోసం కాదు,పురస్కారాల కోసం.అంటే కొంద రు కవులు ఏ స్థాయిలో తమను తాము దిగజార్చుకుంటున్నారో ఒకసారి వారికి వారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.అలాంటి వారు సాధారణ కవులవుతారే గాని సమాజంలో మార్పును తెచ్చే సుకవులు అవలేరు,కాల గర్భంలో వారి రచనలు కనుమరుగవాల్సిందే.

ఇకపోతే వివిధ కవిసమ్మేళనాలలో పాల్గొన్న వారికి సత్కారం ఉంటుంది అంటే చాలు,మనసు పరుగులెడుతుంది,నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు,నలుగురు కలుస్తారు,వారితో తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే మంచిదే,కానీ చాలా మంది ఒక గుడ్డముక్క,చెక్క బొమ్మ కోసం,పెద్దలతో ఒక ఫోటో కోసం,దానిని సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం కోసం పరుగులు పెట్టడం నిజంగా బాధాకరం. అందరు కవులు అలా ఉన్నారని అనడం లేదు,కానీ ఎక్కువ సంఖ్యలో అలానే ఉన్నారు.ఇక వంద,వేయి కవులతో రికార్డు కవిసమ్మేళనాలు జరగడం ఈ మధ్య పరిపాటిగా మారింది.వీటి ఉద్దేశం మాట ఎలా ఉన్నా,ఈ రోజున యువకులకు అలాంటి కార్యక్రమాల కన్నా కవిత్వంపై మెళుకులను అందించి వారిని సమర్థులుగా తీర్చిదిద్దే అనుభవజ్ఞుల పాఠాలే కావలసింది.

దురదృష్టవశాత్తు ఆ దిశగా ప్రయత్నాలు అంతగా జరగడం లేదు.ఇటు వైపు అనుభవజ్ఞులు సైతంసభలకు హాజరవడం,పుస్తకాలకు ముందు మాటలు రాయడానికి ఎక్కువ విలువ ఇస్తుండడం అంత సముచితము కాదు,వారి అనుభవం యువతకు చేరాల్సిన అవసరం ఉన్నది,అలాగే వివిధ సాహితీ సంస్థలు ఇస్తున్న అవార్డుల్లో కూడా పారదర్శకత చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున కేంద్ర సాహిత్య అవార్డులనుండి,చిన్న చిన్న అవార్డుల వరకు అర్హత లేని ఎన్నో రచనలకు అవార్డులు వస్తుండడం జగమెరిగిన సత్యమే. వాటికి అర్హత పైరవీలే.లాబీయింగ్ ఉన్న రచనే అత్యుత్తమమయినది.పరిస్థితులు ఇలా ఉంటే కవులని విమర్శించి మాత్రం ఏం ప్రయోజనం.

చివరికి ఇలాంటి వాటిపై కూడా కవులు ధిక్కార స్వరం వినిపించకపోవడం పరిస్థితిని అద్దం పడుతుంది.అయినా మనం కవులం.ఓ రివార్డు కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు.అలా పెట్టడమంటే కవిగా చావడమే.కవులు ఎప్పుడు ప్రతిపక్షమే,ప్రజల పక్షమే.సమాజపు జీవన నాడిని వినిపించేవాడే కవి,సమాజం ప్రతినిధిగా నిలిచేవాడే కవి.మరి అలాంటి కవి ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డులకై అర్రులు చాస్తుంటే ఇక సమాజాన్ని,ప్రభుత్వాన్నేం ప్రశ్నించగలడు, ప్రజల పక్కన ఎలా నిలబడగలడు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని పురస్కారాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.

అపుడే సత్తా ఉన్న రచనలు వెలుగు చూస్తాయి. దురదృష్టవశాత్తు కవులలో కూడా రాజకీ యాలు రాజ్యమేలుతున్నాయి. ఇవి కూడా కవులు దొడ్డదారులు తొక్కడానికి కారణమవుతాయి.కవులు ఇలాంటి వర్గ విభజనను ముక్త కంఠంతో విభేదించాలి.మీ కవిత ఒకరి కన్నీటిని కాస్తయినా తుడవగలిగినపుడు,విసిగి వేసారిన జీవితంలో ఆశలను రేకెత్తించినపుడు, మొద్దుబారుతున్న హృదయాలను ప్రేమతో ఏకం చేపించినపుడు, సమాజంలో చైతన్యం రగిలించినపుడు మీ రచనలకు సార్థకత వస్తుంది, గుర్తింపు కోసం ఎవరి కాళ్ళ మీదా పడాల్సిన అవసరం లేదు,పురస్కారాలు వాటంతటవే పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. అలాంటి రచనలే కవుల ఆశయమవ్వాలి. సమాజమే కవుల దృక్కోణం అవ్వాలి. ఆత్మసాక్షిగా ముందుకు నడవాలి,సమాజాన్ని నడిపించాలి.

అవార్డులు, రివార్డులు కేవలం ప్రోత్సాహాన్ని నింపే శ్రేయోభిలాషులుగా మాత్రమే ఉండాలి. సరిహద్దు రేఖపై ప్రాణత్యాగానికి తెగించి దేశ భద్రతను కాపాడేవాడే సైనికుడైతే, సమాజంలో ఉంటూ సమస్యలపై పోరాటం చేసి సమసమాజ స్థాపనకు కృషి చేసే ప్రజల బంధువే కవి. కాలం కన్నా కలం పదునైనది. అలాంటి ఆయుధం చేతిలో ఉన్నప్పుడు, సరిగ్గా ఉపయోగిస్తే అంతకన్నా శక్తిమంతుడు ఉండడు. రాసే ప్రతీ అక్షరం ఓ సందేశాన్ని ఇవ్వాలి, ప్రతీ పదం సమాజాన్ని కదిలించగలగాలి. ప్రతీ భావం సరైన మార్పుని వ్యవస్థలో తీసుకురాగలగాలి. కవి అంటే ఓ చేత్తో తెలుగు భాషని, మరో చేత్తో సమాజపు తలరాతను లిఖించేవాడు.అదే కవి ధ్యేయం కావాలి. అప్పుడే కవిగా జీవితం సార్థకమవుతుంది.