Home జగిత్యాల మంత్రి ఈటెల వ్యాఖ్యలను నిరసిస్తూ గంగపుత్రుల ఆందోళన

మంత్రి ఈటెల వ్యాఖ్యలను నిరసిస్తూ గంగపుత్రుల ఆందోళన

concerns protest against comments of minister's spear

జగిత్యాల: చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లకే పూర్తి హక్కు కల్పిస్తూ త్వరలోనే జిఒ జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడి తమ మనోభావాలను దెబ్బతీశారంటూ జగిత్యాలలో గంగపుత్రులు సోమవారం ఆందోళన నిర్వహించారు. మంత్రి ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న జిల్లాలోని సుమారు 500 మందికి పైగా గంగపుత్రులు కొత్తబస్టాండ్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగించాలని, చెరువులు, కుంటలపై పూర్తి హక్కును గంగపుత్రులకే కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అదే సమయంలో జిల్లాకు మంజూరైన మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి జగిత్యాలకు చేరుకోగా గంగపుత్రులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు మంత్రిని కార్యక్రమ వేధిక వద్దకు కాకుండా ఎంపి కవిత కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆందోళన విరమించాలని పోలీసులు ఎంత సముదాయించినా గంగపుత్రులు ససేమిరా అనడంతో ఆర్‌డిఒ నరేందర్, జిల్లా ఎస్‌పి సునీల్‌దత్, డిఎస్‌పిలు భద్రయ్య, నల్ల మల్లారెడ్డిలు అక్కడికి చేరుకుని గంగపుత్ర సంఘం నాయకులతో మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ముదిరాజ్ మహాసభలో చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లకే హక్కు కల్పిస్తూ జిఒ జారీ చేస్తామని మాట్లాడి తమ మనోభావాలను మంత్రి రాజేందర్ దెబ్బతీసినందు వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని గంగపుత్ర సంఘం నాయకులు పోలీసులతో పేర్కొన్నారు. మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. చివరకు కొంత మంది సంఘ పెద్దలను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని ఎంపి కవిత కార్యాలయంలో ఉన్న మంత్రి రాజేందర్, ఎంపి కవితల వద్దకు తీసుకెళ్లారు. గంగపుత్రులకు అన్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి గానీ, తనకు గానీ లేదని, చెరువులు, కుంటలపై గంగపుత్రులకు సైతం హక్కు ఉంటుందని మంత్రి రాజేందర్ పేర్కొనడంతో గంగపుత్రులు ఆందోళన విరమింపజేశారు.