Home జిల్లాలు మంత్రి రాజీనామా ఆమోదంపై పట్టువీడని ప్రతిపక్షాలు

మంత్రి రాజీనామా ఆమోదంపై పట్టువీడని ప్రతిపక్షాలు

స్పీకర్‌ను కలిసిన మర్రి శశిధర్‌రెడ్డి 

ప్రతి వేదికలో డిమాండ్ చేస్తోన్న టీడీపీ
వీటితో గొంతుకలిపిన బీజేపీ
సనత్‌నగర్ ఉపఎన్నికపై ఆశలు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యం
talasaniసిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలన్నీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన రాజీనామాను ఆమోదించాలని, మంత్రి పదవిలో కొన సాగరాదంటూ డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారిని కలిసి తలసాని శ్రీనివాస్ రాజీనా మాను ఆమోదించాలని కోరారు. దీంతో తలసాని పేరు మరోమారు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మా రింది. అధికార పార్టీ మినహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలన్నీ శ్రీనివాస్‌యాదవ్‌పై విరుచుకు పడు తున్నాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యం ఓవైపు… సనత్‌నగర్‌కు ఉపఎన్నిక జరగాలనేది మరోవైపు ఆయన రాజీనామా డిమాండ్‌కు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలకు ముందే మంత్రిని తొలగేలా చేస్తే ఆ ప్రభావం నగరవ్యాప్తంగా పడుతుందని, స్థానిక ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే ఆయన వ్యూహాలకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చని ఈ పార్టీలు భావిస్తున్నట్టు గ్రేటర్‌లో చర్చ జరుగుతోంది. మరో కోణంలో సనత్‌నగర్‌కు ఉపఎన్నిక జరిగితే తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకోవచ్చని తెలుగుదేశం, కాంగ్రెస్‌లు బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీలు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు సంధిస్తున్నాయి. ఈ రెండు పార్టీల గొంతుతో భారతీయ జనతాపార్టీ కూడా స్వరం కలిపింది. రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని, ఆయన మంత్రివర్గంలో కొనసాగరాదని డిమాండ్ చేస్తోంది.

గత డిసెంబర్ 16న మంత్రి తలసాని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు నుండి తెలుగు దేశం పార్టీ లెజిస్లేచర్ నాయకులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌ను పలుమార్లు కలుస్తూ ఆయన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా సమాచార హక్కు విధానంలో దరఖాస్తు చేసుకుని మంత్రి రాజీనామా లేఖ విషయాన్ని సేకరించి ఆయనపై తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం లేపారు. మంత్రి రాజీనామా చేసిన లేఖపై, పదవిలో కొనసాగడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలాఉండగా మంత్రి రాజీనామా ఆమోదించాలని డిమాండ్‌ను వినిపిస్తోన్న బీజేపీ కూడా సనత్‌నగర్ సీటును ఆశిస్తోంది.

ఉపఎన్నిక జరిగితే పోటీచేసేందుకు తమ అభ్యర్థికి అవకాశం కల్పించా లని తెలుగుదేశం పార్టీని కోరుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీతో ఉన్న అవగాహనను కొనసాగి స్తూ సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే పోటీ చేసేందు కు కమలనాథులు పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగు తుంది. మరోవైపు గత గురువారం దానం నాగేందర్‌ను తలసాని కలవడంతో కాంగ్రెస్ మరింత దూకుడుకు దిగినట్టు తెలుస్తోంది. అయితే, గ్రేటర్ ఎన్నికల నాటికి మంత్రి రాజీనామాను ఆమోదింపజేస్తే టీఆర్‌ఎస్ పార్టీపై నగరంలో విమర్శలు సంధించేందుకు ఇది బలమైన ఆయుధంగా ఉపకరిస్తుందని ఈ పార్టీల యోచనగా ఉందని సీనియర్ రాజకీయనాయకులు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఒంటరైన తలసాని..
రాజీనామా ఆమోదం విషయంపై ఇతర పార్టీలు విమర్శలు, ఆరోపణలు సంధిస్తుంటే ఆయనకు బలం గా మద్దతునిచ్చేవారు టీఆర్‌ఎస్‌లో అంతగా ఉండటం లేదని చర్చ జరుగుతోంది. టీడీపీ, కాంగ్రెస్‌లపై ఆయన మాత్రమే తన వాగ్భాణాలతో తిప్పికొడు తున్నారే కానీ, నగర, రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రికి అనుకూలంగా ప్రత్యారోపణలు చేసే వారు కరువయ్యారని గ్రేటర్ నాయకుల్లో వినిపిస్తోంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి వెళ్ళిన వారు కూడా ఈ దుమారంపై స్పందించేందుకు ఆసక్తి చూపకపోవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.