Home ఎడిటోరియల్ మరో ‘క్వాడ్’లో మనం

మరో ‘క్వాడ్’లో మనం

India, Israel agree to conclude free trade pact by june 2022భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఎదురులేని మెజారిటీతో అధికారం చేపట్టిన తర్వాత దేశ విధానపరమైన గమనంలో పూర్తి మార్పు వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ మొదటి విడత పాలనలో అమెరికాతో శాంతియుత అణు సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ దానితో గాఢంగా పెనవేసుకునే విషయంలో ఇండియా జాగ్రత్తగా అడుగు వేసేది. ప్రధాని మోడీ నాయకత్వంలో బిజెపి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాతో అటువంటి ఆచితూచి వ్యవహరణ అటకెక్కింది. అమెరికా తన వైపు మూడడుగులు వేయమంటే మనం ఆరడుగులు వేసే పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మన ప్రధాని ఆయనతో ఎంత సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారో తెలిసిందే. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమెరికాతో అదే మైత్రిని మనం కొనసాగిస్తున్నాము. ట్రంప్ హయాంలో అమెరికా మన వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను తీసుకున్నది. వాణిజ్య ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. దాని ప్రభావం వల్ల మన ఎగుమతులపై అమెరికా సుంకాలు బిగించింది.

మన ఉక్కు ఎగుమతులపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాన్ని విధించింది. అయినప్పటికీ మనం దానితోనే చెట్టపట్టాలేసుకొని నడిచాము. ఇండో పసిఫిక్ జలాల్లో చైనా ప్రాబల్య కాంక్షను ప్రతిఘటించే లక్షంతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి చతుర్భుజ (క్వాడ్) ఒప్పందంలో భారత్ గత మార్చిలోనే చేరింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్, యుఎఇలతో కలిసి మరో నాలుగు దేశాల ఒప్పందంలో ఇండియా చేరడం విశేషం. అరబ్ దేశాల పక్షాన నిలిచి ముఖ్యంగా పాలస్తీనాకు మద్దతుగా ఉంటూ ఇజ్రాయెల్‌ను దూరంగా ఉంచిన గత విధానానికి విరుద్ధంగా దానితో మైత్రిని నెలకొల్పుకొని సంయుక్త వైమానిక దళ విన్యాసాల్లో కూడా పాల్గొన్నాము. ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే వైపు ఇప్పుడు అడుగులు వేస్తున్నాము. 2022 జూన్ నాటికి దీనిపై సంతకాలు చేయాలని నిర్ణయించుకొన్నాము. ఈ విధంగా విదేశాంగ విధానంలో మనం పూర్తిగా అమెరికా వైపు మళ్లిపోయాము. ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను పెంచుకోడం ద్వారా మన భద్రతను మెరుగుపరుచుకొనే విజ్ఞతాయుత వైఖరికి స్వస్తి చెప్పాం.

పాకిస్తాన్, చైనాలతో గల వైరాన్ని ఆసరా చేసుకొని దేశంలో జనాభిప్రాయాన్ని తనకు మరింత అనుకూలంగా మలచుకోడం ద్వారా ఎన్నికల విజయాలకు ఢోకా లేని పరిస్థితిని సృష్టించుకోడమే లక్షంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విదేశీ విధానం రూపుదిద్దుకుంటున్నదనే అభిప్రాయానికి అవకాశం కలుగుతున్నది. చిరకాల శత్రువులైన ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య అబ్రహాం ఒప్పందం కుదర్చడానికి డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న చొరవ తెలిసిందే. దాని కారణంగా యుఎఇ, బహ్రెయిన్ లతో ఇజ్రాయెల్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని వల్ల ఆ రెండు శిబిరాల మధ్య వాణిజ్య సంబంధాలు పెనవేసుకొని పూర్వమున్న ఉద్రిక్త వాతావరణం చల్లారుతుందని ఆశిస్తున్నారు. అబ్రహాం మూల పురుషుడుగా ఉన్న ఇస్లాం, యూదు మతస్థుల మధ్య ఒప్పందం అబ్రహాం ఒప్పందంగా ప్రసిద్ధికెక్కింది. ఇజ్రాయెల్, యుఎఇ, అమెరికాలతో కుదిరిన చతుర్భుజ ఒప్పందం వల్ల మధ్య ఆసియాతో మన వాణిజ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆ ప్రాంతంలో ఇరాన్‌కున్న విశేష ప్రాధాన్యాన్ని దానితో మనకు గల గత, ప్రస్తుత సంబంధాలను కూడా ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరించుకున్న తర్వాత అక్కడి తాలిబన్ల నుంచి మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఇరాన్‌తో సత్సంబంధాలు ఎంతో అవసరం. దానికి ఈ ఒప్పందం వల్ల కలిగే విఘాతాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ రెండింటితోనూ ఇరాన్‌కు పచ్చిగడ్డి కూడా భగ్గుమంటుంది. ఇరాన్ వల్ల మనం గతంలో గణనీయంగా ప్రయోజనం పొందాము. ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించక ముందు ఇరాన్ నుంచి మనం ప్రతి నెలా 2.5 బిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకునే వాళ్లము. అది మన మొత్తం చమురు దిగుమతుల్లో 10 శాతంగా ఉండేది. అది కూడా మనకు అనుకూలమైన షరతుల మీద జరిగేది. అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షల మూలంగా దాని నుంచి ఆయిల్ దిగుమతులను మోడీ ప్రభుత్వం తగ్గించుకున్నది. 2012లో అమెరికా ఇదే విధమైన ఆంక్షల ఒత్తిడిని తీసుకొచ్చినప్పుడు మనం దాని మాట వినకుండా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను కొనసాగించాము. అమెరికా, ఇజ్రాయెల్, యుఎఇలతో కుదుర్చుకున్న తాజా ఒప్పందం వల్ల తలెత్తే సున్నితమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంది.

India, Israel agree to conclude free trade pact by june 2022