Home తాజా వార్తలు మల్యాల వాగులో చిన్నారి మృతదేహం వెలికితీత

మల్యాల వాగులో చిన్నారి మృతదేహం వెలికితీత

04WLCTL01P (1)వరంగల్ : తల్లి ప్రియుడే యముడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆమె శవాన్ని వాగులో పూడ్చేసి చేతులు దులుపుకున్నారు. చేసిన పాపం ఊరికే పోతుందా.. నిజం బయటికి రాకుండా ఉంటుందా? పోలీసు మార్క్ విచారణలో చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. నందిని అదృశ్యంపై జులై 31 మన తెలంగాణ టాబ్లాయిడ్‌లో ‘చిన్నారిని చిదిమేశారా’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
వరంగల్ జిల్లా చిట్యాల మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన పైడయ్య, రాధ దంపతులకు ఒకే ఒక్క కుమార్తె నందిని (4). వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. రాధ అదే గ్రామానికి చెందిన జీడి రవితో సన్నిహితంగా ఉండేది. ఈక్రమంలోనే గత నెల రెండో వారంలో కూతురును వెంట తీసుకొని రవితో కలిసి బయటికి వచ్చింది. మొదట కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లిలోని రవి బంధువుల ఇంటికి వచ్చి తలదాచుకున్నారు. వీరి వివాహేతర బంధానికి అడ్డుగా ఉందని చిన్నారిని అంతమొందించాలని పథకం వేశాడు రవి. అనుకున్నట్టుగానే గత నెల 19న నందినిని నీటి పంపుహౌస్‌లో తోసేసి చంపేశాడు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని జమ్మికుంట మండలం మల్యాలకు తీసుకెళ్లి వాగులో పూడ్చేశాడు. రాధతో సహా గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చి కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. అయితే దేశ్‌రాజ్‌పల్లిలో వారి వెంట ఉన్న చిన్నారి మల్యాలలో లేకపోవడంతో ఆమెను చంపేశారనే వదంతులు వ్యాపించాయి. అప్పటికే పైడయ్య తన భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి దేశ్‌రాజ్‌పల్లి, మల్యాలలో విచారించి, పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన సమాచారం ఆధారంగా రవి, రాధలను అదుపులోకి తీసుకొని విచారించగా నందినిని చంపేసిన విషయం ఒప్పుకున్నారు. ఈమేరకు చిట్యాల సిఐ రవీందర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు మంగళవారం జమ్మికుంట తహశీల్దార్ రజిని సమక్షంలో వాగులోంచి మృతదేహాన్ని వెలికి తీయించారు. అక్కడే పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద నందిని బంధువులు రోదించిన తీరు అందరిని కంటతడిపెట్టించింది.