Home ఆఫ్ బీట్ యాత్రల కోన మన తెలంగాణ

యాత్రల కోన మన తెలంగాణ

TS-Tourism-Spots

మానవుడు చలన రహితంగా ఉంటే ఏదీ నేర్చుకోలేడు. బావిలో కప్పలా మారిపోతాడు. ఒకే చోట ఉండిపోతే తెలుసుకోవాలన్న విషయాసక్తి తగ్గిపోతుంది. తెలుసుకోవాలన్న తపనే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటున్న మనిషి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాడు. ఈ జిజ్ఞాసలేని జీవులు జంతువులుగా, పశువులుగా, మృగాలుగా మిగిలిపోయాయి. జ్ఞానహీనులు పశువుతో సమానులు అన్న సూక్తి కూడా ఇందుకే పుట్టింది. మనిషి టైమ్ టు టైమ్ అప్‌డేట్ కావాలంటే ఆర్నెల్లకోసారైనా ఈ విశాల ప్రపంచంలో కనీసం తనకు ఇష్టమైన చోట కాసేపు అలా అలా.. విహరించాలి. అలాచేస్తే  వివిధ ప్రదేశాల్లో నివసించే  ప్రజల ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు, ఆదాయ మార్గాల లాంటివి తెలుస్తాయి. కంపేరిటివ్ స్టడీకి ఇది పునాదిగా మిగులుతుంది. ఎంత పనుల ఒత్తిడి ఉన్నా, ఎంత తీరుబాటులేకున్నా.. ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని ప్రపంచాన్ని ఓ చుట్టు చుట్టిరావాలి… టూరిస్ట్‌లా కేవలం కొన్ని ప్రదేశాలకే పరిమితం కాకుండా ఇష్టమైన వాటిని చుట్టొచ్చే ట్రావెలర్‌లా ప్రయాణించాలి. కమాన్..డ్రీమ్… ఎక్స్‌ప్లోర్… డిస్కవర్.

మన రాష్ట్రంలో టూరిజం
కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో చారిత్రక సంపద పుష్కలంగా ఉంది. శాతవాహన, కాకతీయ, చాళుక్య, మొఘల్, కుతుబ్ షాహీ, అసఫ్‌జాహీ లాంటి గొప్ప వంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. వారి పాలనలో నిర్మితమైన కట్టడాలు అద్భుతశైలితో నేటికీ రాష్ట్రంలో తలమానికంగా వెలుగొందుతున్నాయి. రాజుల, నవాబుల శైలికి ప్రతిరూపాలుగా పర్షియన్, భారత వాస్తులు కలిసిపోయాయి. ఈ కలయిక గుర్తించలేనంతగా ఉండి గంగా జమునా తహజీబ్‌కు సాక్షంగా నిలుస్తున్నాయి . ఇక్కడి చారిత్రక ప్రదేశాలన్నింటికీ వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు గత మూడున్నరేళ్ల కాలంలో పునరుజ్జీవం పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి నేడు. నిర్లక్షపు నీడన నిలిచిన అనేక ప్రదేశాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ పట్టుదలతో పనిచేస్తూ విజయం సాధిస్తున్నది. దీన్లో భాగంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ప్రదేశాలే కాకుండా ప్రకృతి రమణీయ స్థలాలు, పుణ్యతీర్థాలు, దేవాలయాలు, చెరువులు, జలపాతాలు, సాహస కేంద్రాలు, బోటింగ్ కేంద్రాలు, కళ్లు చెదిరే షాపింగ్ , నవాబుల ఆరామ కేంద్రాలను ప్రమోట్ చేస్తూ టూరిజం శాఖ టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. మరి దసరా సెలవుల్లో వీటిని చుట్టిరావడానికి మించిన మజా ఏముంటుంది? దానికి సంబంధించిన వివరాలివిగో…

టెంపుల్ టూరిజం : యాదాద్రి నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి ఐదు అవతారాల్లో వెలిశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ దేవాలయ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేశారు. భద్రాచలం రామాలయం, ఈ దేవాలయాభివృద్ధికి కూడా నిధులు విడుదల చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం, ఈ ఆలయాభివృద్ధికి 350 కోట్లు ప్రకటించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, గద్వాలలో శక్తిపీఠం జోగులాంబ దేవాలయం, కాళేశ్వర దేవస్థానం, వరంగల్ జిల్లాలో భద్రకాళి, రామప్ప, వేయిస్థంభాల గుడులు ఉన్నాయి, మెదక్ జిల్లాలో వర్గల్ సరస్వతి దేవాలయం, అనంతసాగర్ సరస్వతి దేవాలయం, ఏడుపాయల కనకదుర్గ అమ్మవారు… ఇంకా ఎన్నో దేవాలయాల రూపు రేఖలు మార్చి టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తున్నారు.

అడ్వెంచర్ టూరిజం: హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలో ఏకశిలపైభాగంలో కోట నిర్మాణం ఉంది. పెద్ద శిలానిర్మాణంతో ఏర్పడిన గుట్ట దాదాపు 700 ఫీట్ల ఎత్తుతో 40 ఎకరాల స్థలంలో విస్తరించింది. తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్ శిక్షణనిస్తోంది. దీంతో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా రాక్ క్లైంబింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయిక్కడ.

పూర్ణ మాలావత్ విజయానికి మూలమిదే : అడ్వెంచర్ టూరిజంలో భాగంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పౌరుడు శేఖర్ బాబు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. మాలావత్ పూర్ణ ఇక్కడే శిక్షణ తీసుకుంది. వయసును బట్టి వివిధ రకాల ఆడ్వెంచర్ కోర్సులను అందిస్తున్నారు… 12-15 సంవత్సరాల వయసు పిల్లలకు నాలుగు రోజుల కోర్సు, ఐదు రోజుల బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్సు, బేసిక్‌గా శిక్షణ తీసుకున్న వారికి మాత్రమే అందించే నాలుగు రోజుల అడ్వాన్స్ రాక్ క్లైంబింగ్ కోర్సు, టూరిస్టుల కోసం రెండు రోజుల వీకెండ్ అడ్వెంచర్ కోర్సు, వారాంతపు సెలవులో మజా పొందాలనుకునేవారికోసం అడ్వెంచర్ డే అవుటింగ్ పేర ఒక్కరోజు శిక్షణ ఇక్కడ అందిస్తున్నారు.
– భోజన, వసతి, అత్యవసర వైద్య సదుపాయాలున్నాయిక్కడ.

వికారాబాద్ అడ్వెంచర్: హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఉన్న ఈ ట్రెక్కింగ్ ప్లేస్ అడ్వెంచర్ చేయాలనుకునేవారికి థ్రిల్ ఇస్తుంది. ఎర్రమట్టి, కొండలతో ఉన్న ఈ ప్రదేశంలో రిపెల్లింగ్(తాడు సాయంతో నడిచే సాహసం), ట్రెక్కింగ్ ను యువత ఇష్టపడతారు. దగ్గరలోని వికారాబాద్ ఫారెస్ట్‌లో వైల్డ్ లైఫ్, వాటర్‌ఫాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఫోటోగ్రఫీ చేసేవారికి అనుకూలమైన ప్రదేశం.

వైల్డ్ లైఫ్ టూరిజం: దక్కను పీఠభూమిలో గుండెకాయ స్థానం తెలంగాణ రాష్ట్రానిది. ప్రత్యేకమైన వాతావరణంతో అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం అలరారుతోంది. అభయారణ్యాలు కూడా పేరొందినవే ఉన్నాయిక్కడ. వాటిలో కవ్వాల్ లేదా జన్నారం అభయారణ్యం చెప్పుకోదగ్గది, ఇది దట్టమైన అటవీ ప్రాంతం. అంతరించిపోతున్న పులులకు నెలవు ఈ ప్రదేశం. ఇదే కాకుండా మృగవని నేషనల్ పార్క్, కెబిఆర్ పార్క్, ప్రాణహిత, శివ్వారం, కిన్నెరసాని, మంజీరా అభయారణ్యాలు, నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్, షామీర్‌పేట డీర్ పార్కు, నెహ్రూ జూలాజికల్ పార్కులు ఈ పచ్చటి ప్రదేశంలో నెలవై ఉన్నాయి. జీవి వైవిధ్యానికి అవకాశమున్న ప్రాంతమిది. వీటిని చూడాలనుకునే పర్యాటకులకు సకల సదుపాయాలు కల్పిస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ.

నేచర్ డిస్కవరి( ఎకో టూరిజం): అందమైన జలపాతాలు, డ్యాములు, చెరువులు, అడవులు, టైగర్ ఫారెస్టులను కలిగి ఉన్న సుందరమైన ప్రదేశం ఇది. వాటిల్లో లక్నవరంలో నీటిపై తేలియాడే బ్రిడ్జ్ నిర్మాణం అత్యద్భుతం. . గాయత్రి, కుంటాల, పొచ్చెర, కనకై, మల్లెల తీర్థం, నయగారాను పోలిన బొగతా జలపాతాలు. నిజాంసాగర్, లోయర్ మానేర్, జూరాల, కోయిల్‌సాగర్, కడెం, పోచంపల్లి, సింగూరు, నాగార్జునసాగర్‌డ్యాములు. ఉస్మాన్‌సాగర్, పాలేరు, పాఖాల, హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువులు. పోచారం, అలీసాగర్, సింగూరు డ్యాం రిజర్వాయర్లు. ప్రపంచప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటి, అనంతగిరి అందాలతో ఈ ప్రాంతం పచ్చగా కళకళలాడుతోంది.

హెరిటేజ్ టూరిజం: వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రదేశంలో చారిత్రాత్మక కట్టడాలకు కొదవే లేదు. రాజుల నుంచి నవాబుల వరకు వారి పరిపాలనా ఆనవాళ్లను వదిలి చరిత్రలో నిలిచారు. వీటిల్లో చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ సమాధులు, పైగా సమాధులు, మక్కా మజీద్, గోల్కొండ కోట, ఫలక్‌నుమా, చౌమొహల్లా ప్యాలెస్‌లు హైదరాబాద్ సిగలో మణులుగా ఉన్నాయి. రామప్ప దేవాలయం, ఆలంపూర్ టెంపుల్, ఎలగందుల, జగిత్యాల, నగునూరు, ఖమ్మం, మెదక్, దేవరకొండ, రాచకొండ, నందికొండ, దోమకొండ, నిజామబాద్, వరంగల్ కోటలు. నేలకొండపల్లి ఆరామాలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పర్ణశాల, పిల్లలమర్రి, కొలనుపాక జైన మందిరాలు, రామగిరి ఖిల్లా, వేయి స్థంభాల గుడి లాంటి ఎన్నో ప్రదేశాలు ఇక్కడి చరిత్రను తెలియజేస్తున్నాయి.

కల్చరల్ టూరిజం: ప్రపంచంలో ఉన్న అన్ని కులాలు, మతాల వారు హైదరాబాద్ కేంద్రంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు, దీన్ని గంగా జమునా తహజీబ్‌గా చెప్పొచ్చు. ఇక్కడ కులమతాలకతీతంగా బతుకమ్మ, బోనాలు, వినాయక చవితి పండుగల్ని జరుపుకుంటారు. దివాళీ, క్రిస్మస్ సందర్భంగా సిటీ మొత్తం విద్యుద్దీపకాంతులతో మెరిసిపోతుంది. ఉర్దూ కలగలిసిన తెలుగులో ఇక్కడి ప్రజలు మాట్లాడటం గమనించవచ్చు. గతేడాది టూరిజం, కల్చరల్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా బతుకమ్మ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. విదేశీ సందర్శకులను ఆకర్షించేలా ఈ ఏటి మహా బతుకమ్మ కార్యక్రమాలు చేపడుతున్నారు.

మెడికల్ టూరిజం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో వైద్య చికిత్స చవకగా లభిస్తుంది. అందుకే చాలామంది విదేశీయులు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తూంటారు. వారిని హైదరాబాద్ వచ్చేలా చేసి మెడికల్ టూరిజం పెంచేందుకు రాష్ట్ర టూరిజం శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ సంఖ్య పెరగడానికి ఎంతో కాలం కూడా పట్టకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రపంచ ప్రమాణాలకు సరిపడ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.

బౌద్ధ, జైన అరామాలు: బుద్ధిజం విషయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానంలో తెలంగాణ నిలుస్తుంది. కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో జైన, బౌద్ధ మతానికి సంబంధించిన అనేక ఆనవాళ్లున్నాయి నేటికీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బౌద్ధ స్థూపాలను రక్షించుకునేందుకు బుద్ధవనం ప్రాజెక్టును నెలకొల్పారు. అంతర్జాతీయ సమ్మేళనం కూడా నిర్వహించారు. దీనికి వివిధ దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

TS-Tourismఈ సంవత్సరం థీమ్: సస్టేనబుల్ టూరిజం – ఎ టూల్ ఫర్ డెవలప్‌మెంట్ ను ఈ ఏటి వరల్డ్ టూరిజం డే థీమ్‌గా తీసుకున్నారు. ప్రస్తుత, రానున్న రోజుల్లో ఆర్థిక, సామాజిక అంశాలను పూర్తిగా వినియోగించుకొని, పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటకుల అవసరాలను తీర్చి, పర్యాటక, ఆతిథ్య రంగాన్ని సుస్థిరం చేయాలన్నది ఈ ఏటి లక్షం. దీర్ఘకాలిక ఆర్థిక లక్షాలను ఏర్పర్చుకుని భాగస్వామ్యులందరికీ దాన్ని పంచాలని లక్షంగా చేసుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని రూపుమాపేందుకు పర్యాటకరంగాభివృద్ధి సహకరిస్తుంది. అయితే సరైన డిజైనింగ్‌తో సక్రమంగా నిర్వహిస్తేనే ఆర్థిక, సామాజిక, పర్యావరణహితంగా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. దీంతో ఉద్యోగావకాశాలు, వాణిజ్యావకాశాలు పెరుగుతాయి.

ఇలా మొదలైంది: పూర్వ కాలంలో కేవలం ధనికులు మాత్రమే ఇతర ప్రాంతాల్లో ప్రయాణించేవారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి అక్కడి కళలు, కట్టడాల శైలిని పరిశీలించేవారు. ఇతర ప్రాంతాల్లోని వంటలను రుచి చూసేందుకు, కొత్త భాషలు నేర్చుకునేందుకు విదేశీ ప్రయాణాలు చేసేవారు. మధ్యయుగంలో వివిధ మతాలకు చెందిన వారు తీర్థయాత్రలు చేసేవారు. ఇదే సమయంలో ఆరోగ్యం, ఆథ్యాత్మిక చింతన పెరగడం కోసం పేదవారు కూడా ఈ రకమైన యాత్రలు చేసేవారు. మన దేశంలో కూడా ఈ పద్ధతిని అనుసరించారు. తరువాతి కాలంలో యూరప్ దేశాల్లో యూరప్, జర్మనీ ట్రిప్‌ను సంప్రదాయంగా పాటించారు, దీన్ని గ్రాండ్ టూర్‌గా పిలుస్తారు. పోలండ్ రాకుమారుడు యూరప్ మొత్తం తిరిగిరావడాన్ని విఙ్ఞాన యాత్రగా అభివర్ణించారు యూరోపియన్లు. దాంతో 1660 సంవత్సరం నుంచి 1840 వరకు ఇది ఆచారంగా మారి,పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ గ్రాండ్ టూర్ ఆచారం 18 వ శతాబ్దంలో వివిధ దేశాలకు చెందిన ధనిక విద్యార్థులకు చేరింది. దాంతో మధ్య తరగతి విద్యార్థులు కూడా స్టీమ్‌షిప్ ద్వారా యూరోప్ పర్యటించే స్థితికి వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ అయిన థామస్ కుక్ అందిపుచ్చుకుని కుక్స్ టూర్ పేర ప్రయాణాన్ని సులభతరం చేసింది. చివరగా 18, 19 శతాబ్దాలలో ఈ ఎడ్యుకేషనల్ గ్రాండ్ టూర్ అనేది సంపన్నవర్గానికి చెందిన విద్యార్థుల స్టేటస్ సింబల్‌గా మారింది. పారిశ్రామిక విప్లవం తర్వాత లీజర్ ట్రావెల్ పెరిగింది. విశ్రాంతిగా గడపాలనుకునే పర్యాటకులు సముద్రపు ఒడ్డున ఉండే రిసార్ట్‌లకు వెళ్లి సేదతీరడం మోడ్రన్ డే టూరిజంగా చెప్పవచ్చు. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలకు ఓ పేరు పెట్టి వాటిని కూడా టూరిజం కిందకు తీసుకువచ్చారు. విభిన్నతకు, టూరిస్ట్ రిస్ట్ ప్రాధాన్యతనిస్తూ నేటి టూరిజం అనేక మార్పులకు లోనైంది. దీనికి టెక్నాలజీ తోడవడంతో ట్రావెల్ కంపెనీలు సరికొత్త ప్యాకేజీలతో టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఎకో టూరిజం, వాలంటీర్ టూరిజం, ప్రొ పూర్ టూరిజం, మెడికల్ టూరిజం(మన దేశానికి ఈ రకంగా వచ్చే టూరిస్టులు ఎక్కువ), ఎడ్యుకేషనల్, క్రియేటివ్ (గ్రాండ్ టూర్), ఎక్సపీరియన్షియల్, డార్క్, సోషల్, డూమ్ లేదా లాస్ట్ చాన్స్ టూరిజం, స్పోర్ట్, స్పేస్, రిలీజియస్ టూరిజం లాంటివి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్. ఈ ప్యాకేజీల్లో యూత్ హాస్టల్స్ లాంటివి చేరడంతో విద్యార్థులకు తక్కువ ధరకే సదుపాయాలు లభిస్తున్నాయి.

లాభపడిన రంగాలు: ఆర్థికమాంద్యం ప్రభావం 2000 సంవత్సరంలో టూరిజం రంగంపై విపరీతంగా పడింది. అమెరికాలో జరిగిన 9/11 దాడులు పర్యాటకులను అభద్రతకు లోను చేశాయి. దాంతో టూరిజం రంగం నెమ్మదించింది. ఇది పరోక్షంగా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, హోటల్ ఇండస్ట్రీలపై పడింది. నెమ్మదిగా కోలుకుంటూ 2009లో 8% వృద్ధితో ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలకమయింది. ఆ తరువాత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటర్‌నేషనల్ టూరిజం ఈ కామర్స్ సహకారంతో ఏటికేడు 4% వృద్ధితో కొనసాగుతుందని వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చెబుతోంది. స్థానికంగా కుటీర పరిశ్రమలలో తయారుచేసే వస్తువులను హోటల్ యాజమాన్యాలు, ఎయిర్‌లైన్స్ వారు ఇ కామర్స్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. దాంతో టూరిజంకు సంబంధించిన ఉత్పత్తులు ఇంటర్‌నెట్ బేస్‌గానే అమ్మకాలను పెంచింది. స్థానికుల సేవలను వాడుకుంటూ వారి ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత విస్తరిస్తుందని వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ తెలియజేస్తోంది. 

ఆర్థికాభివృద్ధికి చేయూత… పర్యాటక రంగం గత ఆరు దశాబ్దాలుగా ఎదుగుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను టూరిజం రంగం అత్యధికంగా ప్రభావితం చేస్తున్నది. గడిచిన 60 సంవత్సరాల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. 1950లో 25 మిలియన్ల మంది పర్యాటకులు వివిధ ప్రదేశాలను పర్యటించగా, ఈ సంఖ్య 2015 కల్లా 1.2 బిలియన్లకు చేరుకుంది. దీంతో 1950ల్లో రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ పర్యాటక రంగ ఆదాయం 2015 కల్లా 1260 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. పర్యాటక రంగం వల్ల ప్రపంచ స్థూలజాతీయోత్పత్తి 10% పెరగగా, పదిమందిలో ఒకరికి ఉద్యోగావకాశం లభించింది. ఏటా 3.3% వృద్ధి 2030 వరకు కొనసాగుతుందని నిపుణుల అంచనా. టూరిజం రంగ అభివృద్ధిలో ‘యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ప్రకటించిన రైట్ టు హాలిడేస్’ కీలక పాత్ర పోషించింది. ఇదే కాకుండా పలు దేశాల్లో కార్మిక హక్కులపై అవగాహన పెరగడం, మధ్యతరగతి జనాభా పెరుగుదల వంటివి ముఖ్య పాత్ర పోషించాయి. పెరిగిన టెక్నాలజీ వల్ల దూరప్రయాణాల వ్యయం తగ్గింది, ముఖ్యంగా ఎయిర్ ఫేర్స్ తగ్గడంతో విదేశీ పర్యాటకం పెరిగింది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మాంద్యం, ప్రకృతి బీభత్సాల ప్రభావం ఈ రంగంపై పడినా, నెమ్మదిగా కోలుకుంది.