Home జాతీయ వార్తలు హస్తంలో ఢిల్లీ మంటలు

హస్తంలో ఢిల్లీ మంటలు

Congress

 

మావాళ్లు కొందరు ఇంకా మంత్రులమనుకుంటున్నారు..
కాంగ్రెస్ నేతలకు జైరాం రమేశ్ చురకలు
పార్టీ తీరు మారాలి: సింధియా
కాంగ్రెస్‌లో రోజురోజుకు పెరుగుతున్ననిరసన స్వరాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం పార్టీ అధినాయకత్వం తీరు మారాలంటూ బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేసే పార్టీ నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌లు ఆ జాబితాలో చేరారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని సింధియా అంటూ, పార్టీలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మరో నేత జై రాం రమేశ్ అయితే మరో అడుగు ముందుకు వేసి పార్టీ అధికారం కోల్పోయి ఆరేళ్లయినా తమలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారంటూ పార్టీ నేతలకు చురకలు వేశారు. ‘కాంగ్రెస్ నేతలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఉనికిని కోల్పోతాం.

మన తలబిరుసుతనం పోవాలి. అధికారానికి దూరమై ఆరేళ్లయినా మనలో కొంతమంది తాము ఇంకా మంత్రులమేనన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు’ అని రమేశ్ అన్నారు. పార్టీ నాయకత్వం, పని తీరు మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే జ్యోతిరాదిత్య సింధియా 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీనిఅభినందిస్తూ, ఢిల్లీ ప్రజలు మరో సారి మీబృందంపై విశ్వాసముంచారన్నారు. కాగా, ఫలితాలు తనకు తీవ్ర నిరాశ కలిగించాయని అంటూ కాంగ్రెస్‌కు కొత్త తీరు అవసరముంది. కాలం మారింది.. దేశం కూడా మారింది. మనం ప్రజలకు చేరువ కావాలి.

లోక్‌సభ ఎన్నికల తర్వాత మనం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం’ అని గాంధీ కుటుంబానికి అతన్డౌన సింధియా అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పతనం దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హయాంలోనే మొదలైందంటూ పార్టీ ఢిల్లీ ఇన్‌చార్జి పిసి చాకో చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవర తప్పు బట్టారు. షీలా దీక్షిత్ గొప్ప నాయకురాలు, సమర్థవంతమైన పరిపాలకురాలని, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను నిందించడం దురదృష్టకరమని దేవర అన్నారు. ఢిల్లీలో పార్టీ పరాజయానికి అత్మ పరిశీలనకన్నా కూడా కార్యాచరణ ముఖ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Congress loses on 63 seats in Delhi assembly election