Home తాజా వార్తలు హైకోర్టు విభజనను అడ్డుకున్నది చంద్రబాబే

హైకోర్టు విభజనను అడ్డుకున్నది చంద్రబాబే

KTR speech

ఉమ్మడి రాష్ట్రంలో మన న్యాయవాదులకు అన్యాయం జరిగింది
ఉద్యమంలో అడ్వకేట్ల పోరాట పటిమ మరువలేనిది

మనతెలంగాణ/హైదరాబాద్: హైకోర్టు విభజన జరగకపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని టిఆర్‌ఎస్ నేత, అపద్దర్మ మంత్రి కె.టి.రామారావు విమర్శించారు. గతంలో ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా హైకోర్టు విభజన జరుగకుండా అడుగడుగునా ఆయన అడ్డుపడ్డారని ఆరోపించారు. బుధవారం అంబర్‌పేటలో ‘అడ్వకేట్స్ ఫర్ టిఆర్‌ఎస్’ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. హైకోర్టు విభజన కోసం టిఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో మౌన దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా, కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సైందవుడిలా అడ్డుపడింది మాత్రం ముమ్మాటికీ చంద్రబాబేనని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో చంద్రబాబుకు ఉన్న అన్ని సంబంధాలను వినియోగించుకొని స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.

హైకోర్టు విడిపోతే ఎక్కడ తన అక్రమాలు బయటకు వస్తాయన్న భయంతోనే ఆయన హైకోర్టు విభజన అడ్డుకున్నారన్నారని పేర్కొన్నారు. ఎన్‌డిఎ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లాక మళ్లీ హైకోర్టు విభజన అంశంలో కదలిక వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జనవరిలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థలో తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి 2014 వరకు ఒక్క రంగారెడ్డి జిల్లా మినహా కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదని తెలిపారు. పాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు కోర్టులు ఏర్పాటు చేస్తామని,వాటి ద్వారా మరికొంత మంది న్యాయవాదులకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

సత్వర న్యాయం కోసం న్యాయవ్యవస్థలోనూ కొన్ని మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పేదలకు సత్వర న్యాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయవ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వివరించారు. తెలంగాణ న్యాయవాదులతో తమకు ఉద్వేగపూరితమైన సంబంధం పెనవేసుకుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల తర్వాత అంతటి పోరాట పటిమను చూపించింది న్యాయవాదులే అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయవాదుల సంక్షేమం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి రూ.100 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఆ ట్రస్టును మరింత విస్తరిస్తామని తెలిపారు. అలాగే బలహీనవర్గాలకు చెందిన వారిని అడ్వకేట్ జనరల్‌గా చేసుకున్నామని అన్నారు.

టిఆర్‌ఎస్ అందరి పార్టీ
టిఆర్‌ఎస్ అందరి పార్టీ అని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి పైకి కనబడే ఒక మకుటం టిఆర్‌ఎస్ అని, దాని వెనుక తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా అందరం ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్నిసాధించుకున్నామని అన్నారు. అందరి ఆశీర్వాదం లేకపోతే తెలంగాణ సాకారమయ్యేది కాదని చెప్పారు. కెసిఆర్ గొప్ప కార్యదక్షుడు, పట్టుదల కలిగిన నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేశంలో ఎన్నో ఉద్యమాలను అణచివేశామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారని, అందుకు కెసిఆర్ స్పందిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని మోcwనైనా, రాహుల్ గాంధీనైనా ఎదుర్కొనేందుకు రాజీలేని పోరాటం చేస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతలు,ఉద్యోగ సంఘాల నేతలు, న్యాయవాదులు, కళాకారులు, జర్నలిస్టులు టిఆర్‌ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని చెప్పారు.

కానీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నేతలను వాడుకుని వదిలేసిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి కెసిఆర్ మళ్లీ సిఎం అవుతారని, కానీ కాంగ్రెస్‌లో మాత్రం 40 మంది సిఎం అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి నెలన్నరకు ఒక సిఎం మారతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో సిఎం అభ్యర్థి ఢిల్లీలోకి నిర్ణయమై లిఫాఫాలో గాంధీభవన్‌కు వస్తుందని ఎద్దేవా చేశారు. సింహం లాంటి సిఎం కావాలా..? సీల్డ్ కవర్ సిఎం కావాలా..? అంటూ ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర నేతలైన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు వారి నియోజకవర్గాలలో ఒక్క కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని పేర్కొన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న న్యాయవాది కాలేరు వెంకటేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులూ కృషి చేయాలని కోరారు.

KTR fire on Chandrababu about division of High Court

Telangana Latest News