Thursday, April 25, 2024

గొంతు నులిమి ఘోరం

- Advertisement -
- Advertisement -

కిడ్నాప్ చేసిన గంటన్నరలోపే గొంతు నులిమి ఘోరం 

మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదాంతం

ఆపహరించింది తెలిసిన వ్యక్తే
దీక్షిత్ గ్రామానికి చెందిన శనిగపురం వాసి పనే
నాలుగురోజులుగా బాలుడి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన ఘటన

Central Team to visit Hyderabad Flood Affected Areas

మన తెలంగాణ/మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఈ నెల 18 కిడ్నాప్‌కు గురైన పాత్రికేయుడు రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్‌రెడ్డిని మందసాగర్ అనే యువకుడు దారుణంగా హత్యచేసినట్లు ఎస్‌పి నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఈక్రమంలో చిన్నారి దీక్షిత్ రెడ్డి హత్య వివరాలను గురువారం జిల్లా ఎస్పి నంద్యాల కోటి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న రంజిత్ రెడ్డి, వసంత దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డి(9) ఈ నెల 18న ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో మంద సాగర్ అనే యువకుడు అపహరించాడు. ఈక్రమంలో దీక్షిత్ రాత్రి 7 గంటలు దాటినప్పటికీ ఇంట్లోకి తిరిగి రాకపోవడంతో తల్లి వసంత కంగారుపడి తన భర్త రంజిత్ రెడ్డికి తెలియజేసింది. కాగా రాత్రి 9 గంటల వరకు దీక్షిత్ తల్లిదండ్రులు పట్టణ వీధుల్లో గాలించారు. ఈ నేపథ్యంలో రాత్రి 9.15 గంటలకు కిడ్నాపర్ ఇంటర్‌నెట్ కాల్ చేసి తాను బాలుడిని కిడ్నాప్ చేసానని, తనకు 45 లక్షల డబ్బు కావాలని, డబ్బు సిద్ధం చేసుకోమని, తాను మళ్ళీ రేపు (సోమవారం రోజు) డబ్బు ఎక్కడ, ఎప్పుడు ఇవ్వాలో తెలియజేస్తానని చెప్పాడు. కిడ్నాపర్ డిమాండ్‌లను విన్న తల్లి వసంత, తండ్రి రంజిత్ రెడ్డిలు కోరినంత డబ్బు అందిస్తామని, తమ బాబును ఏమీ చేయవద్దని వేడుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో జిల్లా ఎస్పి నంద్యాల కోటి రెడ్డి జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన బలగాలను రంగంలోకి దింపారు. అయితే సోమవారం నుండి కిడ్నాపర్ కాల్స్‌ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కిడ్నాపర్ ఇంటర్‌నెట్ కాల్ చేస్తుండడంతో అతడిని ట్రాక్ చేయడంలో జాప్యం జరిగి తీరా గురువారం ఉదయం నాటికి నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అప్పటికే బాలుడిని చంపేసి మృతదేహాన్ని దహనం చేసినట్టు కిడ్నాపర్ మంద సాగర్ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నట్టు జిల్లా ఎస్పి నంద్యాల కోటి రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు.
నిందితుడు ఒక్కడే..!
ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ మిస్టరీకి అయిదు రోజుల ఉత్కంఠకు తెరదించి జిల్లా ఎస్పి నంద్యాల కోటి రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో బాలుడు కిడ్నాపర్ మంద సాగర్ చేతిలో హత్యకు గురయ్యాడని వెల్లడించడం సంచలనం రేపింది. విలేకరుల సమావేశంలో ఎస్పి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి సొంత గ్రామంలో అతని ఇంటి వీధిలోనే ఉండే శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ (23), తండ్రి పేరు రామచంద్రుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పి తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన సాగర్, మహబూబాబాద్ శివారు అన్నారం గుట్టపైకి తీసుకెళ్లి అదే రోజు రాత్రి సుమారు 7 గంటలకు బాబును చంపేసి, శనిగపురంలోని తన ఇంటికి వచ్చి రాత్రి అన్నం తినేసి, చంపిన బాలుడి ఆచూకీ దొరకకుండా గుట్టపైనే ఉన్న బాలుడి శవాన్ని పెట్రోల్ పోసి దహనం చేసి రాత్రి 9 గంటల 15 నిమిషాలకు బాలుడి తల్లికి ఫోన్ చేసి 45 లక్షలు డిమాండ్ చేశాడని, మరుసటి రోజు సైతం పిల్లాడితో ఫోన్‌లో మాట్లాడనీయకుండా పిల్లాడు బాగానే ఉన్నాడని తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడని, బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, పోలీసులు తనకోసం గాలిస్తున్నట్టు తెలుసుకుని భయపడిన నిందితుడు బాలుడి శవాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని విచారించగా తాను బాలుడిని చంపేసి దహనం చేసి అన్నారం గుట్టపైనే వదిలేసినట్టు నిందితుడు సాగర్ ఒప్పుకున్నట్టు ఎస్పి తెలియజేశారు. అనుమానితులుగా సాగర్‌తో కలిపి సుమారు 21 మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, మందసాగర్ మాత్రమే కిడ్నాప్‌లో పాత్రదారిగా ఉన్నట్టు గుర్తించామని, కిడ్నాప్, హత్య సాగర్ మాత్రమే చేసినట్టు నిర్దారించుకున్నామని ఎస్పి నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. బాలుడ్ని కిడ్నాప్ చేసి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తుగల నిటారైన గుట్టపైకి ఒక్కడు మాత్రమే తీసుకెళ్లి హత్య చేశాడా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
అపహరించిన గంటన్నలోపే చంపేశాడు:
దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే చంపేశానని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఎస్‌పి కోటిరెడ్డి తెలిపారు. కాగా బాలుడిని కిడ్నాప్ చేసిన అనంతరం పెద్ద ఎత్తున ఏడవడంతో విసుగు చెందిన నిందితుడు మందసాగర్ గొంతు నులుమి చంపినట్లు దర్యాప్తులో తేలింది. అదేవిధంగా బాలుడికి నిద్ర మాత్రలు ఇచ్చిన అనంతరం అచేతనంగా పడివుండటంతో నిందితుడు గొంతు నులుమినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు వివరిస్తున్నారు.
అన్నీ అనుమానలే:
ఆదివారం రోజు కిడ్నాపర్ బాలుడ్ని చంపేశాడని జిల్లా ఎస్పి ప్రకటించారు. అయితే ఆదివారం రాత్రే బాలుడ్ని కిడ్నాపర్ చంపేశాడనుకుంటే, ఐదు రోజుల్లో గుట్టపై అరక్షితంగా పడిఉన్న సగం కాలిన శవాన్ని రాబందులు, నక్కలు, కుక్కలు వదులుతాయా? ఈ ఐదు రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు కుళ్లిపొయిన బాలుడి శవం చిద్రమైపోకుండా గురువారం ఉదయం వరకూ అలాగే లభ్యమవుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో రేకెత్తుతున్నాయి.
సాగర్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టకపోవడానికి కారణాలేంటి?
బాలుడి కిడ్నాప్, మర్డర్ కేసులో మంద సాగర్‌ను నిందితుడిగా ప్రకటించినా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. కాగా, నిందితున్ని ఎన్‌కౌంటర్ చేస్తారనే ఊహాగానాలు సైతం సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అదునాతన టెక్నాలజీతో జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసులే కాక, రాష్ట్ర స్థాయి సాంకేతిక విభాగం నిపుణులు సైతం సకాలంలో ఛేదించలేకపోయిన ఈ కేసులో నిందితుడు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమేనని ప్రకటించడం.. ఆ ఒక్క వ్యక్తి, ఒక సామాన్య మోటార్‌సైకిల్ మెకానిక్ షాప్‌తో జీవనం సాగించే వ్యక్తి కావడం, ఆ వ్యక్తి రాష్ట్ర స్థాయి పోలీసు సిబ్బంది మొత్తం ఐదు రోజులుగా తలమునకలయ్యేలా చేసిన ఇంటర్నెట్ కాల్ వాడకం తెలిసి ఉండడం కొంత నమ్మకశ్యంగా లేనిదే.. అయినప్పటికీ ఆ ఒకేఒక్క కిడ్నాపర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. సాగర్‌తో సహా అతనికి సహకరించినవారిని కనుగొని నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పి ప్రకటించడం గమనార్హం.
ఈజీ మనీ కోసమే దారుణం: 
బాలుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడు మందసాగర్ ఈజీ మనీ కోసమే దారుణానికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా ఈజీమనీ కోసం బాలుడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదనే పలువురు చర్చించుకోవడం కనిపించింది. నిందితుడు మందసాగర్ ఒకే కుమారుడు, అతని ఇళ్లు సైతం సుమారు 200 గజాల పైనే ఉండే చుట్టు ప్రహరీ కలిగిన పక్కా సొంత ఇళ్లు, ఇంకా పెళ్లి సైతం కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్‌లోని శ్రావణి రెస్టారెంట్ ఎదురుగా ఒక మోటార్‌సైకిల్ మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇదివరకు నేర చరిత్ర సైతం లేదని ఇరుగు పొరుగువారు తెలుపుతున్నారు.
నిందితున్ని కఠినంగా శిక్షించాలి… బాలుడి తల్లి వసంత
హత్యకు గురైన బాలుడి తల్లి వసంత సైతం సాగర్ మాత్రమే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండడని, అతనితో పాటు సుమారు నలుగురైదుగుదైనా ఈ ఘాతుకంలో పాత్రదారులు, సూత్రదారులుగా ఉండవచ్చునని, వారందరినీ శిక్షించాలని కోరింది.

Deekshit Reddy died who kidnaped in Mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News