Friday, April 19, 2024

పోషకాల వెల్లుల్లి

- Advertisement -
- Advertisement -

 

ఘాటైన వాసన వెల్లుల్లి సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లీస్తారు. కానీ వెల్లుల్లి లేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే  ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్లి ఉండాల్సిందే. జలుబు చేసినా జ్వరం వచ్చినా వెల్లుల్లి తినాల్సిందే…!

 

ఆధునిక గృహిణికయినా సంప్రదాయ బామ్మకయినా పోపులపెట్టేలో వెల్లుల్లిపాయ లేకపోతే వంట రుచించనట్లే. అంతగా ఆహారంలో భాగంగా మారిన వెల్లుల్లిని కేవలం మన దగ్గర మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగానూ ఇష్టంగా తింటున్నారు. ఐరోపా, అమెరికాల్లో ప్రాచుర్యం పొందిన బేకరీ పదార్థాల్లో గార్లిక్ బ్రెడ్ ఒకటి. అక్కడ వెల్లుల్లిని ఇతర నూనెల్లోనూ కలిపి వాడుతుంటారు. సాస్‌లా చేసుకుని మాంసాహారంతో కలిపి తింటుంటారు. మధ్యతూర్పు దేశాల్లో అయితే వెనిగర్‌లో నిల్వచేసిన వెల్లుల్లి వాడకం ఎక్కువ. దీన్నే గార్లిక్ పికిల్ అంటారు. కొన్ని రోజులకి ఇవి నీలం రంగు లోకి మారతాయే తప్ప పాడవవు. వీటినే బ్లూ గార్లిక్ పేరుతో వంటల్లో వాడతారు. ఇంకా వెల్లుల్లిని చేప, మాంసం… వంటి వాటిని నిల్వచేసేందుకు కూడా ఉపయోగిస్తారు.
వెల్లుల్ల్లిని పండించే దేశాల్లో అగ్రరాజ్యానిదే అగ్రస్థానం. రెండో స్థానం మనదే. ఆగ్నేయాసియా దేశాల్లో ఉల్లికాడల మాదిరిగానే వెల్లుల్లి కాడల్ని వంటకాల్లోనూ సూపుల్లోనూ వాడతారు. వీటినే గ్రీన్ గార్లిక్ అంటారు. సాధారణంగా వెల్లుల్లికోసం పండించేవాళ్లు మొక్కలకు పూత రాకుండా పూలొచ్చే కాడల్ని తుంచేస్తారు. లేదంటే నేలలో పాయ ఊరడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
మనకు తెలిసి వెల్లుల్లి… తెల్లగానే ఉంటుంది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకటో రెండోపాయలు మాత్రం తెలుపూ గులాబీ మిశ్రితమై కనిపిస్తుంటాయి. కానీ దాన్ని పండించే ప్రాంతాన్ని బట్టి వెల్లుల్లిలో ఎరుపూ, గులాబీ, ఊదా, గోధుమ ఇలా ఎన్నో రంగులు ఉంటాయి. మన దగ్గర తెలుపురకం వెల్లుల్లిని ఎక్కువగా పండించినట్లే, సిసిలీలో ఎరుపూ, ఫ్రాన్స్‌లో గులాబీ, ఇటలీలో గోధుమరంగు రకాల్ని ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే పూలకోసం పెంచే వెల్లుల్లి రకాలూ ఉన్నాయి.
ఓ పండో, కూరగాయో తిన్నట్లుగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తినలేం. కాబట్టే పోషకాహారంగా కన్నా మంచి మసాలాద్రవ్యం, అద్భుత ఔషధంగానే వాడకం ఎక్కువ. అలాగని వెల్లుల్లిలో పోషకాలకేమీ లోటు లేదు. ఖనిజాలతో బాటు బి విటమిన్ రకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని అలిసిన్ అనే కర్బన పదార్థం, అనేక వ్యాధుల్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది అంటారు నిపుణులు.
* వెల్లుల్లిలోని అలిసిన్ రక్తనాళాల్లోని ఒత్తిడి తగ్గించి, బీపీని తగ్గిస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండానూ చేస్తుంది. తద్వారా హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు, రోజూ ఒకటి రెండు రెబ్బల్ని తినడం వల్ల బీపీ తగ్గడంతో బాటు రక్తంలో కొలస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ శాతం తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.
* ఇది జీర్ణాశయ, పేగు క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. మొత్తంగా వెల్లుల్లి 13 రకాల ఇన్ఫెక్షన్లనీ, నివారిస్తుందని
‘ అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్’ సైతం పేర్కొంది.
* వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు అత్యధికం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయాలకు ముందుగా వెల్లుల్లి రసాన్ని వాడారట. ఆ రసంలో కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. లేదంటే మంట తట్టుకోలేరు. వెల్లుల్లిని తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.
* మధుమేహ రోగులకు మూత్రపిండాలు, గుండె, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వాళ్లు వెల్లుల్లిని తినడంవల్ల ఆయా దుష్ఫలితాలు తలెత్తకుండా ఉంటాయి. వెల్లుల్లిలోని సెలీనియం, క్యుయెర్టిసిన్, విటమిన్‌సి వంటి పోషకాలు ఇన్ఫెక్షన్లనీ వాపుల్నీ తగ్గించేందుకు తోడ్పడతాయి.
బీపిని తగ్గిస్తుంది
సోలో గార్లిక్ రకం దీన్నే సింగిల్ క్లోవ్ ఆర్య గార్లిక్ అనీ పిలుస్తారు. చైనాలో పుట్టిన ఈ రకాన్ని ఈ భూమ్మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో ఒకటిగా చెబుతారు. 17 రకాల అమైనో ఆమ్లాలూ, ౩౩ సల్ఫ్యూరిక్ పదార్థాలూ, 200కి పైగా ఎంజైములూ ఉన్న ఏకైక ఔషధం ఇదే. శరీరంలోని అన్ని రకాల కణాల పెరుగుదలకీ తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నుంచి వెలువడుతాయట. జెర్మానియం అనే శక్తివంతమైన ఆక్సిడెంట్ ఇందులో దొరుకుతుంది. అందుకే ఇది సర్వరోగ నివారిణి. వ్యాధుల నివారణలో వెల్లుల్లి కన్నా ఇది ఏడురెట్లు దృఢమైనది. దీని రసాన్ని ఎలుకల్లో ఇంజెక్ట్ చేస్తే 72 శాతం కొలెస్ట్రాల్ తగ్గిందట. బీపీకి కూడా అద్భుతమైన మందు.

వెల్లుల్లి health benefits

 

Garlic uses in telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News