Friday, March 29, 2024

ముప్పును జయించిన ముగ్గురు

- Advertisement -
- Advertisement -

 

కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్‌లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ

గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు
రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు
34 మంది డిశ్చార్జ్
త్వరలో గ్రీన్‌జోన్‌లోకి మరో 14 జిల్లాలు
రెడ్ జోన్లలో ఉండేవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలే
ఐసిఎంఆర్ మార్గదర్శకాల మేరకే పరీక్షలు, పసలేని ఆరోపణలొద్దు : మంత్రి ఈటల

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తున్న కొవిడ్ మప్పు నుంచి హైరిస్క్ గ్రూప్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు. రాష్ట్రంలో కరోనా సోకిన బాధితుల్లో శుక్రవారం మూడు అద్బుతాలు జరిగాయి. అతి ప్రమాదకరమైన వైరస్ అని పేర్కొనబడుతున్న ఈ మహమ్మారి భారి దాడిని హైరిస్క్ గ్రూప్‌కి చెందిన వ్యక్తులు దీటుగా ఎదుర్కొన్నారు. గాంధీ వైద్యులు ప్రత్యేక చొరవతో వీరు ఆరోగ్యవంతులుగా మారారు. 75 ఏళ్లకు చెందిన వృద్ధుడు, డయాలసిస్ సమస్య ఉన్న మరో వ్యక్తి కరోనాని జయించగా, 27 ఏళ్ల కలిగిన ఓ గర్భిణీ స్త్రీ డెలివరీ అయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రస్తుతం 75 ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి ఇళ్లకు చేరగా, డెలివరీ అయిన మహిళ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అడ్మిట్ అయ్యే సమయంలో క్రిటికల్ కండీషన్ ఉన్న వీరి ముగ్గురికి గాంధీ వైద్యులు బ్రహ్మాండంగా వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని మంత్రి తెలిపారు. వృద్ధుడు, డయాలసిస్ రోగులు మూడు వారాలు పాటు ఐసియూలో చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా, కోవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణీ స్త్రీకి ప్రత్యేక జాగ్రత్తలతో వైద్యులు డెలివరీ చేసి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విధంగా వైద్యులు కమిట్‌మెంట్‌తో పనిచేస్తుంటే కొందరు అవాస్తవాలను పదే పదే చెప్పి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

టెస్టులపై పసలేని వాదనలు వద్దు..

తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడం లేదని పసలేని వాదనలు చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. అవగాహన లేని వ్యక్తులు చేసే దుష్ప్రాచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన తెలిపారు. ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో టెస్టులు చేస్తున్నామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. టెస్టులు చేయకపోవడంతోనే కేసులు పెరగడం లేదని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన కొట్టిపరేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం వైద్యారోగ్యశాఖ నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన హజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో కొత్తగా పది పాజిటివ్ కేసులు నమోదుకాగా, 34 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1132కి చేరగా, వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా 727 మంది ఇళ్లకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 376 మందికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. వారిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి తెలిపారు. అయితే సోమవారం నమోదైన కేసులన్నీ మళ్లీ జిహెచ్‌ఎంసికి చెందినవేనని మంత్రి వెల్లడించారు. శుక్రవారం డిశ్చార్జ్ అయిన వారిలో హైదరాబాద్ నుంచి 21 మంది, సూర్యాపేట్ 3, వికారాబాద్ 1,ఆదిలాబాద్ 1, మేడ్చల్ 1,నిజామాబాద్ 1, రంగారెడ్డి 1,సిరిసిల్లా 1, మెదక్ 1, గద్వాల్‌కు చెందిన ముగ్గురు బాధితులను డిశ్చార్చ్ చేసినట్లు మంత్రి తెలిపారు.

సోమవారం నుంచి మరో 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి…

రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్‌జోన్‌లో ఉన్న 9 జిల్లాలతో పాటు మరో 14 జిల్లాలను గ్రీన్‌జోన్‌లో జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కావడం లేదని ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం వరకు ఆ జిల్లాలకు కూడా గ్రీన్ జోన్‌లోకి చేరవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట్, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే తాజాగా సూర్యాపేట్ వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలు రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కి వెళ్లగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్‌లో కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ జిల్లాలు కాకుండా 14 రోజుల పాటు కొత్తగా కేసులు నమోదు కానీ జిల్లాలను గ్రీన్ జోన్‌గా పరిగణిస్తామన్నారు.

ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నాం..

ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) గైడ్‌లైల్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నామని మంత్రి ఈటల మరోసారి వెల్లడించారు. ఎవరికి పడితే వారికి చేయొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, వైద్యనిపుణుల సలహాలను పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వ్యక్తిని నేరుగా కలసిన వారికి కరోనా టెస్టులు చేస్తున్నామని, మిగతా వాళ్లని14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తున్నామని, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్ధతు ఇచ్చారని, మరి కొన్ని రోజులు ఆ సహకారం కొనసాగితే రాష్ట్రం అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాల్లో కేసులు తగ్గాయని, రాబోయే రోజుల్లో పట్ణణాల్లో కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గాంధీ వైద్యులపై మంత్రి హరీష్ ప్రశంసలు

కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు దేశానికే ఆదర్శం అని మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News