Home లైఫ్ స్టైల్ ముసలితనం మొసలి నోట్లో..

ముసలితనం మొసలి నోట్లో..

lfe

అయినవారు, ఏలినవారూ పట్టించుకోని వృద్ధాప్యం

సాంకేతికరంగంతో పాటు పలు రంగాలలో అంచనాలకు అందని అభివృద్దిని సాధిస్తున్న మనిషి, మానవీయ విలువలకు దూరం అవుతున్నాడని చెప్పడానికి కోట్లాది మంది వృద్దులు పడుతున్న బాధలే సాక్ష్యం. వేలాది సంవత్సరాల మన ఘనమైన సంస్కృతి, సర్వస్వాన్ని త్యాగంచేసి, పెంచి పెద్దచేసి పిల్లలకు జీవితాన్నిచ్చిన కన్న తలిదండ్రులను వారి వృద్ధాప్యంలో పట్టించుకోవాలన్న విలువలను పిల్లలలో నేర్పలేకపోతున్నది. వేలాది సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు, ప్రయత్నాలు, సక్షేమం, హక్కులు, ఆధునికత విలువల ఒడిలో రూపొందిన పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవస్థ సైతం, భవిష్యత్ తరాల కోసం తమ జీవితాలను ధారపోసిన వృద్దులకు ఆనందదాయకమైన, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించలేక పోతున్నది.
ప్రభుత్వ నిర్వచనం ప్రకారం 60 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలవారిని వృద్దులుగా పరిగణిస్తున్నారు. వీరి సంఖ్య 2011 జనాభా గణాంకాల ప్రకారం దేశంలో 10 కోట్ల 30 లక్షలు ఉంది. అంటే దేశ జనాభాలో వీరు సుమారు 8.3% మంది ఉన్నారు. 1991 లో వీరి జనాభా ఐదున్నర కోట్లు. 20 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఏటా వీరి సంఖ్య 3.5% పెరుగుతూ వస్తున్నది. 2025 వ సంవత్సరానికి వృద్దుల సంఖ్య, దేశ జనాభాలో 25శాతానికి చేరుకుంటుందని అంచనా. దాదాపు 90% మంది వృద్దులు అసంఘటిత రంగానికి చెందిన వారు. 75% వృద్ధులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
దేశానికి భవిష్యత్ ను అందించిన వృద్ధులను సమస్యలు నలువైపుల పీడిస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏమంటే, వీరు చావు కోసం ఎదురు చూసే దుర్భర పరిస్థితులలోకి నెట్టివేయ బడుతున్నారు. చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలు, ఒంటరి తనం, ఎవరూ పట్టించుకోనక పోవడం, ఆర్థిక అభద్రత, నిరాశ నిస్పృహలు, భయాందోళనలు, చీదరించుకోవడాలు, తగిన అవకాశాలు లేకపోవడం, సాధారణ స్రవంతికి దూరంగా ఉండాల్సి రావడం, దౌర్జన్యానికి, నిరాదరణకు, అవమానాలకు గురి కావడం, గుర్తింపుకు నోచుకోక పోవడం లాంటి వివిధ సమస్యలతో వృద్దులు బాధ పడుతున్నారు. ఈ సంవత్సరం లో, హెల్ప్ ఏజ్ ఇండియా దేశ వ్యాప్తంగా జరిపిన సర్వే ప్రకారం 60% మంది వృద్ధులు నిరాదరణకు, 55% మంది అగౌరవానికి, 49% మంది దూషణలకు, 33% మంది నిర్లక్షానికి గురవుతున్నారని చెప్పింది. వృద్దులను దూషణలకు గురిచేస్తున్న వారిలో 57% మంది వారి కుమారులేనని, 38% మంది కోడళ్లు ఉన్నారని తెలిపింది. అంటే, తాము ఎవరికయితే జీవితాన్నిచ్చారో, ఎవరి చదువులకోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డారో, ఎవరికయితే భద్రమైన ఉపాధిని అందించడానికి తమను తాము అర్పించుకున్నారో, ఆ కన్న కుమారుల చేతిలోనే వృద్దులు బాధలు పడటం సిగ్గు పడాల్సిన విషయం.
జనాభాలో 8.3% ఉండి కూడా, తమ బాధలను, కష్టాలను, కన్నీళ్లను సమాజానికి చెప్పలేక పోయే పరిస్థితిలో ఉన్న నిస్సహాయ సమూహం బహూశా వృద్దులే. సహజంగా ఎవరికయినా కష్టం వస్తే, తమ వారితో పంచుకొని సేద తీరుతారు. తమను ఆదరించాల్సిన వారే, తమను ఆదుకోవాల్సిన వారే , తమను బాధలు పెడుతున్నపుడు, దూషిస్తున్నపుడు, నిరాదరణకు, నిర్లక్షానికి గురిచేస్తున్నపుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని విషాదకర పరిస్థితి వారిది. ఒక వేళ ఎవరికయినా చెప్పుకుందామంటే, ఉన్న ఆమాత్రం ఆదరణ కూడా దొరకదేమో అన్న భయం మరొకవైపు వృద్ధులను వెంటాడుతుంటుంది. పోనీ తెగించి తమ పిల్లల మీద ఫిర్యాదు చేయాలంటే మనసొప్పదు. కంప్లయింట్ చేసినా బయట తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం చాలా మంది వృద్ధులలో ఉండదు. తమ పిల్లలు తమను ఎంత బాధ పెట్టినా కుమిలి పోతుండటం తప్పించి, వారి మీద ఫిర్యాదు చేసి బాధ పెట్టడానికి మనసొప్పక మౌనంగా విషాదకర జీవితాలను ఈడ్చుకుంటూ, మరణం ఒక్కటే తమను బాధల నుండి విముక్తం చేస్తుందన్న ఆశతో వృద్ధులు బ్రతుకుతుంటారు. వృద్దులను ఇళ్లలోనే పట్టించుకోవడం కరవవుతున్న వేళ, వారికి ఆదరణ విషయంలో, సమాజం నుండో, ప్రభుత్వం నుండో భిన్నమైన స్పందనను చూడలేము. మొత్తం మీద వృద్ధులను కన్న పిల్లలు, రక్త సంబంధం ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు, ప్రభుత్వం తగినంతగా పట్టించుకోవడం లేదు.
వృద్ధులు నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు వారి కుమారుల స్వార్థమో, బాధ్యతారహిత్యమో కారణాలని సరిపెట్టుకోవడం పాక్షిక నిర్ధారణే అవుతుంది తప్ప వృద్ధుల సమస్యలకున్న లోతయిన సంక్లిష్టమైన మూల కారణాలను వెల్లడించదు. వృద్ధులను వారి కుమారులు పట్టించుకోలేక పోవడానికి వారి స్వార్థం, బాధ్యతారాహిత్యం వంటి కారణాలతో పాటు, ఆర్థిక వ్యవస్థలో, సంస్కృతిలో, రాజకీయాలలో వీటి మూల కారణాలున్నాయని గమనించాలి. గతంలో వ్యవసాయం, చేతి వృత్తులపై ప్రధానంగా ఆధారపడిన కాలంలో, చాలా వరకు అందరూ ఒకేచోట ఉన్న పరిస్థితి, తమ కుమారులు చేసే పనులలో సలహాలు, సూచనలతో సహకరించేందుకు వృద్దులకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. వ్యవసాయాన్ని , చేతి వృత్తులను వదిలి సంతానం ఉపాధిని వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు తరలివెళుతున్నారు. వ్యవసాయం కూడా మార్కెట్ కేంద్రంగా చాలా మార్పులకు లోనవుతున్నది. పట్టణాలలో చాలీచాలని ఆదాయం, ఇరుకు గదులు, సౌకర్యాల కొరత, పెరుగుతున్న ఖర్చుల కారణంగా, వృద్దులను ఉన్న ఊరిలోనే వదిలి పెడుతున్నారు. వృద్దుల అవసరాలను తమ ఆర్థిక కష్టాలతో ముడిపెట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు.
మార్కెట్‌లో ఉపయోగిత లక్షణంపై ఆధారపడి సరుకుల ప్రాధాన్యత ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సరుకుల ఉత్పత్తి నుండి వినియోగదారుకు చేరవేయడందాక మొత్తాన్ని నడిపించేది లాభ సూత్రం అన్న విషయాన్ని మరువరాదు. సరుకులకు ఒక్కటే కాకుండా మనుష్యులకు కూడా ఈ సూత్రం వర్తింపచేస్తుండటంతో, సంపాదన ఉన్నన్నాళ్లు గుర్తింపుకు, గౌరవానికి నోచుకునే వారు వృద్ధులైన తర్వాత, సంపాదనకు దూరమై అవమానాలు, చీత్కారాలు, దూషణలు ఎదుర్కొంటున్నారు. ప్రతి అవసరాన్ని, అవకాశాన్ని, మానవ సంబంధాలను, మానవీయ విలువలను లాభ దృష్టితో చూసే పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఫలితంగా ఒకప్పుడు వృద్దుల పట్ల బాధ్యత చూపిన , గౌరవించిన సమిష్టి కుటుంబాలు పోతున్నాయి. వాటి స్థానంలో చిన్న కుటుంబాలు వస్తున్నాయి. చిన్న కుటుంబాలు నేడు వృద్ధులను పట్టించుకోవడం , మోయలేని ఆర్థిక భారంగా చూస్తున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమాన్ని క్రమంగా తగ్గిస్తూ, తప్పనిసరిగా తాము అందించాల్సిన విద్య , వైద్యాన్ని సైతం ప్రయివేట్ పరం చేస్తున్నాయి. విద్య ,వైద్యాన్ని కొనలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న పరిమిత ఆదాయంతో తమ సంతానం భవిష్యత్ ను నిర్మించుకోవడమా? తమ తల్లిదండ్రులను పట్టించుకోవడమా అన్న ప్రశ్నకు సమాధానం వెతుకులాటలో తమ సంతానాన్ని పట్టించుకోవడం వైపే వృద్ధుల పిల్లలు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా వృద్దులకు నిరాదరణే ఎదురవుతున్నది. గతంలో సంప్రదాయం పేరిట, అణకువ బాధ్యత పేరిట వృద్ధులకు సమస్తమైన సేవలు చేసే భారాన్ని ఎక్కువభాగం కోడళ్లే పైనే వేసేవారు. ప్రస్తుతం అది అసాధ్యం, న్యాయం కూడా కాదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిమీద వచ్చే వృద్ధులు కూర్చునేందుకు తగిన కుర్చీలు గాని, తాగునీటి వ్యవస్థ కాని, మూత్రశాలలు కాని ఉండవు. చాలా మంది ప్రభుత్వ సిబ్బందిలో వృద్దుల పట్ల సున్నితంగా, ప్రత్యేక శ్రద్దతో వ్యవహరించాలన్న నాగరిక సృహ ఉండదు. గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంటుంది. వృద్దులకు ప్రత్యేకంగా వార్డులను ఏర్పరచాలన్న నిబంధన అసుపత్రులలో ఎక్కడా అమలుకాదు. గ్రామాలలో ఉండే వృద్ధుల కంటే పట్టణ ప్రాంతాలలో ఉండే వృద్ధులు మరింత ఇబ్బందులకు, సమస్యలకు గురవుతుంటారు. గ్రామాలలో వృద్ధులను పలకరించేందుకు చుట్టుపక్కల వారుంటారు. అపార్ట్ మెంట్ సంస్కృతులతో నిండిపోతున్న కాంక్రీట్ జనారణ్యంలో వృద్ధులను పట్టించుకునే వారు ఉండే అవకాశాలు తక్కువ. రద్దీ రోడ్ల పై, కిక్కిరిసిన సిటీ బస్సుల్లో, రైళ్లలో ప్రయణం వృద్ధులకు నరకయాతన. పోటెత్తిన వరదలా పరుగెత్తుకుంటు వస్తూ బస్సుల్లో , రైళ్లలో సీట్లకోసం యుద్దాలు చేస్తున్న యువత వృద్దులను పట్టించుకోవడం కాదు కదా వారినితోసేసుకుంటూ వెళూతుండటం జరుగుతుంటుంది. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారు వృద్ధులు బయటకు రావడానికే బయపడేలా చేస్తుంటారు. చాలా మంది వృద్ధులు తగిన అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేక బస్సుల్లో, రైళ్లలో చార్జీ మినాయింపు పొందలేకపోతున్నారు. వృద్ధాప్య పెన్షన్‌లు సుమారు 18% మంది అర్హులైన వృద్దులకు మాత్రమే వస్తున్నాయి. అది కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. నెలకు 300 నుండి 1500 రూపాయల దాక ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఇస్తున్నారు. పాండిచ్చేరి లాంటి చోట రూ.2500 వరకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. మెజారిటీ ప్రాంతాలలో ఇస్తున్న పెన్షన్ నేటి పరిస్థితులకు ఏమాత్రం తగిన విధంగా లేదు. కనీసం ప్రతి వృద్ధునికి/ వృద్ధురాలికి నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అవసరం. వృద్ధులందరికీ పెన్షన్ ఇవ్వాలి. తమ ప్రాంతంలో వృద్ధులు ఎవరైనా చనిపోతేగాని ఆ స్థానంలో తమకు పెన్షన్ రాదన్న పరిస్థితి వృద్ధుల్లో అత్యంత దారుణమయింది. మనదేశంలో ఉద్యోగానంతర పెన్షన్ కాని, ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ఉండని అసంఘటిత రంగంలో 90% మంది ప్రజలు పని చేస్తున్నారు. తమకు శక్తి ఉన్నంత వరకు పని చేసి, వృద్ధాప్యంలో బయటికి వచ్చు. వీరికి, అసంఘటిత రంగం చేయించుకున్నన్నాళ్లు వాడుకొని, ఆతరువాత ఇచ్చే భవిష్యత్ ఏమీ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగ, సంఘటితరంగ ఉపాధి ఆధారంగా పెన్షన్ పొందుతున్న వృద్ధులు దేశంలో 5% నుండి 8% నికి మించి ఉండరు. రాజకీయాపార్టీల మ్యానిఫెస్టోలలో 10 కోట్లకు పైగా ఉన్న వృద్దుల సంక్షేమానికి సంబంధించిన హామీలు కాగడా పెట్టి వెతికినా కానరావు. మార్కెట్ రూపొందిస్తున్న అవసరాలను, పెరుగుతున్న కనీసావసరాలను తీర్చుకోవడానికి అవసరమైన రాబడికి చాలీచాలని , అస్థిర ఆదాయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చుకోలేని పరిస్థితి జీవితాల్ని దుర్భరంగా మారుస్తుంది. ఇళ్లల్లో ఈ ప్రభావానికి ఎక్కువగా వృద్దులు బలవుతున్నారు. రచయిత కుటుంబరావు గారు చెప్పినట్లు మనుష్యులు సుఖంగా, సౌఖ్యంగా ఉన్నపుడు మంచిగానే ఉంటారు, జీవితం దుర్భరమైనప్పుడే ప్రక్కనున్న వారిని కరుస్తుంటారు అన్న విషయం వృద్ధుల విషయంలో వారి కొడుకు – కోడళ్లు చూపించే అసహనం, విసుగును చూస్తే నిజమే అనిపిస్తుంది. మనుష్యులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోలేనటువంటి తమ అసహాయ స్థితిని, నిస్సహాయులైనటువంటి, తమ సంరక్షణలో ఉన్న, అధికారం క్రింద ఉండే వారిపైన ప్రదర్శించడం ద్వారా వ్యక్తపరుస్తుంటారు.జనాభాలో 3% ఉన్న వికలాంగుల విషయంలో తీసుకునేపాటి పరిమిత శ్రద్ద కూడా అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల విషయంలో కానరాదు. సమాజంలో వివిధ రకాల నిస్సహాయ సమూహాల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్చంధ సంస్థలు, పౌరసంస్థలు కూడా వృద్ధులకు చేస్తున్నది తక్కువే అని చెప్పవచ్చు. హెల్ప్ ఏజ్ ఇండియా లాంటి సంస్థలు తప్ప మిగతా సంస్థలు చెప్పుకోదగిన స్థాయిలో , విసృతంగా పనిచేస్తున్న స్థితి లేదు. ప్రభుత్వం, మహిళలను, వికలాంగులను దేశ వ్యాప్తంగా స్వశక్తి సంఘాలలోకి తీసుకురావడంలో చూపిన శ్రద్ధ వృద్ధుల విషయంలో చూపడం లేదు. వృద్ధులు తమంతట తాము సంఘాలను ఏర్పాటుచేసుకున్న చోట ఒకమేరకైనా, తమ సమస్యలను ఒకరితో ఒకరు పంచుకుంటు, అవసరాలను తీర్చుకుంటూ, తమను పట్టించుకునేందుకు తమ సంఘాలున్నాయన్న ధీమాతో బ్రతకడం కనిపిస్తుంది. విద్యాలయాలలో కాని, సామజిక మాధ్యమాలలో కాని, ఇతర ప్రసార సాధనాలలో కాని వృద్ధుల పట్ల బాధ్యతగా, మానవీయంగా ప్రవర్తించాలని నేర్పడం లేదు. ప్రత్యేకించి చట్టాలను తయారు చేస్తున్న వారిలో, వాటిని అమలు చేయాల్సిన వారిలో వృద్ధుల పట్ల సున్నితంగా , బాధ్యతగా, ప్రత్యేక శ్రద్ధ తో వ్యవహరించాలన్న సంస్కారా న్ని పెంచాల్సిన అవసరం ఉం ది. నేటి తరానికి ప్రాణమిచ్చి, వా రి జీవితాల్ని మలిచేందుకు తమ సర్వస్వాన్ని ధారపోసిన వృ ద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం ముఖ్య కర్తవ్యం అన్నది మరువరాదు.

వేంకటేశ్వర్లు