Home ఎడిటోరియల్ సౌదీపై దాడి: ఇండియాకు వేడి

సౌదీపై దాడి: ఇండియాకు వేడి

Cartoon

 

ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో భారతదేశం ఉంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసేవిగా ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే దేశం లో సమస్యలు పెరుగుతాయి. సెప్టెంబర్ 14వ తేదీన సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలపై 10 డ్రోన్లు దాడి చేశాయి. సౌదీ ప్రభుత్వ చమురు సంస్థ అరాంకో ఆధ్వర్యంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, అబ్లాయిబ్ చమురు క్షేత్రంపై ఈ దాడి జరిగింది. ప్రపంచంలోని చమురు ఉత్పత్తిలో 5 శాతం ఈ చమురు క్షేత్రంలోనే జరుగుతుంది. ఈ దాడి తర్వాత మొత్తం చమురు క్షేత్రం మంటల్లో చిక్కుకుంది. రోదసిలో కూడా ఈ మంటలు కనిపించాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించవచ్చు. ఈ దాడికి కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపణలు గుప్పించింది. మరో వైపు యెమన్‌లో పోరాడుతున్న హూతీ తిరుగుబాటుదారులు ఈ దాడి చేసింది తామేనని ప్రకటించారు.

భారతదేశానికి చమురు ఎగుమతి చేస్తున్న రెండవ అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. వంటగ్యాస్ విషయంలో కూడా మనం సౌదీపై ఆధారపడి ఉన్నాం. ఈ దాడుల తర్వాత ప్రపంచంలో చమురు ధరలు పెరుగుతాయని విశ్లేషకులు అన్నారు. చమురు ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే తక్షణం సరఫరాపై పెద్ద ప్రభావం పడలేదని కూడా అంటున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన బ్రెంట్ క్రూడాయిల్ ధర ప్రపంచ మార్కెటులో బ్యారెల్ 60 డాలర్లు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 54.80 డాలర్లు. దాడి సెప్టెంబర్ 14న జరిగిన తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 65 నుంచి 70 డాలర్లు పలకవచ్చు. అలాగే వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 60 నుంచి 63 డాలర్లు పలకవచ్చు. అంటే భారతదేశంలో పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతాయి. లీటరుకు ఒక రూపాయి నుంచి 3 రూపాయల వరకు పెరిగే అవకాశాలున్నాయి.

సెప్టెంబర్ 16వ తేదీన ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 12 డాలర్లు పెరిగి ఒక్కో బ్యారెల్ 72 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ఏర్పడింది 1988లో. అప్పటి నుంచి ఈ స్థాయిలో ధర పెరగడం ఎప్పుడూ లేదు. అంతర్జాతీయ చమురు ధరలపై దేశంలో పెట్రోలు, డీజిలు ఇంధన ధరలు ఆధారపడి ఉంటాయి. చమురు దిగుమతి ధరలు భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు దిగుమతి వ్యయాలు పెరుగుతాయి. భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఈ మాంద్యం మరింత ఎక్కువ కావచ్చు. ఇది భారతదేశానికి చాలా నిరుత్సాహకరమైన పరిస్థితి.
అంతర్జాతీయ విపణిలో చమురు ధర ఏమాత్రం పెరిగినా భారత వాణిజ్య లోటుపై పెద్ద ప్రభావం వేస్తుంది. చమురు దిగుమతికి పెరిగే ఒక్కో డాలర్ వ్యయం దేశం చెల్లించే దిగుమతి వ్యయాన్ని వేల కోట్ల రూపాయలకు చేరుస్తుంది. ఏటా 10,700 కోట్ల రూపాయల అదనపు ఖర్చుగా మారుతుంది. 201819లో భారతదేశం 111.9 బిలియన్ డాలర్లు చెల్లించింది. రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిలు ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

సౌదీపై జరిగిన ఈ డ్రోన్ దాడి తర్వాత భారత రూపాయి విలువపై కూడా దీని ప్రభావం పడుతుందంటున్నారు. ప్రపంచ మార్కెటులో పది శాతం చమురు ధర పెరిగినా భారత దేశంలో ద్రవ్యలోటు 0.4 నుంచి 0.5 శాతం పెరుగుతుంది. భారతదేశం అవసరాలకు కావలసిన చమురులో 80 శాతం దిగుమతి చేసుకోవలసిందే. అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ నుంచి చమురు సరఫరా చేసుకునే మార్గాలు మూసుకుపోయాయి. ఇరాక్, సౌదీ అరేబియాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. చమురు సరఫరాలో ఎలాంటి సమస్య లేదని సౌదీ హామీ ఇచ్చినప్పటికీ, సౌదీ చమురు క్షేత్రం మరమ్మత్తులు పూర్తయి, మళ్ళీపూర్తి స్థాయిలో పని చేయడానికి ఎంతకాలం పడుతుందన్నది కీలకమైన అంశం. ఈ పనులు పూర్తి కావడం ఆలస్యమైతే భారతదేశం ప్రత్యామ్నాయాలను వెదుక్కోవలసి ఉంటుంది. కాని చమురు ఎగుమతి చేసే వెనిజులా, లిబియా, నైజీరియాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలను ఇప్పుడు వెదుక్కోవడం అంత తేలిక కాదు. ఏది ఏమైనా చమురు ధర పెరగడం అనేది ఖాయమైంది. అంటే దిగుమతి వ్యయం పెరుగుతుంది.

దాంతో పాటు రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల మరింతగా దిగుమతి వ్యయం పెరుగుతంది. ఇదొక విష వలయం లాంటిది. మరోవైపు చమురు ధర పెరగడం వల్ల దేశంలో పెట్రోలు డీజిలు ధరలు పెరగడమే కాదు, వాటితో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. భారతదేశంలో ధరలపై ప్రభావం పడినప్పటికీ సరఫరాలో అంతరాయం ఉండదని చాలా మంది భావిస్తున్నారు. కనీసం ఇప్పుడు అలాంటి ప్రమాదం కనిపించడం లేదు. ప్రస్తుతం భారతదేశం 12 రోజుల పాటు దేశానికి అవసరమైన చమురు నిల్వలున్నాయి. విశాఖపట్నం చమురు నిల్వ గోదాంలో 1.33 ఎం.టీ, మంగుళూరులో 1.5 ఎం.టీ, పాడూరులో 2.5 ఎం.టీల నిల్వలున్నాయి. భారత రిఫైనరీల్లో 65 రోజుల క్రూడాయిల్ స్టోరేజ్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే మనకు 87 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయి.

సౌదీపై జరిగిన దాడి వల్ల ప్రపంచ చమురు సరఫరా దెబ్బతినే పరిస్థితి ఏమీ లేదని అంతర్జాతీయ సంస్థలు కూడా విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతానికి సరఫరా పరిస్థితి బాగానే ఉంది. ఒకవేళ చమురుకు కొరత ఏర్పడితే అమెరికా నుంచి కూడా భారతదేశం సంపాదించవచ్చు. ప్రస్తుతం భారతదేశం అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికా నుంచి మన చమురు దిగుమతులు కూడా మూడు రెట్లు పెరిగాయి.

10 drones strike Saudi oil refineries on September 14