Home బిజినెస్ ఐటీ కంపెనీలకు షాక్

ఐటీ కంపెనీలకు షాక్

 రూ.10 వేల కోట్ల పన్నులు చెల్లించాలి
 ఆదాయం పన్నుశాఖ నోటీసులు
IT

ముంబయి: ఐటీ పరిశ్రమకు ఆదాయం పన్నుశాఖ షాక్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీల రూ.10 వేల కోట్ల పన్ను చెల్లించాలంటూ టాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. ఇప్పటికే అమెరికా వలస చట్టాలు, ఆటోమేషన్ పెరగడం వంటి పరిణామాలతో ఐటి పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ శాఖ పంపిన నోటీసులు మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. దాదాపు 200 సంస్థలు సేవా పన్ను చెల్లించాలని ఐటీ నోటీసులు జారీ చేసింది. 2012 నుంచి -2016 వరకు ఐదేళ్ల కాలంలో విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసి పొందిన ప్రజయోనాలకు రిటర్న్ దాఖలు చేయాలని పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు పంపింది. ఆలస్యం చేసినందుకు వడ్డీ, జరిమానాలతో పాటు అదనంగా 15 శాతం సేవా పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. భారత్‌కు వెలుపల వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ను అందించడం ఐటి, ఐటిఇఎస్ కంపెనీలకు ఎగుమతి చేసినట్టు కాదని స్పష్టం చేసింది. క్లయింటు ప్రత్యేకమైన వివరాలతో భారత ఐటీ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఎగుమతి చేయాలో ముందే మెయిల్ పంపిస్తారు. ఇది అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ వినియోగదారుకు విక్రయిస్తున్నట్టే అని పన్నుల శాఖ వాదిస్తోంది. కంపెనీలు ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితం ఉండదని నిపుణులు అంటున్నారు. అక్కడికి వెళ్లాలన్నా ముందు ఆ మొత్తంలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పన్ను గతంలో 15 శాతమే ఉండగా.. జిఎస్‌టి రాకతో ఇప్పుడది 18 శాతానికి పెరిగింది.
ఐటీ అండతో మార్కెట్‌కు లాభాలు
ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల అండతో సూచీలు లాభాల దిశగా పయనించాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెనెక్స్ సూచి 26 పాయింట్ల లాభంతో 33,588 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10348 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలోని కీలకమైన నిఫ్టీ బ్యాంక్ ట్రేడింగ్‌లో 0.12 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యదికంగా ఐటీ అత్యధికంగా 1.02 శాతం లాభపడగా, నిఫ్టీ పియుసి బ్యాంక్ సూచి 0.36 శాతం మేరకు నష్టపోయింది. మరోవైపు బిఎస్‌ఇ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అత్యధికంగా 1.30 శాతం లాభపడగా, టెలికాం సెక్టార్ 1శాతం మేరకు నష్టపోయింది. కాగా నిఫ్టీలో ప్రధానంగా ఐటీ రంగం 1 శాతం పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచింది. పిఎస్‌యు బ్యాంక్స్, మెటల్, ఆటో రంగాలు 0.35 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్ 2.5 శాతం, ఆర్‌ఐఎల్ 2 శాతం చొప్పున లాభపడటంతో సూచీలు పుంజుకున్నాయి. ఈ బాటలో సన్ ఫార్మా, యస్‌బ్యాంక్, ఐషర్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌పిసిఎల్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ 2-1 శాతం మధ్య పెరిగాయి. అదానీ పోరట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఐబి హౌసింగ్, ఏసియన్ పెయింట్స్, గెయిల్, అల్ట్రాటెక్, హిందాల్కో, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, సన్‌ఫార్మా, యస్‌బ్యాంక్, ఐచర్‌మోటర్స్ లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, అదానీ ట్రాన్స్‌పోర్ట్, బజాబ్ అటోఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్ నష్టపోయాయి. ఈక్విటీ ధరలపై చైనా ప్రభుత్వం హెచ్చరిక జారీచేయడంతో ఆ దేశపు ప్రధాన సూచి షాంఘై ఇండెక్స్ 2.5 శాతం పతనమైంది. కాగా హాంకాంగ్, సింగపూర్ సూచీలు కూడా నష్టపోయాయి. దాంతో భారత్ మార్కెట్ ఒక దశలో తీవ్ర అమ్మకాల బత్తిడికి లోనైంది. కాగా నగదు విభాగంలో గత రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) బుధవారం రూ. 441 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డిఐఐలు(దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు) గత మూడు రోజుల్లో రూ. 2,800 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, బుధవారం మరో రూ. 837 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోళ్లు చేపట్టారు.