Home Default అరబ్ జలాల్లో ఆక్రందన

అరబ్ జలాల్లో ఆక్రందన

  •  సాయానికి 100 మంది భారత నావికుల ఎదురుచూపులు

A15-UAE

దుబాయి : ఇరవై రెండు ఓడల్లో సుమారు వంద మంది భారత నావికులు యుఎఇ జలాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వారు ఇక్కడి భారత కాన్సులేట్ జనరల్ సాయానికి ఎదురుచూస్తున్నారని గల్ఫ్ న్యూస్ నివేదిక వెల్లడించింది. యుఎఇ జలాల్లో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్న భారత నావికులు ఈ వేసవిలో మరింత ఎక్కువయ్యారని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపినట్లు గల్ఫ్ న్యూస్ ఉటంకించింది. ‘మేం ప్రస్తుతం 22 ఓడలకు సంబంధించిన కేసులపై దృష్టి సారించాం. వాటిలో 97 మంది భారత నావికులు ఉన్నారు’ అని దౌత్యాధికారి విపుల్ వెల్లడించారు. ఈ ఓడల్లో ఇతర దేశాలకు చెందిన నావికులు ఎంత మంది ఉన్నారో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ, శ్రీలంక, ఫిలిప్పీన్స్, మయన్మార్, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారు కూడా వాటిలో ఉన్నారని  కాన్సులేట్ తెలిపింది. గల్ఫ్ న్యూస్ అడిగిన ప్రశ్నలకు కాన్సులేట్ ఈ మేరకు బదులిచ్చింది. యజమానులు తమకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదని నావికుల్లో అత్యధికులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలు చేతికి అందితే స్వదేశాలకు తిరిగివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓడల యజమానులతో సంప్రదించి నావికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని విపుల్ చెప్పారు. వారి సమస్యలను ప్రత్యేకించి వారి బకాయిల చెల్లింపులకు సంబంధించిన సమస్యలను తామొక్కటే పరిష్కరించలేమని ఆయన అన్నారు.