Home తాజా వార్తలు సవాల్

సవాల్

ktr

వార్ వన్‌సైడే

టిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తా 

వందకు వంద శాతం కెసిఆరే మళ్లీ సిఎం
ఆయనే మా నినాదం.. ప్రజలే మా బాస్‌లు
ఒంటరిగానే పోటీ చేస్తాం.. మళ్లీ వస్తాం
పంచాయతీ ఎన్నికల్లో సైతం ఏ పంచాయితీ లేకుండానే టిఆర్‌ఎస్ అమోఘ విజయాలు సాధిస్తుంది
మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వార్ వన్‌సైడే ఉంటుందని, వందకు వంద శాతం టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, అది జరగకుంటే తాను రాజకీయాల్లోనే ఉండనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయి. కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని ప్రజలు ఒక్క కంఠంతో కోరుకుంటున్నారు. వందకు వంద శాతం ఆయనే సిఎం, వచ్చే ఎన్నికల్లో కెసిఆరే మా నినాదం అని స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లని, ఏ పార్టీకో ‘బి’ టీమ్‌గానో, ‘సి’ టీమ్‌గానో ఉండాల్సిన అవసరం లేదన్నారు. టిక్కెట్లు ఇస్తామంటే కాంగ్రెస్ నేతలెంతో మంది తమ పార్టీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని, మరో పదేళ్ళు కెసిఆరే సిఎం అని వ్యాఖ్యానించారు. మంత్రి కెటిఆర్ సచివాలయంలో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధమేనని, పంచాయతీ ఎన్నికల్లో సైతం ఏ పంచాయతీ లేకుండా టిఆర్‌ఎస్ అమోఘమైన విజయాన్ని సాధిస్తుందన్నారు. ఏ కోణం నుంచి చూసినా పంచాయతీ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్‌గానో, ప్రీఫైనల్‌గానో భావించాల్సిన అవసరం అసలే లేదన్నారు. కెసిఆర్ నినాదంతో, నాగేళ్ళ అభివృద్ధిని చూపించే రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తామన్నారు. నాలుగేళ్ళలో ప్రతిపక్షాలను తప్ప అన్ని వర్గాలనూ తమ పార్టీ, ప్రభుత్వం పట్టించుకున్నదని, విపక్షాలు చేసే విమర్శలను, ఆరోపణలను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదన్నారు. స్థానికంగా తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంఎల్‌ఏల పట్లప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందువల్ల చక్కదిద్దుకుంటామన్నారు. సిట్టింగ్‌లమీద వ్యతిరేకత పార్టీపై పడుతుందన్న ప్రశ్నకు కెటిఆర్ బదులిస్తూ, కెసిఆర్ మీద ప్రజల్లో వందశాతం నమ్మకం ఉందని, ఎంఎల్‌ఏలను గెలిపించుకోవడం ద్వారానే ఆయన్ను సిఎం చేయడం సాధ్యమవుతుందనే విచక్షణ ప్రజల్లో ఉందని బదులిచ్చారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే సర్దుకోడానికి ఇబ్బంది లేదన్నారు. కెసిఆర్‌ను, తెలంగాణను వేరు చేయలేమని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, కొట్లాడింది కెసిఆర్ అనే అంశంలో ప్రజల్లో స్పష్టత ఉందని అన్నారు. మరో పదేళ్ళు కెసిఆరే సిఎంగా ఉంటారని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్ కోసం ముగ్గురికంటే ఎక్కువమందే పోటీ పడుతున్నారని ప్రశ్నించగా, పార్టీ ఆ మేరకు వ్యాప్తిచెందిందని, గెలుస్తుందనే నమ్మకం ఉందని, టిక్కెట్లు ఇస్తామంటే పార్టీలోకి రావడానికి కాంగ్రెస్ నేతలు చాలా మందే సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బేగంపేట టు గన్‌పార్క్ ఊరేగింపు మరువలేని జ్ఞాపకం
పదేళ్ళపాటు శాసనభ్యుడిగా, నాలుగేళ్ళుగా మంత్రిగా ఉన్నప్పటికీ తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన తర్వాత హైదరాబాద్‌లో బేగంపేట నుంచి గన్ పార్కు వరకు ర్యాలీలో పాల్గొనడమే తనకు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని, జీవితానికి ఇది చాలు అని అనిపించిందని, ఇప్పటికీ అదే అన్నింటింటే తృప్తిగా ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వచ్చిన గుర్తింపులు, తృప్తి, ఆనందం… అన్నీ అదనం (సర్‌ప్లస్) మాత్రమేనని, ఇంతకన్నా ఎక్కువ ఆలోచనలు లేవని అన్నారు.
డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి తీరుతాం : రాష్ట్రప్రభుత్వం ఐదేళ్ళలో 2.65 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించాలని లక్షంగా పెట్టుకుందని, తప్పనిసరిగా దాన్ని పూర్తిచేస్తామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ళకు టెండర్లను కూడా పిలిచామని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సిమెంటు, స్టీలు ధరలు పెరగడంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ఒకేసారి జరుగుతుండడంతో కాంట్రా క్టు సంస్థల కొరత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం మరో ఐదేళ్ళూ అధికారంలోనే ఉంటుంది కాబట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఢోకాలేదన్నారు.
ఐటిఐఆర్ విషయంలో కేంద్రమే చేతులెత్తేసింది : ఐటిఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేసిందని, రాష్ట్ర ప్ఱభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేదీ లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడకుండా తమ ప్రభుత్వం ఐటి రంగాన్ని విస్తరించే పనుల్లో నిమగ్నమైందని, ఇప్పటికే బుద్వేల్‌లో ఐటి క్లస్టర్ వచ్చిందని, మరికొన్ని చోట్ల కూడా వస్తున్నాయని తెలిపారు. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సైతం కేంద్రం నుంచి ఇదే చేదు అనుభవం ఎదురైందని, తెలంగాణను విమర్శించే ఇక్కడి కాంగ్రెస్ నేతలు కర్నాటక ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించడంలేదని కెటిఆర్ ప్రశ్నించారు. గతంలో పరిశ్రమలు పెడతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకపోవడంతో సుమారు 1200 ఎకరాల భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అన్నారు.
నాలుగేళ్ళలో 35 వేల ఉద్యోగాలు : నూతన పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని, ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అయ్యాయని గుర్తుచేశారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా వివిధ డిపార్టుమెంట్లలో అదనంగా మరికొన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపరు మిల్లును పునరుద్ధరించడానికి జెకె గ్రూపు ముందుకొచ్చిందని, రూ. 685 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని, ఐదు బ్యాంకుల్లో నాలుగు అంగీకారం తెలిపాయన్నారు. ‘బిల్ట్’ మిల్లును పునరుద్ధరించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వెల్ స్పన్ అనే కంపెనీ మొదటిసారి ఆ రాష్ట్రానికి వెలుపల పెట్టనున్న యూనిట్‌ను తెలంగాణలో స్థాపించడానికి ఆసక్తి చూపించిందని, వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో 700 ఎకరాలను అడిగిందని గుర్తుచేశారు. తొలుత ౩వేల ఎకరాలను కోరిందని పేర్కొన్నారు. కంపెనీలకు రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించిన కెటిఆర్ కర్నాటకలో ఆ పార్టీ ఇలాంటి రాయితీలు ఇవ్వకుండానే పరిశ్రమలను ఆహ్వానించిందా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇటీవల గోల్డ్ రిఫైనరీ పెట్టడానికి ఒక ప్రైవేటు కంపెనీ ముందుకొచ్చిందని, అయితే దాని ద్వారా 150 ఉద్యోగాలు కూడా రావడంలేదన్న అంశాన్ని గుర్తించామని తెలిపారు.
నిరుద్యోగ భృతి కాంగ్రెస్‌కు ఆపదమొక్కు : నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీకి ఆపదమొక్కులా ఉందని, పూర్తి నిరాశా నిస్పృహల్లో ఉన్నందునే ఆ పార్టీ నేతలు ఇలాంటి హామీలను ఇస్తున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులంటే నిర్వచనమేంటో కూడా కాంగ్రెస్‌కు తెలియదని, రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో అస్సలే తెలియదని అన్నారు. పదవ తరగతి పూర్తిచేసినవారిని నిరుద్యోగులుగా గుర్తించాలా లేక ఇంటరా లేక డిగ్రీ యా… ఆ పార్టీ ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా తాను ఎన్నోసార్లు డిమాండ్ చేశానని, ఇప్పటివరకు సమాధానమే రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇ స్తోం దే తప్ప నిరుద్యోగుల్ని తయారుచేయడంలేదని, లక్ష ఉ ద్యోగాలు ఇస్తామన్న హామీలో ఇప్పటికే 35 వేలు ఇ చ్చా మని, మిగిలినవాటిని కూడా ఇచ్చి తీరుతామన్నారు.
పార్టీలు విస్తరిస్తే మాకేం అభ్యంతరం ?
ఏ పార్టీ అయినా బలంగా ఉండాలని కోరుకుంటుందని, అమిత్‌షా, కోదండరాం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా వారివారి పార్టీలు బలంగా ఉండాలని కోరుకోవడంలో, విస్తరింపజేయాలనుకోవడంలో తప్పేం లేదని వ్యాఖ్యానించిన కెటిఆర్ టిఆర్‌ఎస్ మాత్రం ఒంటరిగానే పోటీచేస్తుందని, ఆ పార్టీల బలమెంతో ఎన్నికల్లో తేలుస్తుందన్నారు. నాలుగేళ్ళుగా బిజెపి, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు రాష్ట్రాన్ని లక్షంగా చేసుకుంటున్నాయని, వాటిని పట్టించుకునే తీరిక టిఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లని, రాహుల్‌గాంధీయో, మోడీయో తమకు ముఖ్యం కాదన్నారు.
సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా : రానున్న ఎన్నికల్లో తన నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని, అక్కడ తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఇక్కడ ఉన్నవారిని, టిక్కెట్లు ఆశిస్తున్నవారిని తానెందుకు ఇబ్బంది పెట్టాలని ఎదురు ప్రశ్నించారు. నియోజకవర్గం మారాలన్న ఆలోచన లేదన్నారు.
కాంగ్రెస్‌పై కెటిఆర్ నిప్పులు : కుటుంబ పార్టీ అంటూ టిఆర్‌ఎస్‌ను నిందించే కాంగ్రెస్ నేతలు ముందు వారి పార్టీ గురించి స్వీయ విమర్శ చేసుకోవాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తనను, తన సోదరి కవితను, బంధువు హరీశ్‌రావును ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారని, ప్రజలు ఓట్లు వేయకపోతే గెలిచేవారిమా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన అని విమర్శించేవారు ఈ విషయాలకు బదులివ్వాలన్నారు. ఆ విధంగా మాట్లాడడమంటే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతీ సందర్భంలో కుంభకోణం జరిగిందంటూ టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తోందని, నిజంగా అలాంటి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు ఉంటే బైట పెట్టాలని కెటిఆర్ సవాల్ విసిరారు. పాస్‌బుక్కుల ప్రింటింగ్‌కు ఖర్చయిందే రూ. 140 కోట్లు అయితే అందులో రూ. 80 కోట్ల స్కాం జరిగిందని వ్యా ఖ్యా నించడం విడ్డూరంగా ఉందన్నారు. బతుకమ్మ చీ రల మొత్తం కాంట్రాక్టే రూ. 220 కోట్లయితే అందులో రూ. 160 కోట్లు స్కామ్ జరిగిందంటే అర్థమేమైనా ఉం దా అని ప్రశ్నించారు. ప్రతీసారి కుంభకోణం అని వ్యా ఖ్యా నించడానికి బదులు ఆ వివరాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకంలో కుంభకోణం జరిగిందని అంటున్న కాంగ్రెస్ నేతలే వారి భూమికి రావాల్సిన సాయాన్ని చెక్కుల రూపంలో అందుకున్నారని, ఆ పార్టీకి చెందిన జానారెడ్డి కూడా అందుకున్నారని గుర్తుచేశారు. చాలా మంది కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తీసుకున్నారన్నారు.