Home తాజా వార్తలు ‘కోలాట’ రాజకీయాలు

‘కోలాట’ రాజకీయాలు

103 Gram Panchayats in Peddapalli Legislative Assembly

మహిళా సంఘాలను మరిపిస్తున్న కోలాటం బృందాలు
ప్రసన్నం చేసుకునేందుకు నాయకుల వితరణ
పెద్దపల్లి రాజకియాల్లో వినూత్న పరిస్థితి 

మనతెలంగాణ / పెద్దపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకియాలు కోలాహలంగా ఉండడం చూశాం తప్ప కోలాటం రూపం సంతరించుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. పెద్దపల్లి నియోజక వర్గ రాజకియాలన్ని ప్రస్తుతం కోలాటం చుట్టే పరిభ్రమిస్తున్నాయి. నియోజక వర్గంలో ఈ సాంప్రదాయానికి అంకురార్పణ చేసింది ఓ స్వచ్చంద సంస్థ అయితె,ఆ ధాటికి తట్టుకోలేని రాజకీయ పార్టీలన్ని అదే బాట పట్టాయి. తెలంగాణ జాగృతిలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవహారాలు చక్క బెట్టిన తానిపర్తి తిరుపతి రావు ఆ సంస్థ నుండి బయటికి వచ్చి టీటిఆర్ ఫౌండేషన్ పేరిట స్వచ్చంద సంస్థను ఎర్పాటు చేశాడు. గత 5 నెలల క్రితం ఆయన చేసిన ఓ ప్రయోగం నియోజకవర్గ రాజకియాల్ని శాసించే స్థాయికి చేరుకుంది.ఒకే రకమైన వస్త్రాభరణ ఉండేలా వస్త్రాలను,కోలాటం ఆడే కోలలు,గజ్జేలను ఉచితంగా పంపిణి చేయడం,కోలాటంలో నిష్ణాతులైన గురువులతో ప్రతి గ్రామంలో వీధిల వారిగా బృందాలను ఎర్పర్చి వారికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టడంతో నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు కోలాటం రాజకియాలకు శ్రీకారం చుట్టాయి. గడిచిన 5 నెలల క్రితం ప్రారంభమయిన కోలాట బృందాల ఎర్పాటు ప్రక్రియలో ఎక్కడ వెనక బడి పోతామనే భయంతో అన్ని రాజకీయ పార్టీలు పాలు పంచుకుంటుండడంతో నియోజక వర్గంలో 600 కు పైగా కోలాటం బృందాలు పురుడు పోసుకున్నాయి.గడిచిన దశాబ్ద కాలం నుండి గ్రామీణ రాజకియాలను,ఓటు బ్యాంకును శాసిస్తున్న మహిళా సంఘాలను తలదన్నే రీతిలో పెద్దపల్లి నియోజక వర్గంలో కోలాటం బృందాలు దూసుకెలుతున్నాయి. ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,ఎమ్మెల్సీ భానుప్రసాద రావు,మాజి ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు,గుజ్జుల రామకృష్ణా రెడ్డిలతో పాటు టిఆర్‌ఎస్,కాంగ్రెస్ లలో ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్న అభ్యర్థులు సైతం కోలాటం బృందాలను ప్రసన్నం చేసేకునేందుకు తంటాలు పడుతుంటె,అంతరించి పోతున్న గ్రామీణ జానపద కళకు ఈ విధంగానైనా ప్రాణం పోస్తున్నారని కళాకారులు సంతోష పడుతున్నారు.
6 నెలల్లో వందలకు పైగా బృందాలు
–పెద్దపల్లి శాసనసభా నియోజక వర్గంలో 103 గ్రామపంచాయితీలకు తోడు మరో 50 కి పైగా ఆమ్లెట్ గ్రామాలుండగా,ప్రతి గ్రామంలో కనీసం 2 నుండి 10 వరకు మొదలుకొని 5 నెలల కాలంలో దాదాపు 600 కు పైగా కోలాటం బృందాలు ఎర్పడ్డాయి.ఒక్కో బృందంలో 20 నుండి 40 మంది వరకు సభ్యులు ఉన్నారు.ప్రతి బృందం పూర్తి స్థాయి కోలాటం బృందంగా రూపొందాలంటె,అక్కడి పరిస్థితులను బట్టి 10 రోజుల నుండి నెల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. కోలాటంలో నైపుణ్యం ఉన్న వారు గురువులుగా మారి బృందాలుగా ఎర్పడ్డ వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు కొత్త బృందాలను ఎర్పాటు చేస్తున్నారు. చిన్న పిల్లల నుండి మొదలు కొని 50 సంవత్సరాల వయసున్న స్త్రీల వరకు వయో భేదం లేకుండా ఈ బృందాలలో ఉండడం కొస మెరుపు.
ప్రసన్నం చేసుకునేందుకు పోటీ
–కోలాటం బృందాలను ప్రసన్నం చేసకునేందుకు అధికార,ప్రతిపక్ష నేతలందరు క్యూ కడుతున్నారు. నియోజక వర్గంలోని పలానా గ్రామంలో ఓ రాజకీయ నేత పలాన కోలాటం బృందానికి గజ్జెలు ఇచ్చారని తెలిసిన మరుక్షణమే మరో రాజకీయ నేత వారికి చీరలు పంచుతున్నాడు. నేనేం తక్కువ తిన్నానని మరో నేత వారికి డప్పులు ఇస్తుంటే,ఇంకోఆయన కోలాటం ఆడే కోలలు ఇస్తున్నాడు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు గాని పెద్దపల్లి నియోజక వర్గంలో మాత్రం కోలాటం బృందాల పుణ్యామాని ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంటోంది.
వ్యాపకం కోసం ఇందులో చేరాం: మెట్టు చందన,కొత్తపల్లి.
కోలాటం వినోదాన్ని పంచే కళ అని తాను మాత్రం వ్యాపకం కోసమే ఇందులో చేరానని పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మెట్టు చందన తెలిపారు. మా గ్రామంలో గడిచిన సంవత్సరం నవంబర్ మాసంలో మొదటగా కోలాటం బృందం ఎర్పడగా,ప్రస్తుతం 5 బృందాల వరకు ఉన్నాయని తెలిపారు. తాము ఇప్పటి వరకు పలు సందర్బాలలో గ్రామంలో కోలాటం ప్రదర్శన ఇచ్చామని చందన పేర్కొన్నారు.
సందర్బం ఎదైనా కళకు జీవం పోస్తున్నారు : చాట్ల రవళి
నేతలు కోలాటం బృందాలకు చేస్తున్న సాయంలో అంతర్యం ఎమున్నా కళాభివృద్దికి దోహద పడుతోందని చాట్ల రవళి తెలిపారు. సినిమాలు,టీవీలు,సోషల్ మీడియా ప్రభావంతో అంతరించి పోతున్న ప్రాచీణ జానపద కళలలో కోలాటం ఒకటని,పెద్దపల్లి నియోజక వర్గంలో మాత్రం ఒక విప్లవంలా తెరపైకి రావడం హర్షించ దగ్గ పరిణామమని అమె అన్నారు. తాము ఈ మార్పును రాజకీయ కోణంలో చూడడం లేదని ఇది ఖచ్చితంగా ప్రజలలో కళలల పట్ల వచ్చిన మార్పుకు,నేతలు తోడ్పాటు అందిస్తున్నారని భావిస్తున్నామని తెలిపారు.