Home జాతీయ వార్తలు సిక్కింలో ఓటేసిన 107 ఏళ్ల వృద్ధురాలు

సిక్కింలో ఓటేసిన 107 ఏళ్ల వృద్ధురాలు

Sumitra-Rai

న్యూఢిల్లీ: సిక్కింలోని కమరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉపఎన్నికలో 107 ఏళ్ల వృద్ధురాలు సుమిత్రా రాయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కిం ఓటర్లలో ఈమె అతి పెద్ద వయస్కురాలు. ఓటేయడానికి ముందు ఆమెను ఎన్నికల అధికారులు సన్మానించారు. 10 పోక్‌లోక్ కమరాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వచ్చే కమరాంగ్ పోలింగ్ స్టేషన్‌లో ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో సుమిత్రారాయ్ ఓటేశారని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) తెలిపింది. సిక్కింలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోక్‌లోక్ కమరాంగ్ స్థానం నుంచి సిక్కిం సిఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ పోటీ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. దేశంలో 17 రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 51 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ సీట్లకు సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి.

107 year old woman casts her vote in Sikkim