Wednesday, April 24, 2024

మే చివరి వారంలోనే పది పరీక్షలు

- Advertisement -
- Advertisement -

10th class Exams

 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. లాక్‌డౌన్ సడలించిన తర్వాత పదవ తరగతి పరీక్షల నిర్వహణకు రెండు వారాల సమయం పట్టనుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తరలింపునకు ఈ సమయం అవసరం. దీంతో మే నెల చివరి వారంలోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మే 3 తర్వాత పరిస్థితులను బట్టి మిగిలిన ఇంటర్ పరీక్షలను నిర్వహించి ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు.

ఎంసెట్‌తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు మే 5వ తేదీ వరకు పొడిగించారు. ఎంసెట్ పరీక్ష కేంద్రాల సామర్థ్యం, ఏర్పాట్లకు లాక్‌డౌన్ తర్వాత కనీసం రెండు వారాల సమయం పడుతుంది. హాల్‌టిక్కెట్ల జారీకి మరో వారం కావాలి. దీంతో లాక్‌డౌన్ తర్వాత మూడు వారాల అనంతరమే అంటే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి నెలకొంది.

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ మెయిన్) పరీక్ష మే నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇదివరకే తెలిపింది. ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మే చివరి వారంలో జెఇఇ మెయిన్ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకే ఎన్‌టిఎ ప్రకటించింది.

వర్సిటీలలో ఆన్‌లైన్ పాఠాలు
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసినందువల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ విద్య అందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో 20-30 శాతం పాఠ్యాంశాలు పూర్తి చేయాల్సి ఉండగా.. వీటిని ఆన్‌లైన్‌లో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్నింటిలో దాదాపుగా అకడమిక్ సిలబస్‌పూర్తయింది. పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మే 3 తర్వాత లాక్‌డౌన్‌లో పరిస్థితులను బట్టి వర్సిటీల పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

 

10th class Exams may be in last week of May
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News