Wednesday, April 24, 2024

జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది

- Advertisement -
- Advertisement -

10th class tests

 

పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్‌లు
మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రత్యేక గదు లు ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజర్ లేదా లిక్విడ్ సోప్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు మాస్కులతో వచ్చినా అనుతిస్తామని, వాటర్ బాటిళ్లకు కూడా అనుమతిస్తామని చెప్పారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, ప్రభుత్వ పరీక్ష విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి, అధికారులు రమణకుమార్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు 5,34,903 మంది హాజరవుతున్నారని, ఇందుకోసం 2,530 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

రిజర్వులో ఇన్విజిలేటర్లు..
పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతున్నామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుంపులుగా చేరకుండా ఉండేందుకు ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse. telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, ఇప్పటివరకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని మంత్రి వివరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలలో ఇద్దరు వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లతో సిద్దంగా ఉంచామని అన్నారు.

పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్దం కావాలి..
పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్దం కావాలని, పరీక్షలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థులను కోరారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయంలోనూ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనూ 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ 040 23230942ను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలకు 11,045 పాఠశాలల నుంచి 2,71,971 మంది బాలురు, 2,60,932 మంది బాలికలు మొత్తం 5,34,903 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ పరీక్షా కేంద్రాలకు సరిపడినన్ని మెయిన్, అడిషనల్, గ్రాఫ్ షీట్లు పంపించామని అన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు నాలుగు స్పెషల్ స్కాడ్‌లు, 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించినట్లు చెప్పారు. పరీక్షా సమయంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థుల విషయంలో జిఒ 872, తెలంగాన పబ్లిక్ పరీక్షల చట్టం యాక్ట్ 25/1997 కింద చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని డిఇఒలు విలేకరుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

అన్ని శాఖల సమన్వయంతో పదవ తరగతి పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఎఎన్‌ఎంను, ఒక వర్కర్లను నియమించాలని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కోరారు. అలాగే విద్యార్థులు ఇబ్బంది పడకుండా బస్సులు నడపాలని ఆర్‌టిసిని కోరారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా తగిన చర్కలు తీసుకుంటున్నామని తెలిపారు.

10th class tests from tomorrow
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News