Home ఖమ్మం శివరాత్రి వేళ.. మృత్యుహేళ

శివరాత్రి వేళ.. మృత్యుహేళ

లోకమంతా త్రినేత్రుడి లోక కల్యాణంలో నిమగ్నమై ఉంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మాత్రం విషాదంలో మునిగిపోయాయి. జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పదకొండుమంది చనిపోయారు. పినపాక మండలంలోని చింతలబయ్యారం గోదారిలో పుణ్యస్నానాలకు వెళ్లిన నలుగురు గల్లంతవడం అందరినీ కలచివేసింది. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాలలో స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించడం విషాదం కలిగించింది. అందరూ శివరాత్రి వేడుకల్లో మునిగి ఉంటే.. ఆ కుటుంబాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి.

Swimming

పినపాక: మండలంలోని ఏడూళ్లబ య్యారం పంచాయతీలోని చింతలబయ్యారం గ్రామంలో గల గోదావరి నదికి పండుగ పూట స్నానానికి వెళ్లిన నలు గురు యువకులు మృత్యువాత పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లబయ్యారం, మల్లారం, ఉప్పాక గ్రామాలకు చెందిన నలుగురు యువకులు కలిసి పండుగ పూట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించ డానికి ఉదయం ఏడు గంటల సమయంలో గోదావరి నదీ వద్దకు మరికొంతమందితో కలిసి ట్రాక్టర్‌లో వెళ్లారు.

ఈ క్రమంలో గోదావరి నదిలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు భువనగిరి పవన్(20)నీటిలో మునిగిపో తుండగా గమనించిన మిత్రులు గూదె ప్రేంకుమార్(20), సత్రపల్లి మురళీ(20), అల్లి నాగేంద్రబాబు(21) ముందుగా మునిగిపోతున్న పవన్‌ను కాపాడే ప్రయత్నం చేసి పవన్‌తో పాటూ వీరందరూ నీటిలో మునిగిపోయారు. పక్కనే ఉన్న కొందరు మిత్రులు రాహుల్, గోపి వారిని మృత్యువు నుండి కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేయగా ఉపయోగం లేకుండా పోయింది. దీనిని గమనించిన చుట్టుప్రక్కల ఉన్న భక్తులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు నీటిలో మునిగిన నలుగురిని కాపాడేందుకు నీటిలో దిగారు. అప్పటికే ఆలస్యం కావడంతో వారి మృతిచెంది నీటి అడుగు భాగానికి వెళ్లిపోయారు. సుమారు గజ ఈత గాళ్లు ఐదుగంటల పాటు గాలించి మృతదేహాలను గుర్తించిబయటికి తీశారు.

పండుగ పూట నలుగురు ఒక్కసారిగా మృతిచెందడంతో పక్కనే జరుగుతున్న శివరాత్రికి జాతరకు వచ్చిన భక్తులు తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రతీసంవ త్సరం ఇక్కడే జాతర నిర్వహిస్తారు. ప్రజలు అధిక సంఖ్య లో వస్తుంటారని తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలు, మూడు గ్రామాల్లో కన్నీరు
మున్నీరవుతున్నాయి. ఏడూళ్లబయ్యారం సీఐ అంబటి నర్సయ్య ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలు తెలుసుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ వైద్యులు సుధీర్‌నాయక్, శ్రీధర్‌తో చర్చించి గోదావరి నదిఒడ్డున మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం
మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విషాదంలో కుటుంబాలు…

ఉప్పాక గ్రామానికి చెందిన మల్లయ్య జయలక్ష్మీ దంపతు ల మూడవ కుమారుడు పవన్ ప్రస్తుతం భద్రాచలంలో ప్రైవేటు ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. గత గురువారం సెమిష్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. శివరాత్రిపండుగ సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నానానికి వెళ్లిన కొడుకు తిరిగివస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోతనుమిగిల్చింది.

ఏడూళ్లబయ్యారం పంచాయతీ గొల్లగూడెం గ్రామానికి చెందిన గూదె కృష్ణ పద్మ దంపతుల ఒక కుమారుడైన ప్రేంకుమార్, తండ్రి ఇళ్లు విడిచి వెళ్లగా గత పదేళ్లుగా కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని కుటుంబాన్ని వెల్లదీస్తున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రేం కుమార్ దొరికిన కూలీపనులకు వెళ్తూ తల్లిని పోషిస్తూ, చెల్లిని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. తండ్రి వదిలేయడంతో, కుటుంబానికి ఉన్న ఒక్క దిక్కు కొల్పోవడంతో విధి ఆడిన
ఆటకు అనాథలుగా మిగిలారు. గొల్లబయ్యారానికి చెందిన ఐటీఐ చదువుతున్న మురళీ ఖాళీ సమయాల్లో గ్రామంలోని కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆర్ధికంగా సహాయపడుతుండేవాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే మురళీ మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటూ బంధుమిత్రులు అతని మిత్రులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. మృతుడికి తల్లి జయమ్మ, తండ్రి ప్రసాద్, తమ్ముడు గోపి ఉన్నారు. మల్లారం గ్రామానికి చెందిన అల్లి కృష్ణ రమణల రెండవ కుమారుడు అల్లి నాగేంద్రబాబు ఐటీఐ పూర్తి చేసి ట్రాక్టర్ నడుపుతున్నాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చేతికి అందిన కొడుకు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

పలువురి పరామర్శ…
గోదావరి నదిలో మునిగి మృతిచెందిన యువకుల కుటుంబాలను పలువురు పరామర్శించారు. ఈ నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్ధిక సహాయం క్రింద దహన సంస్కరణల నిమిత్తం ఒక్కో మృతుని కుటుంబానికి నాలుగు వేల చొప్పుల పదహారు వేల ఆర్ధిక సహాయాన్నిఅందజేశారు.

అదేవిధంగా సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు బి అయోధ్య, టీడీపీ జిల్లా అధ్యక్షులు తుళ్లూ రి బ్రహ్మయ్య, పినపాక మండల సీపీఐ నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహరచారి, ఆయా పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు. అదేవిధంగా ఘటన స్థలిని భద్రాచలం ఆర్‌డిఒ శివనారాయణ రెడ్డి చింతల బయ్యారం గ్రామానికి చేరుకుని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఫొటోలను తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.