Saturday, April 20, 2024

మహారాష్ట్రలో వర్షాలకు 113మంది మృతి

- Advertisement -
- Advertisement -

113 Dead in Maharashtra due to heavy Rains

ముంబై: మహారాష్ట్రలో వర్షాకాల ఆరంభం జనజీవితాన్ని దెబ్బతీసింది. కుండపోత వానలు, సంబంధిత ప్రమాదాలతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 113కు చేరింది. ప్రత్యేకించి మహానగరం ముంబై జనం నానా కష్టాలకు గురయ్యారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో పర్యటన జరిపారు. వరద తాకిడితో దెబ్బతిన్నవారిని పరామర్శించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. గడిచిన 24 గంటలలో ఓ వ్యక్తి వరద సంబంధిత ఘటనల్లో మృతి చెందాడని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు. దీనితో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 113కు చేరుకుంది, భారీ వర్షాలు, వరదలు, ఘటనల తీవ్రతను తెలిపింది. ఇప్పటివరకూ 50 మందికి పైగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కొంకణ్ ప్రాంతంలో సిఎం ఉద్ధవ్ కాన్వాయ్‌ను స్థానికులు కొందరు నిలిపివేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, తమను ఆదుకోవాలని సిఎంకు మొరపెట్టుకున్నారు. రత్నగిరి జిల్లాలో సిఎం థాకరే జనంతో, అక్కడి వ్యాపారులు, దుకాణాదారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పూర్తి సాయం అందుతుందని, సాధారణ జనజీవితం నెలకొనేలా చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రానికి కేంద్ర సాయం కూడా అవసరం అని, ప్రత్యేకించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఆదుకోవల్సి ఉంటుందని తెలిపారు.

సోమవారం తాను పశ్చిమ మహారాష్ట్రలో పర్యటిస్తానని, వర్షాలతో జరిగిన నష్టాలపై పూర్తిస్థాయి సమగ్ర నివేదిక రూపొందుతుందని చెప్పారు. ఇక కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రి నారాయణ్ రాణే రాయ్‌గఢ్‌లోని తలియే గ్రామంలో కలియతిరిగారు. ఇక్కడ గురువారం భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు మృతి చెందారు. ఇక్కడి పరిస్థితిపై నివేదిక అందించాలని తనను ప్రధాని మోడీ ఆదేశించారని కేంద్ర మంత్రి విలేకరులకు తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పరిధిలో ఇచ్చే సాయంతో నిర్మిస్తారని కేంద్ర మంత్రి భరోసాకల్పించారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత ప్రవీన్ దారేకర్ ఇతరులు కూడా ఉన్నారు. ఈసారి వర్షాల సంబంధిత ఘటనలలో రాయ్‌గఢ్ జిల్లాలో 52 మంది, రత్నగిరిలో 21 మంది, సతారాలో 13 మంది, థానేలో కొల్లాపూర్‌లో 12 మంది, కొల్లాపూర్‌లో ఏడుగురు మృతి చెందారు. ఇక ముంబై శివార్లలో నలుగురు చనిపొయ్యారు. రాష్ట్రంలో దాదాపు వేయి గ్రామాలు భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్నాయి. పొలాలు ఇప్పటికీ నీటమునిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపొయ్యాయి.

113 Dead in Maharashtra due to heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News