Saturday, April 20, 2024

మద్యం దొరక్క శానిటైజర్ తాగి 12మంది మృతి

- Advertisement -
- Advertisement -

మద్యం దొరక్క మత్తుకోసం.. శానిటైజర్ సేవించి 12 మంది మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
మృతులంతా కురిచేడు వాసులే

12 died after drinking Sanitiser in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో మద్యం దొరక్క పోవడంతో శానిటైజర్ సేవించి గురు, శుక్రవారాల్లో 12 మంది మృతి చెందగా చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో శానిటైజర్ తాగి గురువారం అర్ధరాత్రి ముగ్గురు మరణించగా, శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. కాగా నలుగురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మిగిలిన 8 మంది గ్రామస్తులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కురిచేడులో లాక్‌డౌన్ విధించడంతో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం.

ఇదిలావుండగా కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.లాక్ డౌన్ అమలులో ఉన్నందున మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు పోలీసులు కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే శానిటైజర్ తాగడం వల్ల మృతి చెందారా? లేక నాటుసారా, కల్తీ మద్యం ఏమైనా సేవించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దర్శి ఎంఎల్‌ఎ మద్దిశెట్టి వేణుగోపాల్, ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మృతుల వివరాలు: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కురిచేడులో అధికారులు 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో కొందరు యాచకులు, గ్రామస్తులు మత్తుకోసం శానిటైజర్ సేవించడం అలవాటు చేసుకున్నారు. ఈక్రమంలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు యాచకులు, 8మంది గ్రామస్తులు వెరసి 12 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో అనుగొండ శ్రీనుబో(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు(40), చార్లెస్ (45), అగస్టీన్ (47), ఎస్‌కె సైదా (25)లుగా గుర్తించారు. కాగా మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనపై విచారణ చేపడుతున్నాంః ఎస్‌పి సిద్దార్థ్ కౌశల్
కురిచేడులో విషాదకర ఘటనపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు.. మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్, ఎంఎల్‌ఎ మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంఎల్‌ఎ దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగొద్దని విజ్ఞప్తి చేశారు.

12 died after drinking Sanitiser in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News