Thursday, April 25, 2024

ఇంటిల్లిపాదికి కరోనా

- Advertisement -
- Advertisement -

 ఒకే కుటుంబంలో 12 మందికి వైరస్..  వారిలో తల్లి, కొడుకు మృతి
 వర్షంలోనే గంటలకొద్దీ మృతదేహాలు
 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘటన
 కన్నెత్తి చూడని బంధువులు, బాధిత కుటుంబం పడరాని పాట్లు
 ఎంఎల్‌ఎ, అధికారుల చొరవతో అంత్యక్రియలు

మన తెలంగాణ/నారాయణఖేడ్: కరోనా బారిన పడి మరణిస్తే సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నా ప్రజల్లో అవగాహన రావడం లేదు. సంగారెడ్డి జిల్లా, చెలగి గిద్ద తండాకు చెందిన ఓ కుటుంబం నారాయణఖేడ్ పట్టణంలో చాలా కాలంగా నివాసం ఉంటోంది. ఈ కుటుంబంలోని 12మందికి కరోనా వ్యాధి సోకింది. అందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో ఇద్దరు తల్లి, కుమారుడు మృతి చెందారు. బాధిత కుటుంబం మృతదేహాలను సొంత ఊరు అయిన చలగి గిద్ద తండాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు మృతదేహాలను గ్రామంలోకి తీసుకురావద్దని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక బాధిత కుటుంబసభ్యులు మృతదేహాలను వర్షంలోనే ఉంచాల్సి వచ్చింది. మృతదేహాలు వర్షంలో తడుస్తున్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. బంధువులు కూడా అటువైపు రాలేదు. ఒకే కుటుంబానికి చెందిన 12మందికి కరోనా సోకడం, ఇద్దరు చనిపోవడంతో తండా వాసులు వారిని కలిసేందుకు భయాందోళన చెందారు. ఇదిలా ఉండగా ఇద్దరిని కోల్పియిన బాధిత కుటుంబం వారి అంత్యక్రియలు నిర్వహించడానికి పడరాని పాట్లు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. స్పందించిన అధికారులు మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు నిర్వహించారు, తహసీల్దార్ దసరా సింగ్, ఎస్‌ఐ సందీప్, వైద్యులు రాజేష్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్ నాయక్ తండాకు చేరుకొని దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

12 in Same family test positive for corona in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News