Home ఆఫ్ బీట్ ప్రణాళికతో జేఈఈ సాధ్యం..!

ప్రణాళికతో జేఈఈ సాధ్యం..!

12 lakh candidates across the country are writing JEE Main

దేశవ్యాప్తంగా కనీసం 12 లక్షల మంది పోటీ పడే పరీక్ష జేఈఈ మెయిన్. ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 20 వరకు ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు. దాదాపు పది లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షార్ట్‌టెర్మ్, లాంగ్ టర్మ్ , ఫస్ట్ అటెంప్ట్ ఏదైనా సరే సరైన ప్రణాళిక , కష్టపడే తత్వం ఉంటే ఇందులో విజయం సాధించడం సాధ్యం అంటున్నారు నిపుణులు. 

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర ఇంజనీరింగ్ అండ్ సైన్స్ సంస్థల్లో ప్రవేశం కోసం ఇంటర్ పూర్తిచేసినవారు రాయాల్సిన పరీక్ష జేఈఈ మెయిన్. దీంట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులు దాదాపు 2.24 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాస్తారు. దాంట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా వారు ఐఐటీల్లో చేరతారన్నమాట. మెయిన్‌లో వచ్చిన ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశం దొరుకుతుంది. కొన్ని రాష్ట్రాలు మెయిన్ ర్యాంకు ఆధారంగా చేసుకుని స్టేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనైతే ఎంసెట్‌తో ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏటా సీబీఎస్‌ఈ నిర్వహించే జేఈఈ పరీక్షను ఈ ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఏడాదికి రెండు సార్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో షిఫ్టుల వారీగా నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. పరీక్షావిధానం, సిలబస్‌లో అయితే మార్పులేదు. కానీ జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు నిర్వహించడం వల్ల మొదటి రాసే విద్యార్థులకు కీలకంగా మారింది. ఇటువైపు అకడమిక్ పరీక్షలు, అటు ఎంట్రన్స్ టెస్ట్‌లు ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒత్తిడికి గురవకుండా రెండిట్లోనూ విజయం సాధించాలంటే చక్కని ప్రణాళిక అవసరం.

రెండ్లుసార్లు ఎందుకంటే…. ఒకే ఏడాదిలో రెండుసార్లు పరీక్ష రాసుకునే అవకాశం విద్యార్థులకు ఉండటంతో ఎంతో ప్రయోజనం ఉంది. అవేమంటే మంచి మార్కులు రాకున్నట్లయితే అకడమిక్ ఇయర్ వృథా అవుతుందనే బెంగ అక్కర్లేదు. మరోసారి జరిగే పరీక్షలో స్కోర్ పెంచుకోవచ్చు. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

సమాధానాలు మార్చుకోవచ్చు… ఆన్‌లైన్ పరీక్ష కాబట్టి ఎన్ని సార్లయినా సమాధానాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పు పెట్టామనే ఆందోళన అనవసరం. సమాధానాలు బబుల్ చేయాల్సిన పనిలేకపోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. కాకుంటే ఆన్‌లైన్ పరీక్షా విధానం అలవాటుకావాలంటే అభ్యర్థి ఎక్కువసార్లు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. సమాధానాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. ఆన్సర్లు సేవ్ అయ్యేలా చూసుకోవాలి. ఇవన్నీ అభ్యాసంతోనే వస్తాయి.

మెరిట్ ఉంటే నార్మలైజేషన్… అంటే ఆయా సెషన్స్‌లో వచ్చిన టాప్ మార్కులను వంద శాతంగా పరిగణిస్తారు. అభ్యర్థి పర్సెంటైల్‌లను వందగా లెక్కిస్తారు.దీని ఆధారంగా ఆ సెషన్‌లోని తర్వాతి అభ్యర్థుల పర్సెంటైల్‌ను నిర్ణయిస్తారు. జేఈఈ మెయిన్‌ను వేర్వేరు తేదీల్లో వివిధ షిఫ్టులో నిర్వహిస్తారు కనుక అన్ని ప్రశ్నాపత్రాల్లో సమతూకం పాటించడం సాధ్యం కాదు. అందుకే ఎన్‌టీఏ మెరిట్ లిస్ట్ తయారీలో నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తుంది.

అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే…. పరీక్ష రాసిన ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే ఎలా అనే సందేహం అభ్యర్థుల్లో కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గణితంలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టును తయారుచేస్తారు. ఒకవేళ దాంట్లోనూ సమానం వస్తే, ఫిజిక్స్ చూస్తారు. అదీ కాకుంటే కెమిస్ట్రీ ఇలా బేరీజు వేసుకుంటారు. అనంతరం వయసును కూడా లెక్కలోకి తీసుకుంటారు. చివరికి ఏదీ కుదరకపోతే ఇద్దరికీ ఒకే ర్యాంకును కేటాయిస్తారన్నమాట.

ప్రాక్టీస్ ఉచితం… జేఈఈ మెయిన్ పరీక్షను ఈ ఏడాది నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అభ్యాసం ముఖ్యం. ఇందుకోసం ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా 2700 స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలతో నేషనల్ టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కేంద్రాల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు , వారాంతంలో 10 నుంచి 4 వరకు ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివరాలకు www.nta.ac.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

12 lakh candidates across the country are writing JEE Main

Telangana Latest News