Tuesday, April 23, 2024

సాకారం అవుతున్న సాగునీటి కల

- Advertisement -
- Advertisement -

1200 check dams to built with Rs 3825 cr in Telangana

రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ నీటితో పరవళ్ళు తొక్కుతున్నాయి. నీళ్లన్నీ బీళ్లలోకి ఇంకుతున్నాయి. త్వరలోనే కోటి ఎకరాలకు సాగునీరు అందనుంది. దీని కోసమే ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కలలు ఒక్కటొక్కటిగా నెరవేరనున్నాయి. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం వేగవంతం చేసి, నిధులు కేటాయించింది. ప్రభుత్వ కృషి వల్ల ఆయకట్టుకు నీరందింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందుతున్నది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ నాలుగు ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేసుకోవడం వల్ల పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం బీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయగా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 600, వచ్చే ఏడాదిలో మిగిలిన వాటి నిర్మాణాన్ని పూర్తిచేయాలని తలపెట్టింది. రాష్ట్రం ఏర్పడ్డాక 146 చెక్‌డ్యాంలు మంజూరు చేశారు. అందులో 53 పూర్తికాగా, మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని వాగులు, వంకల్లో సుమారు 15 టిఎంసిల నీటిని నిల్వ చేసి, మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.అలాగే కాల్వల్లో తూముల నిర్మాణం కోసం రూ.471 కోట్లును వెచ్చిస్తోంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కాల్వ ల్లో 3 వేల తూముల (ఓటీ) నిర్మాణం చేపట్టగా, అందులో 70 శాతం పనులు పూర్తయ్యాయి.
గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఒకవైపు మహా యజ్ఞం కొనసాగుతుండగా, మరోవైపు ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలోనే దాదాపు ఎనభై శాతం వరకు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ నీళ్ళు కొండపొచమ్మ సాగర్‌కు కూడా చేరుకున్నాయి. ఇక అక్కడి నుంచి ఆ నీటిని చెరువులను నింపాల్సి ఉంది. అలాగే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి అవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాజెక్టుల నిర్మాణాన్ని గత పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మిడ్ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కొమురంభీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్ పూర్ తదితర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీంట్లో భాగంగా కోయిల్ సాగర్, కిన్నెరసాని, మత్తడివాడు తదితర ప్రాజెక్టులను పూర్తిచేసింది. చనఖా-కొరటా ప్రాజెక్టు, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజీ, మల్కాపూర్ రిజర్వాయర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వట్టిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు పునరుజ్జీవం కలిగించే పథకాన్ని కూడా చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు, నిరంతర నీటి లభ్యత కోసం గోదావరిపై తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బ్యారేజీని కూడా నిర్మిస్తున్నది. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు , జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాలను 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి కరువు ప్రాంతాలకు సాగునేరు అందిస్తోంది. రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టగా అందులో అలీసాగర్, గుత్ప, గడ్డెన్నవాగు, భక్త రామదాసు, కోయిల్ సాగర్, మత్తడివాగు, చౌట్ పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, రాలివాగు, కిన్నెరసాని, బాగారెడ్డి సింగూరు కెనాల్స్, గొల్లవాగు, నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దీంతో 35.11 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌ఎస్‌పి..2 దేవాదుల, కల్వకుర్తి, బీమా ఎత్తిపోతల, నెట్టెంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి, వరదకాల్వ, కొమురం బీం, నీల్వాయి, పాలెం తదితర ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.80 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు రాష్ట్రంలో 2020 నాటికి 80 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతున్నది. అన్నిప్రాజెక్టులు పూర్తయితే 53.02 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 25.93 లక్షల ఎకరాలకు స్థిరీకరణ సాధ్యంకానుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ని చేపట్టింది. దక్షిణ తెలంగాణకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ప్రాణహిత ప్రాజెక్టు, చనాఖా కొరాట ప్రాజెక్టుల ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం అప్పటి ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆర్భాటంగా చేపట్టి, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేసింది. అక్కడ నీటి లభ్యత కోసం ఎలాంటి బ్యారేజీని నిర్మించలేదు. దీంతో అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు, నిరంతర నీటి లభ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం కంతనపల్లి వద్ద గోదావరిపై తుపాకులగూడెం వద్ద రూ.2,121 కోట్లతో తుపాకులగూడం బ్యారేజీని నిర్మిస్తున్నది. దీంతో 365 రోజులూ దేవాదుల వద్ద నీటి నిల్వ ఉంటుంది. ఈ క్రమంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని వరంగల్ జిల్లాకు డెడికేటెడ్ ప్రాజెక్టుగా మారుస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే పలు రిజర్వాయర్ లు ప్రారంభించిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో చారిత్రాత్మకమైన కొండ పోచమ్మ రిజర్వాయర్‌ను గత మే నెల 29వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌజ్‌లో మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించారు.కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా ఇప్పటికే ఉన్న వరదకాల్వను మరింత బలోపేతం చేసి.. దానిని జలాశయంగా మార్చి మొత్తం శ్రీరాంసాగర్ ఆయకట్టును, ఆరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుకు ఒకేసారి రూ. 2 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్.. రైతుల్లో సంతోషాన్ని నింపారు. కాళేశ్వరం వరదకాలువతో ఈ ప్రాజెక్టును నింపడం వల్ల సాగు, తాగునీటికి కొరత ఉండదని, రెండు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఎస్సారెస్పీ వరదకాల్వ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర మొదలై మిడ్ మానేరు ప్రాజెక్టు వరకు ఉంటుంది. దీని పొడవు 123 కిలోమీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సా రెస్పీలోకి నీరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. రివర్స్ పంపింగ్ తో ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తారు. దీనిలో రెండు టీఎంసీల నీటిని ఎస్‌ఆర్‌ఎస్‌పి వరద కాలువ 99వ కిలోమీటర్ దగ్గర పోస్తారు. ఇవి మిడ్ మానేరు ప్రాజెక్టుకు చేరతాయి. ఇందులో ఒక టీఎంసీ నీటిని మిడ్ మానేరుకు వదిలి, ఇంకో టీఎంసీని పైకి తీసుకుపోతారు. మూడు దశలలో రివర్స్ పంపింగ్ తో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పంపించేలా డిజైన్ చేశారు. రూ. 2 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. మూడు దశల లిఫ్టులకు 156 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుండగా 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 పంపులు ఏర్పాటు చేస్తారు. రివర్స్ పంపింగ్ తో పైకిపంపే నీళ్లతోపాటు.. వరద కాలువలనే ఒకటిన్నర టీఎంసీలదాకా నీళ్లు నిల్వ ఉంటాయి. ఈ కాల్వ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. దీంతో వరద ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు లిఫ్టు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో అనుసంధానించిన ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జీవనాడిగా.. ప్రగతి రేఖగా భాసిల్లుతుంది. ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటున్న తరుణంలో సిఎం కెసిఆర్ కన్న కలలు సైతం ఒక్కటొక్కటిగా నెరవుతున్నాయి. నాతెలంగాణ కోటిరత్నాల సీమ ఆనాటి నినాదం కాగా నాతెలంగాణ కోటి ఎకరాల మాగాణని అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయితేప్రకటినలకే పరిమితంకాకుండా క్షేత్రస్థాయిలో సాకరం అవుతూ బంగారు తెలంగాణ దిశగా సాగునీటి రంగం దూసుకుపోతుంది.

1200 check dams to built with Rs 3825 cr in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News