Home తాజా వార్తలు రాష్ట్రంలో మరి 127 కేసులు

రాష్ట్రంలో మరి 127 కేసులు

127 New Corona Cases Reported in Telangana

 

మరో 127 కేసులు నమోదు.. ఆరుగురు మృతి
జిహెచ్‌ఎంసిలో 110, జిల్లాల్లో 17 మందికి వైరస్
3147కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య
రాష్ట్రంలో 48 మంది వైద్యులకు కరోనా
గాంధీలో గర్బిణీ మరణంపై స్పందించిన అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. కొత్తగా 127 కేసులు నమోదు కాగా, ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. దీనిలో జిహెచ్‌ఎంసిలో 110, రంగారెడ్డి 6, ఆదిలాబాద్ 7, మేడ్చల్ 2, సంగారెడ్డి 1, ఖమ్మంలో మరోకరికి వైరస్ నిర్ధారణ అయింది. అదే విధంగా వైరస్ బారిన పడి మరో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే మరణించిన వారి పూర్తి వివరాలు బులిటెన్‌లో పేర్కొనలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల 3147కి చేరగా, వీటిలో రాష్ట్రానికి చెందిన కేసులు 2699, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు.

ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1587 మంది ఇళ్లకు చేరగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 1455 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 105 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే కోవిడ్ పోరులో ముందు వరుసలో పనిచేస్తున్న వైద్యులకు వైరస్ సోకడం ఆందోళనకరం. ఇప్పటి వరకు 48 మంది డాక్టర్లకు వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా యాదాద్రి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది.

ఇతను ఇటివల హైదరాబాద్ నగరానికి వచ్చి తిరిగివెళ్లినట్లు సమాచారం. దీంతో పాటు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి వైరస్ తేలింది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఓ పత్రికా రిపోర్టర్‌కి వైరస్ సోకినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అదే విధంగా ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు కరోనా బాధితులు చనిపోయినట్లు తెలిసింది. రాంనగర్ మధుసూదన్‌రెడ్డి అనే మరో వ్యక్తి కరోనాతో చనిపోయారు. అతని ఇంట్లో మరో ముగ్గురు వ్యక్తులకూ కరోనా ఉందని అధికారులు తెలిపారు.

గర్బిణీ మరణంపై స్పందించిన అధికారులు
గాంధీ ఆసుపత్రిలో చనిపోయిన గర్బిణీ స్త్రీ మృతిపై ఆసుపత్రి సూపరింటెండెండ్ వివరణ ఇచ్చారు. ఆమె మృతిపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన కొట్టిపరేశారు. ఆమె మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయడం బాధకరంగా ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. వర్షసింగ్ విషయంలో ఎలాంటి నిర్లక్షం జరగలేదని ఆయన తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఆమె గాంధీకి వచ్చారని, రాగానే వెంటనే ఐసియూలో ఉంచి వైద్యం అందించామని గాంధీ సూపరింటెండెంట్ డా రాజారావు తెలిపారు. ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని డిపార్ట్‌మెంట్ల వైద్యులు కృషి చేశారని అన్నారు. వర్ష పరిస్థితిని ఆమె భర్త సంజయ్‌తో పాటు కుటుంబ సభ్యులకూ వివరించామన్నారు. ఆమెపై వైరస్ ప్రభావం అప్పటికే ఎక్కువగా ఉండటం వలనే చనిపోయినట్లు ఆయన తెలిపారు.

వైద్యులపై వైరస్ పంజా… 48కి చేరుకున్న బాధితుల సంఖ్య
కరోనా వైరస్ వైద్యులపై పంజా విసురుతోంది. ఇప్పటి వరకు(గురువారం రాత్రి 8 గంటల వరకు) 48 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. గురువారం ఒక్క రోజే నిమ్స్ ఆసుపత్రిలో ఏకంగా 6 మంది సిబ్బందికి వైరస్ సోకడం కలకలం రేపుతుంది. ఒక ప్రోఫెసర్, ముగ్గురు వైద్యులు, ఒక రోగితో పాటు మరోక ఆసుపత్రి సిబ్బంది వైరస్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. మిగతా వారు గాంధీ, ఉస్మానియా పరిధికి చెందిన ఆసుపత్రుల నుంచి కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు.

బుధవారం వరకు 34 మంది బాధితులు ఉండగా ఆ సంఖ్య ప్రస్తుతం 48కి చేరుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులతో డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి జూనియర్ వైద్యుల రక్షణ కొరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేగాక డిఎంఇ కూడా వివిధ ఆసుపత్రుల జూడాలతో మాట్లాడి భరోసా కల్పించినట్లు సమాచారం. జిహెచ్‌ఎంసి పరిధిలోని టీచింగ్ ఆసుపత్రులకు డిఎంఇ డా రమేష్‌రెడ్డి వైద్యుల రక్షణ కొరకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నామంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

127 New Corona Cases Reported in Telangana