Home జాతీయ వార్తలు గోరఖ్ పూర్ లో ఘోర ప్రమాదం

గోరఖ్ పూర్ లో ఘోర ప్రమాదం

13 Children Dead In UP Bus Accident

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు 

గోరఖ్‌పూర్/న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని ఖుషినగర్ ప్రాంతంలో ఓ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో మరో 8 మంది చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. రైలు వేగంగా ఢీకొనడంతో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయింది. చిన్నారుల మృత దేహాలు ఛిద్రమై పోయాయి. మృతులంతా 7 నుంచి 11 ఏళ్ల వయసున్న వారే. డివైన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు పాఠశాల బస్సులో వెళ్తుండగా బెహ్‌పూర్వలోని మానవ రహిత రైల్వే గేటు వద్ద సివాన్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తున్న తవె కపటన్‌గంజ్ ప్యాసింజర్ రైలు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో చిన్నారులతో పాటు మొత్తం 25 మంది ప్రయాణికులు వ్యాన్‌లో ఉన్నారు. అయితే మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న గేట్ మిత్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఓ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ప్రమాద అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. ఆ తరువాత ఆయన ఖుషినగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిఎం విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం సమయంలో వ్యాన్ డ్రైవర్ చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోందని, అయితే దర్యాప్తు అనంతరం నిజా నిజాలు బయట పడుతాయన్నారు. మృతుల పట్ల సంతాపం తెలియజేస్తూ ఒక్కొక్కరి చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు చిన్నారులను, వ్యాన్ డ్రైవర్‌ను గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి మెడికల్ కాలేజీకి తరలించనున్నారని, ఇంకా అవసరమైతే స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా తరలించినట్లు ఆయన చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సిఎం ఉద్ఘాటించారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరి చొప్పున రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. విద్యార్థుల మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ప్రమాదంలో బాలిక మృతి
ఇదిలా ఉండగా, వాయువ్య ఢిల్లీలోని కన్హయ్య నగర్ మెట్రో పోలీస్‌స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారు జామున పాలవ్యాన్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక మృతి చెందడంతో పాటు 17 మంది విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేశవపుంలోని రెండు స్కూళ్లను బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించిందని, అయిన రెండవ వాహనాల డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. చనిపోయిన బాలికను గర్మిగా గుర్తించామని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.