Thursday, March 28, 2024

నాగాలాండ్‌లో దారుణం: జవాన్ల కాల్పులు.. 13మంది పౌరులు మృతి

- Advertisement -
- Advertisement -

13 Civilians killed after jawans firing in Nagaland

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో దారుణం.. పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు
13 మంది పౌరులు మృతి, గ్రామస్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాను
మోన్ జిల్లాలో ఉద్రిక్తత, ఇంటర్‌నెట్ నిలిపి వేత
ఘటనపై ఉన్నతస్థాయి సిట్ దర్యాప్తుకు ముఖ్యమంత్రి రియో ఆదేశం
బాధ్యులను శిక్షిస్తామని సైన్యం ప్రకటన

కోహిమా: నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి ఆర్మీ జవాన్లు సామాన్య పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది పౌరులు చనిపోగా, గ్రామస్థులు జరిపిన దాడిలో ఒకసైనికుడు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు కథనం ప్రకారం కాల్పుల ఘటన మోన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓటింగ్, తిరు గ్రామాల మధ్య శనివారం రాత్రి జరిగింది. కాగా ఓటింగ్ గ్రామంలోని ఓ బొగ్గు గనిలో పని చేస్తున్న కొంతమంది దినసరి కూలీలు శనివారం సాయంత్రం తమ పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనంపై అస్సాం రైఫిల్స్ జవాన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సులోని13 మంది సామాన్య పౌరులు బస్సులోనే విగత జీవులుగా మారారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, ఇద్దరి జాడ తెలియడం లేదు. గాయపడిన వారిని మోన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఓటింగ్ గ్రామ పరిధిలో అస్సాం రైఫిల్స్ దళాలు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎన్‌ఎస్‌సిఎన్(కె) అంగ్, ఉల్ఫా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలో బస్సులో ఉన్న వారు మిలిటెంట్లు అనుకొని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

కాల్పుల ఘటన వెలుగు చూడడంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. తమ వారు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసిన వారు ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిపై, వారి వాహనాలపైన దాడి చేశారు. మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో ఒక ఒక భద్రతా జవాను మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం మోన్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి వివాదాస్పద సందేశాలు వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కాల్పులు జరిగిన ప్రదేశంలో హింసాత్మక ఘటనలు జరక్కుండా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాల్పుల ఘటనను నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో తీవ్రంగా ఖండించారు. ఓటింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో పౌరులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. దీనిపై ఉన్నతస్థాయి సిట్ దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. అసోంలోని నాగోన్ లోక్‌సభ సభ్యుడు ప్రద్యుత్ బోర్డులోయ్ ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను ట్వీట్ చేశారు.
విశ్వసనీయ సమాచారంతోనే ఆపరేషన్: అస్సాం రైఫిల్స్
కాగా, ఈ ఘటనపై ఆర్మీ 3 కోర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన సమాచారం లభించడంతోనే తాము ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విచారణ చేపట్టి బాధ్యులను చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపింది. ఈ ఘటన అనంతరం పరిణామాల్లో ఒక జవాను మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు తెలిపింది. సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎన్‌ఎన్ నరవణేలకు వివరించినట్లు అధికార వర్గాలు తెలిపారు.

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో స్పందించారు. ‘మోన్ జిల్లా ఓటింగ్ వద్ద జరిగిన ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సిట్ ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతుంది’ అని పేర్కొన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా కూడా ఓటింగ్ ఘటనపై స్పందిస్తూ మృతులకు సంతాసం తెలియజేశారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా ఈ సంఘటనకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక ఉత్సవం అయిన హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరించాలని ఆరు గిరిజన తెగలను ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఇఎన్‌పిఓ) పిలుపునిచ్చింది. రాష్ట్ర రాజధాని కోహిమా సమీపంలోని కిసమా వద్ద ఉత్సవ వేదిక అయిన నాగా హెరిటేజ్ విలేజ్‌లో తమ గుడారాలపై నల్ల జెండాలను ఎగురవేయాలని ఆ సంస్థ ఈ గిరిజన తెగలకు పిలుపునిచ్చింది.

13 Civilians killed after jawans firing in Nagaland

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News