Home తాజా వార్తలు పసిపాపకు ఎంత కష్టమెచ్చింది

పసిపాపకు ఎంత కష్టమెచ్చింది

14-month-old baby struggling with rare genetic disease
శ్వాస అందదు, శరీరంలో కదలికలు లేవు,  అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతోన్న 14నెలల పాప,  పాప బ్రతకాలంటే 16 కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్ అవసరం,  ఆదుకోవడానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు రావాలని తల్లిదండ్రుల వినతి

మన తెలంగాణ/దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్, స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వీరికి 2018 సంవత్సరంలో వివాహం కాగా ప్రస్తుతం వారికి 14నెలల పసిపాప ఉంది. బోసి నవ్వులతో చలాకీగా ఉండే పసిపాపకు వేలల్లో ఒక్కరికి వచ్చే అరుదైన జన్యుపరమైన వ్యాధితో ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. పుట్టిన నాలుగు నెలలకే మెడభాగం పటిష్టంగా లేక వాలిపోవడాన్ని పాప తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా పాప శరీర భాగాలల్లో కదలికలు లేవు. దీంతో పాప తల్లిదండ్రుల గుండెల్లో కంగారు మొదలైంది. దీంతో పాప తల్లిదండ్రులు విజయవాడలోని పిడియాట్రిక్ న్యూరాలజీ ఆసుపత్రికి పాపను తీసుకెళ్లారు. పాపకు ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులకు పసిపాప ఆరోగ్య పరిస్థితి అంతుచిక్కలేదు. వెంటనే జన్యుపరమైన సమస్యగా అనుమానిస్తూ రూ.40వేలతో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అప్పటికీ పాపకు ఉన్న సమస్య బయటపడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్నారి ఇంకా కదలలేకుండా ఉంది. తెలిసిన వారి సలహా మేరకు చిన్నారి తల్లిదండ్రులు చెన్నయ్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజికి పాపను తీసుకెళ్లారు. అక్కడ పాపకు జన్యు సంబంధమైన వైద్య పరీక్షలు గతేడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించగా ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిపోర్ట్‌లు వచ్చాయి. పసిపాప ఎల్లెన్‌కు జన్యుపరమైన సంబంధిత వ్యాధి ఉందని, నరాలు, కండరాలు బలహీనం అయ్యాయని, పరీక్షల రిపోర్ట్‌ల ద్వారా తెలిసింది. వైద్య సేవలు అందించకపోతే పాప భవిష్యత్ మనం ఊహించలేమని వైద్యులు తెలియజేశారు. శక్తికి మించిన ఆర్థిక భారం ఆ నిరుపేద కుటుంబంపై పడింది. ఇదిలా ఉంటే ఎల్లెన్ నిద్రిస్తున్న సమయంలో శ్వాస అందక ఉక్కిరి, బిక్కిరి కావడంతో వెంటనే పాప తల్లిదండ్రులు రాత్రికి రాత్రే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే వైద్యం అందించాలని వైద్యులు ఆక్సీజన్ పెట్టి ఊపిరి అందిస్తున్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి ఆక్సీజన్ ద్వారానే ఊపిరి పీల్చుకుంటుంది.

రోజుకి రూ.30వేలకు పైగా పాప వైద్యానికి ఖర్చు అవుతుందని పాప తల్లిదండ్రులు తెలుపుతున్నారు. పాపను బ్రతికించాలంటే రూ.16 కోట్ల విలువ గల ఇంజక్షన్ అవసరమని, మా లాంటి నిరుపేద కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత ఎక్కడదని పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా చిట్టితల్లిని బ్రతికించడానికి పలువురు దాతలు చేతనైనా సాయం అందిస్తున్నా కూడా అవి ఏమి కూడా ఆ ఇంజక్షన్ ఖరీదుకు సరిపోయేలా లేదని వాపోతున్నారు. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబం ఇప్పుటికే పాప వైద్యం నిమిత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పసిపాపను కాపాడాటానికి పలువురు దాతలు ముందుకొచ్చి 9908589604 నెంబర్‌కు సాయం చేయాలన్నారు. కోట్ల రూపాయల డబ్బులు సమకూరాలంటే మానవత్వంతో ముందుకు వస్తే తప్పా రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ పాపకు అందించే అవకాశం ఉంది. ఏది ఏమైనా చిట్టితల్లిని రక్షించేందుకు రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ సమకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను అందించాలనీ మండల ప్రజలు కోరుకుంటున్నారు.