38కు చేరిన కేసుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 259 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు రాష్ట్రానికి రాగా, వారిలో 63 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 38 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలగా.. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,074కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,017కు చేరింది. తాజాగా 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,831 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సిరిసిల్లలో ఒమిక్రాన్ బాధితుని తల్లి, భార్యకు కొవిడ్ పాజిటివ్
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం గూడెం గ్రామంలో ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా,అతనిని హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అతని భార్య, తల్లికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే, వారిలో ఒమిక్రాన్ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. వారి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపనున్నట్టు చెప్పారు. గ్రామాన్ని సందర్శించి బాధితులకు మనోధైర్యం కల్పించినట్టు అధికారులు సంజీవరెడ్డి తెలిపారు.