Home ఎడిటోరియల్ పడగ నీడ బతుకులు!

పడగ నీడ బతుకులు!

Sampadakiyam    దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఎంత వైభవంగా ఉంటుందో అక్కడ సామాన్యుల బతుకులు అంత దుర్భరంగానూ ఉంటాయి. తల దాచుకోడానికి చోటు లేక అనునిత్యం చావు పై కప్పు కింద జీవించేవారు అసంఖ్యాకంగా ఉంటారు. రద్దీ ప్రాంతాల్లో కాళ్లు గట్టిగా చాపుకోడానిక్కూడా వీలులేని ఇరుకు జీవితాలు జీవిస్తుంటారు. అటువంటి వందేళ్ల నాటి ఒక పాడు పడిన నాలుగంతస్థుల భవనం కుప్పకూలిపోయి మంగళవారం నాడు ఆ మహానగరంలో 14 మంది మరణించారు. కొన్ని పదుల మంది గాయపడ్డారు. ఈ దారుణోదంతం దేశంలో, ముఖ్యంగా అత్యంత జన సమ్మర్థం కలిగిన నగరాల్లో పేద, కింది మధ్య తరగతి ప్రజల దయనీయ స్థితిని చాటుతున్నది. వయసు మీరిన భవనాలకు సకాలంలో మరమ్మత్తులు చేయించడం, కూల్చివేసి కొత్తవి కట్టడం ప్రభుత్వాల, పుర పాలక యంత్రాంగాల బాధ్యత అయినప్పటికీ ఆ మేరకు చట్టాలున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో పాలకుల వైఫల్యం అంతా ఇంతా కాదు.

ఈ కారణంగానే నగరాల్లో పేదలు నిరంతరం పడగ నీడన బతకక తప్పని స్థితిని సృష్టిస్తున్నది. దక్షిణ ముంబైలోని అత్యంత కిక్కిరిసిన ప్రదేశమైన డోంగ్రీ ప్రాంతంలో మంగళవారం నాడు ఉన్న పళంగా కూలిపోయిన భవనంలో దిగువ మధ్యతరగతికి చెందిన 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా ఆ పరిసరాల్లో చిన్న చితక పని పాట్లు చేసుకుంటున్నవారే. పని స్థలాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటివన్నీ అక్కడే ఉన్నందున వారు మరొక చోటికి పోయే సాహసం చేయలేక, అందుకవసరమైన ఆర్థిక స్థోమత కొరవడి ఈ భవనంలో కొనసాగుతూ వచ్చారు. కూల్చివేయదగ్గ భవనమని దీనిని చాలా కాలం క్రితమే గుర్తించినా అధికార్లు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కాలదోషం పట్టిన భవనాలు వర్షాకాలంలో తడిసి పునాదుల్లోకి కూడా నీరు చేరి కుప్పకూలిపోడం కొత్తేమీ కాదు. పలు నగరాల్లో ఇటువంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

ముంబై నగరంలో 16,000 పాత భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని అది తెలిసి కూడా అందులోని వారు వాటిని ఖాళీ చేయడంలేదని 2017లోనే గుర్తించారు. 2013 ఏప్రిల్, జూన్ మధ్య అతి స్వల్ప కాలంలోనే ముంబైలో భవనాలు కూలిపోడం వల్ల 100 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్న 103 భననాలు శిథిలావస్థలో ఉన్నాయని గత ఏడాది జులైలోనే ఆ జిల్లా ప్రాథమిక విద్యా శాఖ నివేదిక తయారు చేసింది. తరచి చూస్తే దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో, పట్టణాల్లో అతి పురాతన శిథిల భవనాలు దర్శనమిస్తాయి. ప్రాథమికంగా ప్రభుత్వ పర్యవేక్షక బృందాల అలసత్వం వల్ల ఈ భవనాలు మృత్యు కుహరాలుగా మారిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ముంబై వంటి మహా నగరాల్లో అద్దెలు అపరిమితంగా పెరిగిపోయి మామూలు జనానికి బొత్తిగా అందుబాటులో లేకపోడం వల్ల శిథిల భవనాల్లోనే బతకాల్సిన పరిస్థితి తల ఎత్తుతున్నది.

భారత రాజ్యాంగం 21వ అధికరణ దేశంలోని ప్రతి ఒక్కరికీ జీవన హక్కును ప్రసాదిస్తున్నది. గౌరవానికి భంగం, విఘాతం కలుగని రీతిలో జీవించే హక్కు ఇందులో ఇమిడి ఉన్నది. తగినంత సురక్షితమైన నివాస వసతి కలిగి ఉండడం కూడా ఇందులో భాగమే. 2011 జనాభా లెకల ప్రకారం దేశంలో 17 లక్షల 70 వేల మంది తల దాచుకొనే గూడులేని వారున్నారు. కోటి 80 లక్షల మంది వీధి బాలలున్నారు. వీరంతా చెట్ల కింద, పేవ్‌మెంట్ల మీద గడుపుతున్న వారే. వీరు కాక ప్రమాదకర పరిస్థితుల్లోని ఇళ్లలో, భవనాల్లో గత్యంతరం లేక బతుకుతున్న వారు అసంఖ్యాకంగా ఉన్నారు. ఎప్పుడు ఏ నిప్పు రవ్వ తాకి అగ్నికి ఆహుతి అవుతాయో తెలీని తాటాకు గుడిసెల్లో జీవిస్తున్నవారు, రేకుల షెడ్లలో కాలం వెళ్లబుచ్చుతున్న వారు లెక్కలేనంత మంది. వీరందరి గృహావసరాలు తీరడం అసాధ్యమని అసాధారణంగా పెరిగిపోతున్న భూముల ధరలు నిరూపిస్తున్నాయి. మురికి వాడలు పరంపరగా నెలకొనడానికి ఇదే ప్రధాన కారణం.

వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా అత్యంత శిథిలావస్థలోని పురాతన భవనాలను కూల్చి కొత్తవాటిని నిర్మించి ఇచ్చే ఏర్పాటు తగినంతగా లేకపోడమే బాధాకరం. పేదల గృహ నిర్మాణానికి పలు పథకాలున్నప్పటికీ అవి వారి పని స్థలాలకు చేరువలో లేకపోడం వల్ల వాటి నుంచి ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. నగరం నడిబొడ్డులో నివసిస్తున్న పేదలకు శివార్లలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించినా వారు అక్కడికి వెళ్లకపోడానికి, వెళ్లినా అమ్ముకొని తిరిగి నగరం మధ్యలోకి వచ్చి స్థిరపడుతూ ఉండడానికి జీవనోపాధి అవసరాలే కారణం. ఇటువంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మృత్యు నీడ వంటి నివాసాల్లో బతుకుతున్న వారికి పటిష్ఠమైన ప్రత్యామ్నాయ ఆవాసాలు కల్పించడానికి జాతీయ స్థాయిలో గట్టి కృషి జరగాలి.

14 people died in Mumbai Building Collapse