న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. కొద్దికాలంగా రోజుకు 12 వేల లోపు కేసులు నమోదవుతుండగా, నాలుగు రోజుల నుంచి 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య కోటీ 10 లక్షలకు చేరుకుంది. గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా 14,264 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,09,91,651కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు కరోనా నుంచి 1,06,89,715 కోలుకోగా, 1,56,302 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 1,45,634 మంది కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గడిచిన ఒక్కరోజులో కొత్తగా 11,667 మంది కరోనా నుంచి కోలుకోగా, 90 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 1,10,85,173 మందికి కరోనా టీకాలు వేశారు. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. శనివారం మహారాష్ట్రలో 6281, కేరళలో 4650, కర్ణాటకలో 490, పంజాబ్ 352, ఛత్తీస్‌గఢ్ 263, మధ్యప్రదేశ్ 257 కేసుల చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చి చెప్పారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా ఆరు గజాల భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరుతున్నారు.