Tuesday, April 16, 2024

కరోనా కోరల్లో చిన్నారులు!

- Advertisement -
- Advertisement -

15 crore india children in poverty

కోవిడ్ 19 మహమ్మారి మిగతా వారిని ప్రత్యక్షంగా ఇబ్బంది పెడ్తుంటే పిల్లలపై పరోక్షంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఈ ప్రభావం రెండు రకాలుగా ఉంది. ఒకటి కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూత పడటంతో గత కొద్ది నెలలుగా పిల్లలు చదువులకి దూరం అయ్యారు. రెండవది కరోనా వైరస్ నేపధ్యంలో పనులులేక అనేకమంది ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలలోని పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. యూనిసెఫ్, బాలల హక్కుల సంస్థ ‘సేవ్ ద చిల్డ్రన్’ విశ్లేషణ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు దారిద్య్ర కోరల్లో కూరుకుపోయారు. 70కి పైగా దేశాల్లో ఆరోగ్యం, గృహ నిర్మాణం, పోషణ, పారిశుద్ధ్యం, త్రాగునీరు లేకపోవటంతో కరోనా ప్రభావంతో పేదరికంలో కూరుకుపోయిన పిల్లల సంఖ్య 15% పెరిగింది. సుమారు 45 శాతం మంది పిల్లలు ఈ క్లిష్టమైన అవసరాల కొరతతో మరింతగా దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరిస్తోంది. పిల్లలు పేదరికం ద్రవ్య విలువ కంటే ఎక్కువని నివేదిక తెల్పుతుంది. ప్రస్తుతం పిల్లలకి ఆన్‌లైన్ విద్య తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. తలిదండ్రులు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంవల్ల ఆన్‌లైన్ ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలుసుకొనే పరిస్థితులలో లేరు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి సౌకర్యాలున్న కుటుంబాల్లో పిల్లలు ఆన్‌లైన్ ద్వారా కొంత వరకు చదువుకోగలుగుతున్నారు. అయితే వీరు ఎక్కువసేపు మొబైల్ ఫోన్‌తో గడపటం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు, పిల్లలకి ఉన్న సహజ సంబంధాన్ని ఆన్‌లైన్ విద్య నెలకొల్పలేదు. ఆన్‌లైన్ విద్యలో మూల్యాంకనం అనేది మరో పెద్ద సమస్య. గురువు పర్యవేక్షణ లేని ఆన్‌లైన్ విద్య సరియైన ఫలితాలివ్వదు.మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీరికి సరైన పౌష్టికాహారం లభించడం లేదు. పేద కుటుంబా ల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

ఉపాధి కోసం పిల్లల్ని కూడా ఏదో ఒక పనికి పంపిస్తున్నారు. దీని వల్ల డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం ఉంది. విద్యని కోల్పోయే పిల్లలు బాల కార్మికులు గా లేదా ముందస్తు వివాహానికి సన్నద్ధమవుతున్నారని యూనిసెఫ్ తెల్పుతుంది. పిల్లల్ని పేదరికం నుండి రక్షించడానికి సామాజిక రక్షణ, సమగ్ర ఆర్ధిక విధానాలు సామాజిక సేవల్లో పెట్టుబడులతోపాటు వారి కుటుంబాలని ఆదుకోవడానికి ఉపాధి అవకాశాలు ముఖ్యమని యూనిసెఫ్ వివరిస్తుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వచ్చేవరకు చౌక డిపోల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులని ప్రభుత్వం పంపిణీ చేయాలి. ట్యాబ్‌లను విద్యార్ధులకు ఉచితంగా అందించాలి. ఆన్‌లైన్ బోధనలో నాణ్యతని పెంచాలి. సిగ్నల్స్‌లేని ప్రాంతాల్లో చదువుకొన్న విద్యావంతుల ద్వారా ప్రత్యక్ష బోధనకి అవకాశం ఇవ్వాలి. దేశంలో 130 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ని అందించాలంటే 80 వేల కోట్ల రూపాయిలు అవసరమవుతాయని ‘సీరం’ సంస్థ తెల్పుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు నిధులు సమీకరించుకొని పేదవారికి ధనవంతులతో పాటు వ్యాక్సిన్ అందేటట్లు చూడాలి. లేనట్లయితే కరోనా మరణాల కన్నా ఆకలి మరణాలు దేశంలో ఎక్కువవుతాయి. ఫలితంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు.

* యం. రాంప్రదీప్- 9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News