Friday, March 29, 2024

కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి

- Advertisement -
- Advertisement -

కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి

మరో 53 మంది కూలీల గల్లంతు
భారీ వర్షాలకు కేరళ టీఎస్టేట్‌లో ఘోర దుర్ఘటన

కోచ్చి: భారీ వర్షాల కారణంగా ఇదుక్కి జిల్లా మున్నార్ కొండ ప్రాంతంలోని తేయాకు ఎస్టేట్‌లో నివసించే కూలీల నివాసాలపై కొండ చరియలు విరిగిపడి 15 మంది మరణించగా మరో 53 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకుపోయి, తీవ్రంగా గాయపడిన 12 మంది కూలీలను సహాయక బృందాలు వెలికితీశాయి. దేవీకుళం తాలూకాలోని రాజమల సమీపంలోని కన్నన్ దేవన్ హిల్స్ ప్లాంటేషన్ కంపెనీకి చెందిన న్యామకాడ్ ఎస్టేట్ వద్ద భారీ వర్షం కారణంగా తేయాకు తోటకు చెందిన కూలీల తాత్కాలిక నివాసాలపై మట్టి చరియలు విరిగిపడ్డాయి. 30 నివాసాలలో దాదాపు 78మంది కూలీలు నివసిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు కూలీల మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద నుంచి వెలికితీసిన క్షతగాత్రులను సహాయక బృందాలు మున్నార్‌లోని టాటా ఆసుపత్రికి తరలించాయి. న్యామకాడ్ ఎస్టేట్ కొండ ప్రాంతాలలో ఉండడం, అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, భారీ పొగమంచు, ఎడతెరపలేని వాన వంటి కారణాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎంఎం మణి విలేకరులకు తెలిపారు.

సమీపంలోని పెరియవర వద్ద ఉన్న వంతెన భారీ వర్షానికి కూలిపోవడంతో టీ ఎస్టేట్ వద్దకు చేరుకోవడానికి సహాయక బృందాలు చుట్టూ తిరిగి వెళ్లవలసి వచ్చినట్లు ఆయన చెప్పారు. సమీపంలో మెరుగైన ఆసుపత్రులు లేకపోవడం, రోడ్లు దెబ్బతినడం కారణంగా క్షతగాత్రులను ఇదుక్కి, ఎర్నాకుళంలోని ఆసుపత్రులకు హెలికాప్టర్లలో తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వైమానిక దళానికి విజ్ఞప్తి చేసింది. అయితే వాతావరణ పరిస్థితి కూడా అందుకు అనుకూలంగా లేనట్లు ముఖ్యమంత్రి పినచరయి విజయన్‌కు అధికారులు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా రాగల 24 గంటల్లో పథనంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి, వాయనాడ్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొండ ప్రాంతాలైన ఇదుక్కి, వాయనాడ్ జిల్లాలలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

15 people killed after Kerala landslide due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News