Home జాతీయ వార్తలు ప్రైవేట్ ఆపరేటర్లకు 150 రైళ్లు, 50 స్టేషన్లు

ప్రైవేట్ ఆపరేటర్లకు 150 రైళ్లు, 50 స్టేషన్లు

Indian Railways

 

బ్లూప్రింట్ రూపకల్పన కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు కేంద్రం యోచన

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో దేశంలో 150కి పైగా రైళ్లు, 50 రైల్వే స్టేషన్ల కార్యకలాపాలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు అవసరమైన బ్లూప్రింట్‌ను రూపొందించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే పనిలోప్రభుత్వం ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్‌కు నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ రాసిన లేఖ పేర్కొంది. ఈ సాధికారిక గ్రూపులో యాదవ్, అమితాబ్ కాంత్‌తో పాటుగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా ఉంటారు.

400కు పైగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే పనిని రైల్వేలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు కొన్ని స్టేషన్లను మాత్రమే ఆధునీకరించినట్లు అమితాబ్ కాంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై తాను రైల్వే మంత్రితో విపులంగా చర్చించానని, కనీసం 50 రైల్వే స్టేషన్ల విషయంలో ప్రాధాన్యతా క్రమంలో ఈ విషయాన్ని చేపట్టాల్సిన అవససరం ఉందని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన ఆ లేఖలో తెలిపారు. ఇటీవల ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి వివిధ శాఖల కార్యదర్శులతో ఒక సాధికారిక గ్రూపును ఏర్పాటు చేయడానికి కూడా ఇలాంటి ప్రక్రియ అవసరమని భావించడం జరిగింది.

ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలలోకి ప్రైవేట్ రైల్ ఆపరేటర్లను తీసుకు రావాలని, మొదటి దశలో కనీసం 150 రైళ్ల ప్రైవేటీకరణను చేపటాలని రైల్వేలు కూడా నిర్ణయించిన విషయం మీకు తెలిసిందేనని అమితాబ్ కాంత్ రైల్వే బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు, ఈ సాధికారిక గ్రూపులో రైల్వే బోర్డుకు చెందిన ఇంజనీరంగ్ సభ్యుడు, ట్రాఫిక్ విభాగం సభ్యుడికి కూడా భాగస్వామ్యం కల్పించడం జరుగుతుందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. ఈ నెల 4న లక్నోఢిల్లీ మార్గంలో ప్రారంభమైన తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలో తొలి ప్రైవేటు రైలు అన్న విషయం తెలిసింది. రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఈ రైలు ప్రయాణికుల కోసం ఐఆర్‌సిటిసి భోజన సదుపాయం, రూ.25 లక్షల దాకా ఉచిత బీమా సదుపాయం, ఆలస్యమైతే పరిహారం చెల్లింపు లాంటి పలు సదుపాయాలను కల్పించిన విషయం తెలిసిందే.

150 Trains, 50 Railway Stations Will Soon Be Privatised