Home జాతీయ వార్తలు దైవభూమిలో విషాదాలు

దైవభూమిలో విషాదాలు

 కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం
కోజికోడ్‌లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్
16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

మృతుల్లో పైలట్ సహా పలువురు సిబ్బంది
ఇడుక్కి జిల్లాలో కూలీల నివాసాలపై విరిగిపడ్డ కొండచరియలు
15మంది మృతి, 53మంది గల్లంతు, టీ ఎస్టేల్‌లో ఘోర దుర్ఘటన
సిఎం పినరయికి ప్రధాని మోడీ ఫోన్, ప్రమాదాలపై ఆరా

దైవభూమిగా పిలుచుకునే కేరళ రాష్ట్రాన్ని ఒకే రోజు విషాదాలు చుట్టుముట్టాయి. శుక్రవారంనాడు తెల్లవా రుతుండగానే భారీ వానలు, వరదలు అతలాకుతలం చేయగా అదే రోజు రాత్రి 7.40గంటల సమయంలో విమానం రూపంలో మరో విషాదం వచ్చి చేరింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో పైలట్ సహా 16 మంది మృత్యువాతపడ్డారు. ప్రమాద సమ యంలో విమానంలో మొత్తం 191మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు,అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై డిజిసిఎ విచారణకు ఆదేశింది. సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ సిఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. ఘటనపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు భారీ వర్షాలు ఇడుక్కి జిల్లాను అతలాకుతలం చేశాయి. తేయాకు ఎస్టేట్‌లో నివసించే ఇక్కడి కూలీల నివాసాలపై కొండ చరియలు విరిగిపడి 15మంది మృత్యువాత పడ్డారు. మరో 53మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. వరుస ఘటనలపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు 

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన డిఎక్స్‌బి సిసిజె బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్‌వే పై నుంచి జారి లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో పైలెట్ దీపక్ వసంత్ సాథే, కో పైలెట్, పది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారం మేరకు తెలిసింది. వందమందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు ప్రయాణికులతో వచ్చిన ఈ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మరికాసేపట్లో కరిపూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి పిల్లాపాపలతో ప్రయాణికులు ఇళ్లకు చేరుకోవల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. వందేభారత్ మిషన్ పరిధిలో ఈ విమానం ద్వారా దుబాయ్‌లోని భారతీయులను స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 191 మంది ఉన్నట్లు నిర్థారణ అయింది. వీరిలో 174 మంది ప్రయాణికులు, పది మంది పిల్లలు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. విమానాశ్రయంలో భారీ వర్షాలు రాత్రి చీకట్లు ఉండటంతో, కొందరిని ఇంకా శిథిలాల నుంచి వెలికితీయలేకపోవడం, వెలికితీసిన వారిలో గాయపడి విషమ పరిస్థతుల్లో చికిత్స పొందుతున్న వారు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చునని ఆందోళన వ్యక్తం అయింది.

34 అడుగుల లోయలో పతనం
రన్‌వే నుంచి జారిన విమానం పక్కనే ఉన్న 34 అడుగుల లోతైన లోయలో పడింది. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సరైన వెలుతురు లేని కారణంతో లేదా సాంకేతిక లోపం వల్లనో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి రెండు ముక్కలు అయినట్లు వెల్లడైంది. ఇదే వేగంతో పక్కన ఉన్న లోయలోకి జారుకుంది. భారీ వర్షాలతో రన్‌వేపైకి నీరు చేరుకుందని ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధంగా వర్షం కారణంగానే ముప్పు తలెత్తింది. అయితే సాధారణంగా విమానం రెండుగా పగిలితే లోపల ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతాయి. కానీ భారీ వర్షంతో మంటలు చెలరేగలేదు. దీనితో ప్రయాణికులు సజీవదహనం కాకుండా బయటపడ్డారని ప్రాధమిక అంచనాలో వెల్లడైంది. ప్రమాద ఘటన గురించి తెలియగానే అక్కడికి పది అంబులెన్స్‌లను తరలించారు. ఈ ప్రాంతానికి తాము వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కోజికోడ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ విమాన దుర్ఘటనపై పౌరవిమానయాన అధీకృత సంస్థ డిసిజిఎ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విమానం దుబాయ్ నుంచి కలికట్‌కు బయలుదేరింది.మధ్యలో కోజికోడ్‌లో కొద్దిసేపు ఆగుతుంది. మంగళూరు ఎయిర్‌పోర్టు మాదిరిగానే కోజికోడ్ విమనాశ్రయం రన్‌వే కూడా పర్వతాల మధ్య మలుపు తిరిగి ఉంటుంది. సాధారణంగా ఇక్కడి ఎయిర్‌పోర్టులు ఎతైన పర్వతాలపై ఉన్నాయి. ఇక్కడ రన్‌వేలపై విమానాలను దింపేటప్పుడు పైలెట్లు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ రన్‌వే ప్రాంతం ఇతరత్రా స్థలాలు ఒకే స్థాయిలో ఉన్నట్లుగా అన్పిస్తూ ఉంటుంది. ఈ దశలో ల్యాండింగ్ దశ అత్యంత క్లిష్టం అవుతుంది. అయితేఇప్పుడు భారీ వర్షంతో ఈ ప్రాంతం అంతా నీటిమయం అయి ఉండటంతో విమానం రన్‌వే నుంచి పక్కకు జారి లోయలో పడి ముక్కలు అయినట్లు వెల్లడైంది.

ప్రధాని తక్షణ స్పందన, అమిత్ షా విచారం 
కేరళలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడికి వెళ్లి సహాయ చర్యలను చేపట్టాలని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఆదేశించారు. కేరళ సిఎం పినరయి విజయన్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రధాని మోడీ కేరళ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రధాని తెలియచేశారని అధికార వర్గాలు తెలిపాయి.

16 killed after air india flight crash at Kozhikode Airport